రేవంత్ హయాంలోనే పాలమూరు ప్రాజెక్టులు పూర్తవుతయి: మంత్రి జూపల్లి

రేవంత్ హయాంలోనే పాలమూరు ప్రాజెక్టులు పూర్తవుతయి: మంత్రి జూపల్లి

మహబూబ్​నగర్​ అర్బన్, వెలుగు : సీఎం రేవంత్​ రెడ్డి హయాంలోనే ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని ఇరిగేషన్​ ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సీఎం ఉమ్మడి జిల్లా ప్రాజెక్టుల పర్యటన సందర్భంగా బుధవారం మధ్యాహ్నం మహబూబ్​నగర్​లోని డీసీసీ ఆఫీసులో ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరతరాలుగా కృష్ణానదిలో ఉమ్మడి జిల్లాకు దక్కాల్సిన నీటి వాటా దక్కలేదన్నారు. 

గత ప్రభుత్వంలో సీఎంగా పని చేసిన కేసీఆర్ ప్రాజెక్టులను పూర్తి చేసి ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చి మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మోసాలను గ్రహించిన ప్రజలు కేసీఆర్​కు కుర్చీ లేకుండా చేశారన్నారు. 4, 5 తేదీల్లో సీఎం రేవంత్​ రెడ్డి ఉమ్మడి జిల్లా పర్యటన సందర్భంగా జడ్చర్లలో శుక్రవారం సాయంత్రం భారీ బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

 సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ విప్​, పాలమూరు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​ రెడ్డి మాట్లాడుతూ సీఎం పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కృషి  చేస్తున్నారన్నారు. సమావేశంలో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేద్ ఉల్లా కొత్వాల్, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, కార్పొరేషన్ మేయర్ మమత, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ పాల్గొన్నారు.