- హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్సెంటర్లకు అమ్మకం
- ఒక్క సిలిండర్ రూ.3 వేల నుంచి రూ.4 వేలు
- తామేం చేయలేమంటున్న సివిల్ సప్లయీస్
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్లో గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్ కు తరలిపోతున్నాయి. కొందరు గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకుల సహకారంతోనే గృహ అవసరాలకు వాడాల్సిన సిలిండర్లను హోటల్స్, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లకు అమ్ముకుంటున్నారు. ప్రస్తుతం కమర్షియల్సిలిండర్ల సరఫరాను ఆయిల్ కంపెనీలు నిలిపివేయడంతో హోటల్స్, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు డొమెస్టిక్ సిలిండర్లపై పడ్డారు.
రూ.3 వేల నుంచి రూ.4 వరకు రేటు పలుకుతున్నా ఎగబడి మరీ కొంటున్నారు. దీంతో కొందరు ఏజెన్సీల నిర్వాహకులు, డెలివరీ బాయ్స్కలిసి బ్లాక్చేస్తూ సంపాదిస్తున్నారు. కస్టమర్లు బుక్‌చేసిన సిలిండర్లను వారు ఓటీపీ చెప్పకపోయినా డెలివరీ చేసినట్టు చూపి అమ్ముకుంటున్నారు.
డెలివరీ కాకున్నా అయినట్టు మెసేజ్లు
నగరంలోని చాలా మందికి సిలిండర్లు డెలివరీ కాకపోయినా అయినట్టు మెసేజ్ లు వస్తున్నాయి. సిలిండర్బుక్చేయకపోయినా చేసినట్టు..డెలివరీ అయినట్టు కూడా మెసేజ్లు వస్తున్నాయి. సికింద్రాబాద్‌లోని రాజేంద్రనాధ్అనే కస్టమర్తాను సిలిండర్ బుక్ చేయలేదని, అయినా బుక్‌చేసినట్టు డెలివరీ అయినట్టు మెసేజ్వచ్చిందని వాపోయాడు.
వారాసిగూడలోని మరో వినియోగ దారుడు తాను సిలిండర్బుక్చేసి వారమైందని, సిలిండర్రాలేదని, కానీ డెలివరీ అయినట్టు మెసేజ్వచ్చిందని చెప్పాడు. ఇలా నగరంలోని చాలామందికి ఇలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి. కొందరు ఏజెన్సీల వారే డెలివరీ బాయ్స్ద్వారా ఒక్కో సిలిండర్‌ను 3వేల నుంచి 4వేలకు అమ్ముకుంటున్నారన్న ఆరోపణలున్నాయి.
రోజూ 75 లక్షల బుకింగ్స్
గ్రేటర్ పరిధిలో 30 లక్షల గ్యాస్కనెక్షన్లు ఉండగా, సాధారణ రోజుల్లో 50 లక్షల వరకూ బుకింగ్‌లు జరుగుతాయని, డెలివరీలు 25 నుంచి 30 లక్షల వరకు ఉంటాయని అధికారులు చెప్తున్నారు. కానీ, ప్రస్తుతం రోజుకు 75 లక్షల వరకు బుకింగ్‌లు అవుతుండగా డెలివరీలు కూడా 40 లక్షల వరకు ఉన్నాయంటున్నారు.
అయితే ఇందులో సగం కస్టమర్లకు చేరకుండా పక్కదారి పడుతున్నాయన్న ఆరోపణలున్నాయి. విషయాన్ని హైదరాబాద్ జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్దృష్టికి తీసుకువెళ్లగా అవి ఆయిల్‌కంపెనీలు చూసుకుంటాయని, తామేం చేయలేమని స్పష్టం చేశారు.
38 గ్యాస్ సిలిండర్లు సీజ్
జీడిమెట్ల, వెలుగు: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గృహ వినియోగ గ్యాస్‌ను కమర్షియల్ అవసరాలకు ఉపయోగిస్తున్న వ్యాపార సముదాయాలపై బాలానగర్ సివిల్ సప్లయ్ శాఖ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. 38 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. 10 మంది వ్యాపారులపై కేసులు నమోదు చేశారు.
