- ఢిల్లీ హైకోర్టు తీర్పును కొట్టివేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసేందుకు ఆధార్, పాన్ అనుసంధానం తప్పనిసరి అని బుధవారం సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆధార్, పాన్ అనుసంధానం లేకుండా ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయొచ్చని ఢిల్లీ హైకోర్టు గతంలో ఇచ్చిన ఆర్డర్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. 2019–20 అసెస్‌మెంట్ ఇయర్ నుంచి కచ్చితంగా పన్ను రిటర్నులకు ఆధార్, పాన్ అనుసంధానం తప్పనిసరి అని సుప్రీంకోర్టు పేర్కొంది.
‘2018-19 అసెస్ మెంట్ ఇయర్‌ను తీసుకుంటే, హైకోర్టు ఆర్డర్ ప్రకారం రెస్పాడెంట్లు తమ ఇన్‌కమ్
ట్యాక్స్ రిటర్నులను దాఖలు చేసేశారు. ఆ అసెస్ మెంట్ ఇయర్ కూడా పూర్తయింది. ప్రస్తుత అసెస్‌మెంట్ ఇయర్ 2019-20ను తీసుకుంటే, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయాలి’ అని జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అబ్దుల్ నజీర్‌లతో కూడిన బెంచ్ పేర్కొంది.
శ్రేయ సేన్ అనే పన్నుచెల్లింపుదారునికి, ఆధార్, పాన్ అనుసంధానం లేకుండా అసెస్‌మెంట్ ఇయర్ 2018–19కు చెందిన ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసుకునేలా ఢిల్లీ హైకోర్టు 2018 ఫిబ్రవరి 24న అనుమతి ఇచ్చింది. అదేవిధంగా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సంఖ్యను సమర్పించాలని ఆదాయపు పన్ను శాఖ బలవంతం చేయకర్లేదని కూడా తీర్పునిచ్చింది. ఈ ఆర్డర్‌కు వ్యతిరేకంగా ఆదాయపు పన్ను శాఖ అప్పీల్‌కు వెళ్లింది. ఈ అప్పీల్‌ను జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అబ్దుల్ నజీర్‌ల బెంచ్ విచారించింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ.. ఆధార్, పాన్ లింక్ తప్పనిసరి అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
అంతేకాక ఐటీ చట్టంలోని సెక్షన్ 139ఏఏను సమర్థించింది. సెక్షన్ 139ఏఏ ను ఆదాయపు పన్ను
చట్టంలోకి ‘ఫైనాన్స్ యాక్ట్ 2017’ చేర్చింది.
