పాక్ గూఢచారి సీమాకు.. బాగా ట్రైనింగ్ ఇచ్చి పంపారు : ఇంటెలిజెన్స్ వర్గాలు

పాక్ గూఢచారి సీమాకు.. బాగా ట్రైనింగ్ ఇచ్చి పంపారు : ఇంటెలిజెన్స్ వర్గాలు

పబ్జీ ప్రేమికురాలు  సీమా హైదర్  కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి.  నలుగురు పిల్లలతో భారత్‌లోకి చొరబడి, గ్రామీణ భారతీయ మహిళగా కనిపించేలా దుస్తులు ధరించి, మేకప్ లో నిపుణుల సహాయం తీసుకున్నట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.  సీమా హైదర్  భారతీయ స్త్రీగా కనిపించేందుకు జాగ్రత్తగా ప్లాన్ చేసింది.  

భద్రతా సంస్థలు గుర్తించలేని విధంగా తన పిల్లలకు కూడా అదే పద్ధతిలో దుస్తులు వేసినట్లు చెబుతున్నాయి ఇంటెలిజెన్స్ వర్గాలు. రూపమే కాకుండా, సీమా హైదర్ అనర్గళంగా భాషా నైపుణ్యాలను ప్రదర్శిస్తుందని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. దీని కోసం నేపాల్‌లో పనిచేస్తున్న పాకిస్తానీ హ్యాండ్లర్లు శిక్షణఇచ్చి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు భద్రతా అధికారులు. భారతదేశంలో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను నిర్వహించడానికి నేపాల్ సరిహద్దుల మీదుగా పంపబడిన మహిళలకు ఇటువంటి భాషా శిక్షణ ఇవ్వబడుతుందని  వర్గాలు తెలిపాయి.

సీమా హైదర్ కుటుంబ సభ్యుల వివరాలు పరిశీలిస్తే.. ఆమె అంకుల్​తో పాటు, ఆమె సోదరుడు పాకిస్తాన్ ఆర్మీలో పని చేస్తున్నాడని వెల్లడైంది. దీంతో సీమా ఐఎస్ఐ గూఢచారి కావొచ్చని ఏటీఎస్ అనుమానిస్తున్నది. సీమా ఐడెంటిటీ కార్డును పాకిస్తాన్ లోని ఇండియన్ హైకమిషన్ కు పంపించి వెరిఫై చేయించాలని భావిస్తున్నది. ఆమె పూర్తి ప్రొఫైల్ ను సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. 

మరోవైపు పాకిస్తాన్ లోని తన ప్రాపర్టీని అమ్మి ఇండియాకు వచ్చానని సీమా దర్యాప్తులో చెప్పింది. మొదట దుబాయ్ వెళ్లి, అక్కడి నుంచి నేపాల్ మీదుగా దేశంలోకి వచ్చినట్టు తెలిపింది. సీమాకు నిజంగా చదువు రాకపోతే.. ఇవన్నీ చేయడం ఎలా సాధ్యం? అని ఏటీఎస్ ఆశ్చర్యపోతున్నది. దీని వెనుక ఇంకెవరో ఉన్నారని, ఆమెకు ఎవరో సహకరించి ఉంటారని అనుమానిస్తున్నది. లేదంటే ఆమె బాగా చదువుకున్నదై ఉంటుందని భావిస్తున్నది. 

ఉత్తరప్రదేశ్ కు చెందిన సచిన్ మీనా (22)తో తరచూ ఆన్ లైన్ లో పబ్జీ గేమ్ ఆడిన సీమా హైదర్.. అతనితో ప్రేమలో పడింది. తన నలుగురు పిల్లలను తీసుకుని ఇండియాకు వచ్చేసింది. ఈ క్రమంలో అక్రమంగా దేశంలోకి వచ్చినందుకు సీమాను, ఆమెకు ఆశ్రయం ఇచ్చినందుకు సచిన్ ను ఈ నెల 4న పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత వాళ్లిద్దరికీ కోర్టు బెయిల్ ఇచ్చింది.