
ఘట్కేసర్, వెలుగు: పోచారం మున్సిపాలిటీ కొర్రెముల రెవెన్యూ పరిధిలోని పలు సర్వే నంబర్లలో దాదాపు 12 ఎకరాల స్థలంలో హెచ్ఎండీఎ లేఔట్ చేస్తున్న నిర్వాహకులు 85 తాటిచెట్లను తొలగించడంపై గీత కార్మిక సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తాటిచెట్లను తొలగించి గీత కార్మికుల పొట్ట కొట్టారని ఆరోపిస్తూ గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టారు.
మంగళవారం దీక్షా శిబిరానికి కాంగ్రెస్ మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి తోటకూర వజ్రేశ్‌యాదవ్ వచ్చి మద్దతు తెలిపారు. అనంతరం కూల్చిన చెట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాతల నాటి నుంచి 85 తాటి చెట్లను నమ్ముకొని 300 పైగా కుటుంబాలు జీవనం పొందుతున్నాయని చెప్పారు. అన్నారు.
ఒక్కో చెట్టుకు రూ.897 చొప్పున వెలకొట్టి వాటిని తొలగించడం దుర్మార్గమన్నారు. వెంచర్ నిర్వాహకుల వల్ల గీత కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. కార్యక్రమంలో వేముల మహేశ్‌గౌడ్, పల్లె బాబురావుగౌడ్, దేశం బాలరాజ్ గౌడ్, కుర్ర విగ్నేశ్వర్ గౌడ్, అనిల్ గౌడ్, కట్ట దర్శనగౌడ్, భాస్కర్ గౌడ్, నగేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అనుమతులు తీసుకున్నాం..
రూల్స్ ప్రకారం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తీసుకున్నాకే చెట్లు తొలగించామని వెంచర్ యజమాని రవి తెలిపారు. ఒక నెలలో 425 తాటి మొక్కలు నాటుతామని హామీపత్రం కూడా ఇచ్చామన్నారు. కొందరు వ్యక్తులు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని
ఆరోపించారు.