పార్లమెంట్ లో భద్రతా ఉల్లంఘన: కాలిపోయిన ఫోన్ పార్ట్స్ లభ్యం

పార్లమెంట్ లో భద్రతా ఉల్లంఘన: కాలిపోయిన ఫోన్ పార్ట్స్ లభ్యం

పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనలో ప్రమేయం ఉన్న నిందితుల ఫోన్ భాగాలను రాజస్థాన్ నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఫోన్ భాగాలన్నీ కాలిపోయిన స్థితిలో కనిపించాయి. అయితే లలిత్ ఝా ఫోన్‌ను ఢిల్లీ పోలీసులు ఇంకా రికవరీ చేయలేదు. పార్లమెంటు భద్రతా ఉల్లంఘన ఘటనలో నిందితుడైన లలిత్ ఝా ఢిల్లీకి రాకముందే ఐదు మొబైల్ ఫోన్‌లను ధ్వంసం చేసి, దర్యాప్తు బృందాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఢిల్లీ పోలీసు వర్గాలు ముందే వెల్లడించాయి.

భద్రతా ఉల్లంఘనకు ముందు, నలుగురు నిందితులు తమ అరెస్టును ఊహించి, కీలకమైన దర్యాప్తు వివరాలు పోలీసులకు చేరకుండా నిరోధించడానికి తమ ఫోన్‌లను ఝాకు అందజేశారు. రాజస్థాన్ లోని కుచమన్‌కి పారిపోయిన తర్వాత లలిత్ ఝా ఐదు మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశాడని పోలీసు వర్గాలు తెలిపాయి. అంతకుముందు, పార్లమెంటు భద్రతా ఉల్లంఘన కేసులో ఆరో నిందితుడు మహేష్ కుమావత్‌ను 15 రోజుల కస్టడీకి అప్పగించాలని ఢిల్లీ పోలీసులు కోరగా.. పాటియాలా హౌస్ కోర్టు డిసెంబర్ 16న ఏడు రోజుల కస్టడీని మంజూరు చేసింది. ఈ కేసులో లలిత్ ఝా సహా మరో ఐదుగురు నిందితులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.