- వార్డులకు 85,428 మంది..
- 5 సర్పంచ్, 133 వార్డులకు నామినేషన్లు నిల్
- తేలిన మొదటి విడత లెక్క
హైదరాబాద్, వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో తొలి విడత నామినేషన్ల పర్వం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 4,236 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా.. 22,330 మంది నామినేషన్లు వేశారు. ఇక 37,440 వార్డులకు గాను 85,428 మంది నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే, రాష్ట్రవ్యాప్తంగా 5 సర్పంచ్ స్థానాలకు, 133 వార్డులకు నామినేషన్లు రాకపోవడంతో అక్కడ ఎన్నికలు జరగడం లేదు. బుధవారం ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత ఎంతమంది ఏకగ్రీవమయ్యారు.. ఎన్ని స్థానాలకు ఎంతమంది పోటీలో నిలిచారనేది స్పష్టత రానున్నది. నామినేషన్ల సంఖ్యలో నల్లగొండ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది.
318 పంచాయతీలకు గాను అత్యధికంగా 1,950 మంది సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. సగటున ఒక్కో పదవికి 6 గురు పోటీ పడుతున్నారు. ములుగు జిల్లాలో అత్యల్పంగా 48 పంచాయతీలకు కేవలం 273 మంది మాత్రమే నామినేషన్లు వేశారు. వార్డు మెంబర్ల నామినేషన్లలోనూ నల్లగొండ జిల్లా రికార్డు సృష్టించింది. 2,870 వార్డులకు గాను ఏకంగా 7,893 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ములుగు జిల్లాలో అత్యల్పంగా 420 వార్డులకు కేవలం 959 మంది మాత్రమే నామినేషన్లు వేశారు.
