వాంటెండ్‌‌‌‌ దొంగ ఇబ్రహీం సిద్ధిక్ అరెస్ట్

వాంటెండ్‌‌‌‌ దొంగ ఇబ్రహీం సిద్ధిక్ అరెస్ట్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: వరుస చోరీలకు పాల్పడుతున్న వాంటెండ్‌‌‌‌ దొంగ ఇబ్రహీం సిద్ధిక్ను పంజాగుట్ట పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. రూ.45 లక్షలు విలువ 753.419 గ్రాముల బంగారం, వెండి, డైమండ్ ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీపీ సీవీ ఆనంద్‌‌‌‌ సోమవారం వెల్లడించారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌‌‌‌కు చెందిన మహ్మద్‌‌‌‌ ఇబ్రహీం సిద్ధిక్‌‌‌‌(61) కమల్ తివారి, రమేశ్, షరీఫ్‌‌‌‌ అనే మారు పేర్లతో తిరుగుతూ అమీర్‌‌‌‌‌‌‌‌పేట్‌‌‌‌లో ఉంటున్నాడు. తాళాలు వేసిన ఇండ్లను టార్గెట్‌‌‌‌ చేసి వరుస చోరీలకు పాల్పడుతున్నాడు. దీంతో మూడు కమిషనరేట్ల పరిధిలో సిద్ధిక్‌‌‌‌ పై 98 కేసులు నమోదయ్యాయి.  ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ ‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, కేపీహెచ్‌‌‌‌లో నమోదైన కేసులో 2021లో అరెస్టై పీడీ యాక్ట్‌‌‌‌పై జైలుకు వెళ్లాడు.

గతేడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌ లో విడుదలై మళ్లీ చోరీలు చేయడం ప్రారంభించాడు. ఈ నెల 17న అర్ధరాత్రి పంజాగుట్ట పీఎస్ పరిధి శ్రీనగర్ కాలనీ కాప్రి టవర్స్‌‌‌‌లోని 5వ ఫ్లోర్‌‌‌‌‌‌‌‌లో తాళం వేసి ఉన్న ఫ్లాట్‌‌‌‌ లోకి చొరబడి ఆల్మారాలో ఉన్న బంగారం, వెండి, డైమండ్స్‌‌‌‌ నగలను చోరీ చేశాడు. బాధితురాలు సుమిత్ర  ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌‌‌‌, ఫింగర్​ప్రింట్​లను పరిశీలించి సిద్ధిక్‌‌‌‌ను గుర్తించారు. మరో చోరీకి ప్రయత్నిస్తుండగా సోమవారం అమీర్‌‌‌‌‌‌‌‌పేట్‌‌‌‌లో అరెస్ట్ చేశారు.