జగిత్యాల/వెల్గటూర్, వెలుగు: ఇథనాల్ ప్రాజెక్టు పనులను వెంటనే నిలిపివేయాలని జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పాశిగామ గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు. ప్రాజెక్టు చేపడితే రోగాల పాలవుతామని, పంటలకు నష్టం జరుగుతుందని రెండ్రోజులుగా నిరసన తెలుపుతున్నారు. ఎక్కడైనా దూరప్రాంతంలో ఇథనాల్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆరు నెలల కింద క్రిబ్ కో ద్వారా రూ.700 కోట్లతో ఇథనాల్ ప్రాజెక్ట్ ను ధర్మపురి నియోజకవర్గానికి ప్రభుత్వం కేటాయించింది. దీనికి పాశిగామలోని సర్వే నంబర్ 1090లో ఉన్న దాదాపు 200 ఎకరాల అసైన్డ్ భూమిని కేటాయించారు. అప్పటి జిల్లా కలెక్టర్ రవి స్థల సేకరణ చేసి మార్కింగ్ ఇచ్చారు. అయితే ఈ ప్రాజెక్టుకు శుక్రవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ శంకుస్థాపన చేయగా, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పిల్లలు, వృద్ధులు రోగాల పాలవుతారని, పంటలకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
అరెస్టులు.. అష్టదిగ్బంధం
ప్రాజెక్టు భూమి పూజ కోసం వచ్చిన మంత్రి కొప్పులను అడ్డుకున్న గ్రామస్తులు.. రెండు గంటల పాటు రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. కానీ మంత్రి స్పందించకపోవడంతో ఆందోళన ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో గ్రామస్తుల ఆందోళనకు కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. అయితే కాంగ్రెస్ నేతలు పాశిగామకు వెళ్తారన్న సమాచారంతో పోలీసులు జిల్లాలో ముందస్తు అరెస్టులు చేశారు. శనివారం ఉదయం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ ను హౌస్ అరెస్టు చేశారు. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ఓవైపు కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు చేసిన పోలీసులు.. మరోవైపు పాశిగామను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. గ్రామానికి వచ్చే తొవ్వల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జనం ఎవరూ ఇథనాల్ ప్రాజెక్టు స్పాట్‌కు వెళ్లకుండా అడ్డుకున్నారు. రాత్రి 8 గంటలకు వరకు పోలీసులు ఊళ్లో పికెట్ నిర్వహించారు. డీఎస్పీ ప్రకాశ్ వచ్చి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
సర్కార్ పై బీఆర్ఎస్ నేతల ఫైర్..
ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. తమ గ్రామం అభివృద్ధి చెందుతుందని బీఆర్ఎస్ లో చేరామని, కానీ తమ నోట్లో మట్టి కొడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గొపతి నరేశ్ రాజీనామా ప్రకటించారు. కాగా, గ్రామంలోని బీఆర్ఎస్ జెండా గద్దెను కూల్చేందుకు గ్రామస్తులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
