వేసవిలో తొలిసారి పల్లె ప్రగతి

వేసవిలో తొలిసారి పల్లె ప్రగతి
  • ఈ నెల 18 వరకు 15 రోజుల పాటు నిర్వహణ
  • మంత్రులు, ఎమ్మెల్యేలకు నిరసన సెగ తగిలే చాన్స్
  • పెండింగ్ బిల్లులు చెల్లించాలని సర్పంచ్​ల డిమాండ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి 5వ విడత పల్లె ప్రగతి, 4వ విడత పట్టణ ప్రగతి మొదలుకానుంది. ఈ నెల 18 వరకు అంటే 15 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. తొలి రోజు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఇందులో పాల్గొననున్నారు. ఏ రోజు ఏ కార్యక్రమం చేయాలన్న దానిపై పంచాయతీ రాజ్, మున్సిపల్ అంధికారులు షెడ్యూల్ ను ఖరారు చేసి ఇప్పటికే జిల్లాలు, మండలాలకు పంపారు. ప్రతి మండలానికి ఒక జిల్లాస్థాయి అధికారిని స్పెసల్ ఆఫీసర్ గా నియమించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. పల్లెప్రగతి కమిటీ ఏర్పాటు చేసి నేతలు, అధికారులను సభ్యులుగా నియమించాలన్నారు. డ్రైనేజీలు క్లీన్ చేయడం, కరెంటు సమస్యలను పరిష్కరించడం, పాత బావులు, బోర్లను పూడ్చటం, శిథిల ఇండ్ల తొలగింపు చేపట్టాలని అధికారులు తెలిపారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కలు 
ఇవ్వాలన్నారు.

తొలిసారి వేసవిలో

పల్లె ప్రగతి తొలిసారి వేసవిలో నిర్వహిస్తున్నారు. వాస్తవానికి వర్షాకాలంలో ఈ చేస్తే సీజనల్ వ్యాధులను నివారించొచ్చని అధికారులు, సర్పంచ్ లు అంటున్నారు. ఈనెల18న పోగ్రామ్ కంప్లీట్ అయితే సెప్టెంబర్ వరకు వర్షాలతో గ్రామాలు శానిటేషన్ పరంగా క్లీన్ గా ఉండవని చెబుతున్నారు.పల్లె ప్రగతి తొలిరోజు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, జిల్లా కలెక్టర్లు పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే తొలి రోజు సర్పంచ్ ల నుంచి వీరికి నిరసన సెగ ఎదురయ్యే సూచనలు కనపడుతున్నాయి. కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పల్లెప్రగతి సన్నాహక మీటింగ్ లలో సర్పంచ్​లు నిరసనలు తెలుపుతున్నరు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పల్లె ప్రగతిలో పాల్గొనబోమని అంటున్నరు. రాష్ట్రంలో ఉన్న సర్పంచ్ లలో 90 శాతం టీఆర్ ఎస్ పార్టీ వాళ్లే ఉన్నారు. వీళ్లు సైతం నిరసనల్లో పాల్గొంటున్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని సర్పంచ్ లు పల్లె ప్రగతి ని బహిష్కరిస్తున్నట్లు గురువారం ప్రకటించారు. పంచాయతీ కార్యదర్శులతో పనులు చేయిస్తే రాజీనామాలు చేస్తామని కలెక్టర్ కు లేఖ రాశారు. ఇప్పటికే చేసిన పనులకు ఆరు నెలలుగా బిల్లులు ఇవ్వటంలేదని లేఖలో పేర్కొన్నారు. ఇదే దిశలో మరి కొంత మంది పలు జిల్లాల్లో అల్టిమేటం ఇస్తున్నట్లు తెలస్తోంది.