ట్రంప్ మెడపై ఏంటా గాయం.. ఆరోగ్యంగానే ఉన్నాడా..!

ట్రంప్ మెడపై ఏంటా గాయం.. ఆరోగ్యంగానే ఉన్నాడా..!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెల్త్ కండీషన్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నాడా..? అసలు ఆయనకు ఏమైంది..? అన్న చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి. సోమవారం (మార్చి 2)  వైట్ హౌస్‎లో ఇరాన్ యుద్ధంపై ప్రసంగిస్తుండగా ట్రంప్ మెడపై ఒక గాయం కనిపించడమే ఈ చర్చలకు ప్రధాన కారణం. ట్రంప్ మెడపై కుడి వైపు ఒక ఎర్రటి మచ్చ (దద్దురు) కనిపించింది. దీంతో ఆయన ఆరోగ్యంపై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. 

ఈ క్రమంలో ట్రంప్ మెడపై కనిపించిన గాయంపై అతని వ్యక్తిగత వైద్యుడు  సీన్ బార్బబెల్లా క్లారిటీ ఇచ్చారు.  ట్రంప్ తన మెడకు కుడి వైపున స్కిన్ ఇన్ఫెక్షన్‎కు చాలా సాధారణమైన క్రీమ్‌ను ఉపయోగిస్తున్నారని.. ఇది చర్మ చికిత్స నివారణ దుష్ప్రభావమని పేర్కొన్నారు. ఆ మచ్చ కొన్ని వారాల పాటు ఉంటుందని చెప్పారు.

గతంలో కూడా ప్రెసిడెంట్ ట్రంప్‎కు స్కిన్ ఇన్ఫెక్షన్ వ్యాధి వచ్చిన విషయం తెలిసిందే. దావోస్ ఆర్ధిక సమ్మిట్‎లో మాట్లాడుతుండగా ఆయన చేతికి ఎర్రటి మచ్చలు కనిపించడంతో అప్పట్లో ట్రంప్ ఆరోగ్యంపై జోరుగా చర్చ జరిగింది. అయితే.. ఇతర దేశాధినేతలు, అధికారులతో ట్రంప్ తరచు కరచాలనం చేయడంతో పాటు హృదయ ఆరోగ్యానికి ఆస్ప్రిన్ వాడటం దీనికి కారణమని వైద్యులు క్లారిటీ ఇచ్చారు.

►ALSO READ | అమెరికా- ఇజ్రాయోల్ దాడులు.. ఇరాన్ లో 787 మంది మృతి

తాజాగా మరోసారి ట్రంప్ చర్మంపై ఇదే తరహా మచ్చలు కనిపించడంతో ఆయన హెల్త్ కండీషన్‎పై మళ్లీ చర్చలు మొదలయ్యాయి. ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం భీకరంగా సాగుతోన్న వేళ ట్రంప్ మెడపై గాయం కనిపించడంతో అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై వైట్ హౌస్ వైద్య విభాగం వివరణ ఇచ్చింది. ట్రంప్ కు ఎలాంటి ప్రమాదం లేదని.. ఆరోగ్యంగా ఉన్నారని తెలిపింది.