గర్భాశయ క్యాన్సర్‌‌‌‌ నివారణకు 14 నుంచి 15 ఏండ్ల బాలికలకు ఫ్రీగా టీకా.. ముందుకురాని బాలికల తల్లిదండ్రులు

గర్భాశయ క్యాన్సర్‌‌‌‌ నివారణకు 14 నుంచి 15 ఏండ్ల బాలికలకు ఫ్రీగా టీకా.. ముందుకురాని బాలికల తల్లిదండ్రులు
  • హెచ్‌‌‌‌పీవీ వ్యాక్సిన్‌‌‌‌కు స్పందన అంతంతే..
  • రాష్ట్రవ్యాప్తంగా 23 శాతానికి మించని వ్యాక్సినేషన్‌‌‌‌
  • గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌‌‌‌ నివారణకు 14 నుంచి 15 ఏండ్ల బాలికలకు ఫ్రీగా టీకా
  • అన్ని గవర్నమెంట్‌‌‌‌ హాస్పిటల్స్‌‌‌‌లో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌‌‌‌
  • పబ్లిసిటీ చేసినా ముందుకురాని బాలికల తల్లిదండ్రులు
  • 69 శాతం వ్యాక్సినేషన్‌‌‌‌తో పెద్దపల్లి జిల్లా ఫస్ట్‌‌‌‌, 3 శాతంతో హైదరాబాద్‌‌‌‌ లాస్ట్‌‌‌‌ 

మంచిర్యాల, వెలుగు : మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌‌‌‌తో పాటు మరికొన్ని క్యాన్సర్లను నివారించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం హెచ్‌‌‌‌పీవీ (హ్యూమన్‌‌‌‌ పాపిల్లోమా వైరస్) వ్యాక్సినేషన్‌‌‌‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా 14 నుంచి 15 సంవత్సరాల బాలికలకు ‘గార్డాసిల్‌‌‌‌’ అనే వ్యాక్సిన్‌‌‌‌ను వేస్తున్నారు. ఇది హెచ్‌‌‌‌పీవీ టైప్‌‌‌‌ 16, 18తో పాటు టైప్‌‌‌‌ 6, 11 రకాల నుంచి రక్షణ కల్పిస్తుందని కేంద్రం ప్రకటించింది. 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న తెలంగాణలో హెచ్‌‌‌‌పీవీ వ్యాక్సినేషన్‌‌‌‌ను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పీహెచ్‌‌‌‌సీలు, సీహెచ్‌‌‌‌సీలు, ఎంసీహెచ్‌‌‌‌లలో హెచ్‌‌‌‌పీవీ వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచడంతో పాటు ఫ్రీగా వ్యాక్సినేషన్‌‌‌‌ చేసేందుకు చర్యలు చేపట్టారు. కానీ ప్రజల నుంచి మాత్రం స్పందన కనిపించడం లేదు.

  • ఆసక్తి చూపని బాలికల తల్లిదండ్రులు

వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 3,51,343 మంది బాలికలను గుర్తించి వారికి హెచ్‌‌‌‌పీవీ వ్యాక్సిన్‌‌‌‌ ఇవ్వాలని టార్గెట్‌‌‌‌గా పెట్టుకున్నారు. వ్యాక్సినేషన్​పై గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ ప్రజల నుంచి ఆశించిన స్పందన రావడం లేదని ఆఫీసర్లు పేర్కొంటున్నారు. వ్యాక్సిన్‌‌‌‌పై తల్లిదండ్రులకు సరైన అవగాహన లేకపోవడమో, లేదా సైడ్‌‌‌‌ ఎఫెక్ట్స్​వస్తాయన్న భయమో కానీ బాలికలను హాస్పిటల్స్‌‌‌‌కు తీసుకెళ్లి వ్యాక్సిన్‌‌‌‌ వేయించేందుకు ఆసక్తి చూపడం లేదు. 

జూన్ 5 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 81,621(23 శాతం) మంది మాత్రమే వ్యాక్సిన్‌‌‌‌ తీసుకున్నారు. 69 శాతం వ్యాక్సినేషన్‌‌‌‌తో పెద్దపల్లి జిల్లా ముందంజలో ఉండగా.. రాజన్న సిరిసిల్లలో 66, ఖమ్మం జిల్లాలో 62 శాతం వ్యాక్సినేషన్‌‌‌‌ కంప్లీట్‌‌‌‌ అయింది. ఇక మూడు శాతం వ్యాక్సినేషన్‌‌‌‌తో హైదరాబాద్​జిల్లా అట్టడుగున ఉండగా.. మేడ్చల్‌‌‌‌ జిల్లాలో 7 శాతం, నల్గొండలో 11, ములుగులో 14, నారాయణపేట జిల్లాల్లో 16 శాతం వ్యాక్సినేషన్‌‌‌‌ పూర్తయింది. మిగతా జిల్లాల్లో 20 నుంచి 40 శాతం మాత్రమే వ్యాక్సినేషన్‌‌‌‌ పూర్తయింది. మంచిర్యాల జిల్లాలో 8,184 మందికిగానూ ఇప్పటివరకు 1,097 మంది 
వ్యాక్సిన్‌‌‌‌ వేసుకున్నారు. 

  • తీవ్రమైన సైడ్‌‌‌‌ ఎఫెక్ట్స్‌‌‌‌ ఉండవంటున్న హెల్త్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌

హెచ్‌‌‌‌పీవీ వ్యాక్సిన్‌‌‌‌ తీసుకోవడం వల్ల ఎలాంటి తీవ్రమైన సైడ్‌‌‌‌ ఎఫెక్ట్స్‌‌‌‌ ఉండవని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. అయితే ఇంజెక్షన్‌‌‌‌ ఇచ్చిన చోట వాపు, నొప్పి రావడంతో పాటు చిన్నపాటి గడ్డ ఏర్పడవచ్చని, వ్యాక్సినేషన్‌‌‌‌ తర్వాత తేలికపాటి జ్వరం, తలనొప్పి, అలసట, కండరాలు, కీళ్ల నొప్పులు, వికారం, కొద్దిగా మైకం రావడం వంటివి జరుగుతాయని.. ఇవి కూడా తాత్కాలిక సైడ్‌‌‌‌ ఎఫెక్ట్సే అని హెల్త్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆఫీసర్లు తెలిపారు. చాలా అరుదైన  సందర్భాల్లో మాత్రమే అలర్జీ లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో వ్యాక్సిన్‌‌‌‌ తీసుకున్న తర్వాత ఓ అరగంట హాస్పిటల్‌‌‌‌లో డాక్టర్ల పర్యవేక్షణలో
 ఉంటే సరిపోతుంది. 

  • పేరెంట్స్​చొరవ తీసుకోవాలి 

బాలికలకు భవిష్యత్‌‌‌‌లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌‌‌‌ రాకుండా హెచ్‌‌‌‌పీవీ వ్యాక్సిన్‌‌‌‌ నిరోధిస్తుంది. దీంతో పాటు మరికొన్ని రకాల క్యాన్సర్ల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. బాలికలకు ఆరు నెలల వ్యవధిలో రెండు డోస్‌‌‌‌లు ఇప్పించాలి. ఈ వ్యాక్సిన్‌‌‌‌తో తీవ్రమైన సైడ్‌‌‌‌ ఎఫెక్ట్స్‌‌‌‌ రావు. తల్లిదండ్రులు చొరవ తీసుకొని బాలికలకు వ్యాక్సిన్‌‌‌‌ వేయించాలి. జిల్లాలోని అన్ని పీహెచ్‌‌‌‌సీలు, సీహెచ్‌‌‌‌సీలు, ఎంసీహెచ్‌‌‌‌లలో ఈ వ్యాక్సిన్‌‌‌‌ అందుబాటులో ఉంది. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 
- ఎస్.అనిత, మంచిర్యాల డీఎంహెచ్‌‌‌‌వో