సుప్రీంకోర్టు కీలక తీర్పు: తల్లిదండ్రులను పట్టించుకోకుంటే.. పిల్లలకు ఆస్తిలో హక్కు లేదు

సుప్రీంకోర్టు కీలక తీర్పు:  తల్లిదండ్రులను పట్టించుకోకుంటే.. పిల్లలకు ఆస్తిలో హక్కు లేదు
  • అలా ప్రవర్తించేవాళ్లను  ఇంట్లోంచి వెళ్లగొట్టొచ్చు
  • బదిలీ చేసిన ఆస్తులనూ పేరెంట్స్​ వాపస్‌‌‌‌‌‌‌‌ తీస్కోవచ్చని వెల్లడి
  • మహారాష్ట్రకు చెందిన వృద్ధ దంపతుల కేసులో ఉత్తర్వులు

న్యూఢిల్లీ: వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోకపోతే పిల్లలకు వాళ్ల ఆస్తులను అనుభవించే హక్కు లేదని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. అలా ప్రవర్తించేవాళ్లను ఇంట్లోంచి వెళ్లగొట్టవచ్చని పేర్కొంది. తన ఇంట్లో నివాసం ఉండేందుకు అనుమతించని కొడుకుపై 80 ఏండ్ల వృద్ధుడు, తన 78 ఏండ్ల భార్య దాఖలు చేసిన ఫిర్యాదుపై సుప్రీంకోర్టు ఈ కీలక తీర్పును వెలువరించింది. 

2007లో చేసిన వృద్ధుల సంక్షేమ చట్టం ప్రకారం.. కొడుకులకు, బిడ్డలకు ఇచ్చిన ఆస్తిని తల్లిదండ్రులకు తిరిగి అప్పగించే అధికారం ట్రిబ్యునళ్లకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ వృద్ధ జంట కేసులో ముంబై హైకోర్టు ఇదివరకే ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసి, ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది. గతంలోనూ సుప్రీం కోర్టు ఇదే తరహా తీర్పునిచ్చింది. తల్లిదండ్రుల బాగోగులు పట్టించుకోని వారసులకు ఆస్తిని పొందే హక్కు లేదని సుప్రీంకోర్టు చెప్పింది. 

కొడుకు ఇల్లు ఖాళీ చేయాల్సిందే.. 

మహారాష్ట్రకు చెందిన వృద్ధ జంట గతంలో ముంబైలో రెండు ఇండ్లను కొని, తమ ముగ్గురు పిల్లలకిచ్చియూపీకి వెళ్లారు. తిరిగి వచ్చిన తల్లిదండ్రులను పెద్ద కొడుకు ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో ఆ వృద్ధులు 2023లో ట్రిబ్యునల్‌‌ను ఆశ్రయించారు. దీంతో ముంబైలోని వాళ్ల ఇంటిని ఖాళీ చేయాలని, పోషణ ఖర్చు కింద నెలకు రూ.3 వేలు ఇవ్వాలని ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది.

 దీనిపై హైకోర్టులో పెద్ద కొడుకు అప్పీల్‌‌ చేయగా, ట్రిబ్యునల్‌‌ తీర్పును కొట్టివేసింది. కొడుకు కూడా సీనియర్‌‌‌‌ సిటిజనే కాబట్టి ఆయనను ఇంట్లోంచి పంపించలేమని చెప్పింది. ఈ తీర్పుపై వృద్ధులు సుప్రీంకు వెళ్లగా, హైకోర్టు తీర్పును తప్పుపట్టింది. పిటిషన్‌‌ వేసేనాటికి కొడుకు వయసు 59 ఏండ్లే కాబట్టి సీనియర్‌‌‌‌ సిటిజన్‌‌గా పరిగణించలేమంది. 

ట్రిబ్యునల్‌‌ తీర్పు సరైందేనని, నవంబర్ 30లోగా ఇల్లు ఖాళీ చేసి ఇచ్చేయాలని ఆదేశించింది. ఇలాంటి వివాదాల్లో పిల్లలకు బదిలీ చేసిన ఆస్తులపై యాజమాన్య హక్కులు తిరిగి తల్లిదండ్రులకు ఇచ్చే అధికారం ట్రిబ్యునళ్లకు ఉందని స్పష్టం చేసింది. 

హిందూ వితంతువు ఆస్తి.. భర్త వారసులకే

పిల్లలు లేని, భర్త చనిపోయిన హిందూ మహిళ వీలునామా రాయకుండా చనిపోతే.. ఆమె ఆస్తి భర్త వారసులకే దక్కుతుందని సుప్రీం తీర్పునిచ్చింది. హిందూ వారసత్వ చట్టం1956లోని సెక్షన్‌‌ 15(1)(బి) నిబంధనను సవాల్‌‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై  కోర్టు గురువారం విచారించింది. 

హిందూ సాంప్రదాయాల ప్రకారం కన్యాదానం, గోత్రదానం వంటివాటిని పరిగణనలోకి తీసుకుంటే ఆమె ఆస్తిలో హక్కు అత్తామామలకే చెందుతుందని పేర్కొంది. వివాహం తర్వాత మహిళ తన భర్త కుటుంబంలో భాగమవుతుందని, ఆమె గోత్రం భర్త కుటుంబ గోత్రంగా మారుతుందని గుర్తుచేసింది. ఎన్నో ఏండ్లుగా వస్తున్న హిందూ సాంప్రదాయాన్ని తమ తీర్పు ద్వారా మార్చలేమని స్పష్టం చేసింది.