Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్.. ఫైనల్లో నీరజ్ చోప్రా

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్.. ఫైనల్లో నీరజ్ చోప్రా

టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ విజేత, భారత సంచలనం నీరజ్‌ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌లోనూ శుభారంభం చేశాడు. జావెలిన్ ఈవెంట్‌లో ఫైనల్‌కు అర్హత సాధించాడు. మంగళవారం(ఆగష్టు 6) జరిగిన క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో ఈ డిఫెండింగ్ ఒలింపిక్ ఛాంపియన్ మొదటి ప్రయత్నంలోనే బల్లాన్ని 89.34 మీటర్ల దూరం విసిరి ఫైనల్‌ బెర్త్‌ ఖాయం చేసుకున్నాడు. చోప్రా కెరీర్‌లో  ఇది అత్యుత్తమ ప్రదర్శన. ఈ ఏడాది మేలో దోహా డైమండ్ లీగ్‌లో నెలకొల్పిన 88.36మీటర్ల అత్యుత్తమ మార్కును అతను అధిగమించాడు.

ఇదిలావుంటే, భారత్‌కు చెందిన మరో జావెలిన్‌ త్రోయర్‌ కిశోర్‌ జెనా ఫైనల్‌కు చేరుకోలేకపోయాడు. అత్యుత్తమంగా అతను తన బల్లాన్ని 80.73 మీటర్ల దూరం విసరగలిగాడు. కాగా, ఇదే విభాగంలో పోటీపడిన పాకిస్థాన్‌ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ తన మొదటి ప్రయత్నంలో 86.59 మీటర్లతో 12 మందితో ఫైనల్‌కు చేరుకున్నాడు. ఫైనల్‌కు నేరుగా అర్హత సాధించాలంటే జావెలిన్‌ను  84 మీటర్ల దూరం విసరాలి. ఆగస్టు 8న రాత్రి 11:55 గంటలకు ఫైనల్ పోటీలు జరగనున్నాయి.