వెండి.. మళ్లీ రూ. 4 లక్షలు అవుతుందా లేక రూ.5 లక్షలు అవుతుందా..?

వెండి.. మళ్లీ రూ. 4 లక్షలు అవుతుందా లేక రూ.5 లక్షలు అవుతుందా..?

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు మళ్లీ గోల్డ్, సిల్వర్ రేట్లకు రెక్కలు ఇస్తున్నాయి. ఇజ్రాయెల్-అమెరికా దాడులు, దానికి ప్రతిగా ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో సురక్షిత పెట్టుబడిగా భావించే వెండి ధరలు భారీగా పుంజుకుంటున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో కిలో వెండి ధర మళ్లీ రూ.4 లక్షల మార్కును చేరుకుంటుందా అనే చర్చ ఇన్వెస్టర్లలో మొదలైంది.

మంగళవారం MCX మార్కెట్లో కిలో వెండి ధర రూ.2లక్షల 80వేల 090 వద్ద కొనసాగింది. అంతకుముందు వారంలో ఇది ఏకంగా రూ.2.86 లక్షలను తాకింది. యుద్ధ ఉద్రిక్తతల వల్ల కేవలం ఒక్కరోజులోనే వెండి ధర ఏకంగా రూ.20వేలు పెరగడం గమనార్హం. ఇదే సమయంలో బంగారం కూడా తులం(10 గ్రాములు) రూ.లక్షా 66వేలకు చేరి సరికొత్త రికార్డులను సృష్టించింది.

ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు
పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి వల్ల ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. షేర్ మార్కెట్ల కంటే బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టడమే సురక్షితమని భావిస్తున్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణల వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. భారత్ వంటి దేశాల్లో చమురు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఇది పరోక్షంగా బులియన్ మార్కెట్‌కు బలాన్నిస్తుందని తెలిసిందే. అయితే వెండి కేవలం ఆభరణాలకే పరిమితం కాలేదు. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాల్లో దీని వినియోగం ఎక్కువ. సప్లై చైన్ దెబ్బతింటే కొరత ఏర్పడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

►ALSO READ | ఆదాయం రూ.5 లక్షలు.. కట్టిన ఇన్సూరెన్స్ రూ.50 లక్షలు: ఐటీ శాఖ ఉచ్చులో మహిళా టాక్స్ పేయర్

నిపుణులు ఏమంటున్నారు?
యుద్ధం గనుక ఇప్పుడు ఉన్నట్లుగానే కొనసాగితే ఇన్వెస్టర్ల రిస్క్ ప్రీమియం పెరిగి ధరలు సరికొత్త రికార్డులను తాకవచ్చని ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్(IBJA) వైస్ ప్రెసిడెంట్ అక్ష కాంబోజ్ అభిప్రాయపడ్డారు. అయితే ధరల పెరుగుదల అనేది యుద్ధం ముగింపు.. దేశాల ద్రవ్య పరపతి విధానాలపై ఆధారపడి ఉంటుందని ఆమె అన్నారు. ధరలు పెరుగుతున్నా ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న వెండిని అమ్మకాలకు మొగ్గు చూపడం లేదని మరోవైపు, అగ్మోంట్ గోల్డ్ రీసెర్చ్ హెడ్ రేనిషా చైనాని వెల్లడించారు. ధరలు తగ్గిన ప్రతిసారీ కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉండటం వెండిపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది.

రూ.4 లక్షల మార్కు సాధ్యమేనా?
గతంలో వెండి రూ.4 లక్షల 25వేల మార్కును దాటిన సందర్భాలు ఉన్నాయి. 2025లో వెండి ఏకంగా 125% వృద్ధిని నమోదు చేసింది. ప్రస్తుతం నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఇలాగే కొనసాగితే, రాబోయే రోజుల్లో వెండి మరోసారి రూ.4 లక్షల మైలురాయిని చేరుకోవడానికి ప్రయత్నించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే మార్కెట్లో అస్థిరత ఎక్కువగా ఉంటుందని, ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.