- సిటీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్పర్వతాలు అరుదైన రికార్డు
- రీసెర్చ్ పేపర్స్ బుక్ రిలీజ్ చేసిన టీజీసీహెచ్‌ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి
హైదరాబాద్, వెలుగు: సర్కారు విద్యా సంస్థల్లోనూ ప్రపంచ స్థాయి పరిశోధనలు చేయొచ్చని హైదరాబాద్ సిటీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పర్వతాలు కలకొండ నిరూపించారు. 2024–-25 విద్యా సంవత్సరంలో ఏకంగా 16 అంతర్జాతీయ పరిశోధనా పత్రాలను ప్రచురించి ఆయన అరుదైన రికార్డు సృష్టించారు. బుధవారం టీజీసీహెచ్ఈ కార్యాలయంలో పర్వతాలు రూపొందించిన ‘ఫ్రంటియర్స్ ఇన్ నానో మెటీరియల్స్: ఏ కంపెండియం ఆఫ్ రీసెర్చ్ ఆర్టికల్స్’ పుస్తకాన్ని కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్ ఇటిక్యాల పురుషోత్తం ఆవిష్కరించారు.
డాక్టర్ పర్వతాలు ఏడాది కాలంలోనే 16 స్కోపస్ ఇండెక్స్డ్ అంతర్జాతీయ పత్రాలను ప్రచురించడం గొప్ప విషయమని బాలకిష్టారెడ్డి కొనియాడారు. ఇందులో 7 క్యూ1, 9 క్యూ2 స్థాయి పత్రాలు ఉండటం ఆయన ప్రతిభకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో పరిశోధనా సంస్కృతి బలోపేతమవుతుందనడానికి డాక్టర్ పర్వతాలు సృష్టించిన ఈ రికార్డు ఒక ఉదాహరణ అని చైర్మన్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కాలేజీ అధ్యాపకులు, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.
