మే, జూన్​ సాలరీలు పెండింగ్​లో పెట్టిన సర్కార్​

మే, జూన్​ సాలరీలు పెండింగ్​లో పెట్టిన సర్కార్​

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న 36,500 మంది మల్టీపర్పస్ వర్కర్లకు మే, జూన్​ నెల జీతాలు ఇంకా చెల్లించలేదు. దీంతో కార్మికులు తమ కుటుంబాలను పోషించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రూ.8500 వేతనంతో పనిచేస్తున్న కార్మికుల్లో 90  శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారే ఉన్నారు. వారిలో బిల్ కలెక్టర్లు, కారోబార్లు, వాటర్ మెన్​, స్ట్రీట్ లైట్ ఆపరేటర్లు ఉన్నారు. వారి వేతనాలు గ్రామ పంచాయతీనే చెల్లించాల్సి ఉండగా ట్రెజరీ అధికారులు చెక్కులను క్లియర్ చేయడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

జీతం తక్కువ, పని ఎక్కువ
కొన్ని రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. వరదలకు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. దీంతో గ్రామాల్లో సానిటేషన్, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, దోమలు రాకుండా ఫాగింగ్ చేయడం, డ్రైనేజీలు క్లీన్ చేయడం వంటి పనులతో కార్మికులు ఫుల్ బిజీగా ఉన్నారు. నిత్యం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పనిచేస్తున్నామని వారు చెప్తున్నారు. అయితే తమకు ఇచ్చేది  రూ.8500  జీతం అని, అది కూడా సకాలంలో ఇవ్వడం లేదని, దీంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలతో వచ్చే జీతం సరిపోక  బతకలేకపోతున్నామని, అప్పులు తెచ్చి కుటుంబాలను పోషించుకుంటున్నామని వాపోయారు. గ్రామ పంచాయతీల్లో మరో 17 వేల మంది కార్మికులు అవసరమని, ఆ సిబ్బందిని ప్రభుత్వం భర్తీ చేయడం లేదని, దీంతో తమపై పనిభారం, ఒత్తిడి అధికంగా పెరిగిపోతోందని పేర్కొన్నారు. 

8500తో ఎట్లా బతకాలె?
తమకు జీతాలు పెంచాలని రాష్ర్టవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులు ఎంతో కాలంగా సర్కారును కోరుతున్నారు.  సర్కారు మాత్రం వారి సమస్యలను పట్టించుకోవడం లేదు. మరోవైపు మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న కార్మికుల జీతాన్ని 2014, 2015, 2017, 2022 లో సర్కారు నాలుగుసార్లు పెంచింది. తమపై ఎందుకింత వివక్ష అని జీపీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఎన్నో ఏళ్లుగా గ్రామాల్లో నీటి సరఫరా, డ్రైనేజీల క్లీనింగ్ తో పాటు అన్ని పనులు చేస్తున్నాం. పల్లె ప్రగతిలో కార్మికులు అద్భుతంగా పనిచేశారని మంత్రులు , సీఎం పొగిడారు తప్ప జీతాలు మాత్రం పెంచటం లేదు. గత ఏడాది నుంచి స్కూళ్ల క్లీనింగ్ బాధ్యతను కూడా ప్రభుత్వం మాకే (కార్మికులకు) అప్పగించింది. ప్రస్తుత పరిస్థితుల్లో రూ.8500 వేలతో ఎలా బతకాలి? ఊర్లలో రోజు కూలికి వెళితేనే రూ.500 ఇస్తున్నారు. ప్రభుత్వం మాత్రం మా జీతాలు పెంచడం లేదు” అని కార్మికులు చెబుతున్నారు.

అడిగితే బెదిరిస్తున్నరు 
గత 6 నెలలుగా జీతాలు టైమ్​కు ఇస్తలేరు. సగం సగం జీతాలు ఇస్తున్నరు. అడిగితే ఇష్టముంటే చేయండి లేకపోతే మానేయండి అని బెదిరిస్తున్నరు. సర్పంచ్, సెక్రటరీలు వేధిస్తున్నరు.  రోజూ12 గంటలు పనిచేస్తున్నం. గ్రామ పంచాయతీ పని పూర్తి కాగానే సర్పంచ్, సెక్రటరీ ఇంటి దగ్గర పని చేయించుకుంటున్నరు.  చాలా మంది పని చేయలేక మానేస్తున్నరు. డ్రైవింగ్ పనులు, కరెంట్ పనులు కూడా చేపిస్తున్నరు.
- మహేష్ , నాగర్ కర్నూలు జిల్లా, తెలకపల్లి మండలం  

కరోనా టైమ్​లో ప్రాణాలకు తెగించి పనిచేశారు 
జీపీ కార్మికులు కరోనా టైమ్ లో ప్రాణాలకు తెగించి పనిచేశారు. ఇపుడు స్కూళ్లను శుభ్రం చేస్తున్నరు. ఇచ్చే జీతాలు అయినా సకాలంలో ఇయ్యకపోతే  కార్మికులు, వారిపై ఆధారపడిన  కుటుంబాలు ఎలా బతుకుతారో అధికారులకే తెలియాల. మరో వారంలో ఈ నెల పూర్తవుతుంది. గత నెల జీతమే ఇంకా చాలా జిల్లాల్లో పడలేదు.
- పాలడుగు భాస్కర్ , గౌరవ అధ్యక్షుడు, గ్రామ పంచాయతీ కార్మికుల యూనియన్