ఏం చేయాలో తెలుస్తలేదు... నిస్సహాయ స్థితిలో విమాన ప్రయాణికులు

ఏం చేయాలో తెలుస్తలేదు... నిస్సహాయ స్థితిలో విమాన ప్రయాణికులు
  • పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో ఇంటర్నేషనల్ ఫ్లైట్లు రద్దు
  • దేశంలోని పలు సిటీల్లో చిక్కుకున్న వేలాది మంది

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, గగనతల ఆంక్షల నేపథ్యంలో ఇంటర్నేషనల్ ఫ్లైట్లను రద్దు చేశారు. దీంతో దేశంలోని పలు నగరాల్లో వేల సంఖ్యలో ప్రయాణికులు ఎయిర్ పోర్టుల్లో చిక్కుకున్నారు. ఏం చేయాలో తెలుస్తలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, గగనతల ఆంక్షల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇంటర్నేషనల్  ఫ్లైట్లను రద్దు చేశారు. దీంతో దేశంలోని పలు నగరాల్లో వేల సంఖ్యలో ప్రయాణికులు ఎయిర్ పోర్టుల్లో చిక్కుకున్నారు. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్  దాడులు ప్రారంభించడంతో ఇరాన్  చుట్టుపక్కల దేశాలు తమ గగనతలంతో పాటు కీలక ఎయిర్ పోర్టులను మూసివేశాయి. యూరోప్, ఆఫ్రికాకు వెళ్లే ఎయిర్ పోర్టులను కూడా క్లోజ్  చేశారు. 

ఈ నేపథ్యంలో 444 విమాన సర్వీసులను క్యాన్సిల్  చేయాలని నిర్ణయించామని డైరెక్టర్  జనరల్  ఆఫ్  సివిల్  ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. దీంతో దేశంలోని పలు నగరాల నుంచి పశ్చిమాసియా దేశాల మీదుగా వివిధ దేశాలకు వెళ్లాల్సిన ఫ్లైట్  ప్యాసింజర్లు ఎయిర్ పోర్టుల్లో చిక్కుకున్నారు. పెండ్లిండ్లు, సొంత అవసరాలు వంటి వివిధ పనుల మీద విదేశాల నుంచి దేశానికి వచ్చిన వారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. విమానాలు రద్దు కావడంతో ఎయిర్ పోర్టులో చిక్కుకున్నామని, ఏం చేయాలో తెలుస్తలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

నేను ఇదివరకే నా సెలవును ఎక్స్ టెండ్  చేసుకున్నా. సోమవారం నుంచి ఆఫీసుకు వెళ్లాలి. కానీ, పశ్చిమాసియాలో పలు దేశాలు వాటి ఎయిర్ స్పేస్ ను బంద్  చేశాయి. దీంతో విమాన సర్వీసులు క్యాన్సిల్  అయ్యాయి అని లండన్ లో పనిచేసే సందీప్  తెలిపాడు. రాజస్తాన్ కు చెందిన సోమ్ నాథ్  ఢిల్లీ మీదుగా లెబనాన్​కు వెళ్లాల్సి ఉంది. ఆయన కూడా ఢిల్లీ ఎయిర్ పోర్టులో చిక్కుకున్నాడు. 

చాలా నిరాశ చెందాం

దుబాయ్​కు వెళ్లాల్సిన ప్రయాణికులదీ అదే బాధ. ‘‘దుబాయ్​లో వెకేషన్  కోసం మేం ముందుగానే ఫ్లైట్ టికెట్లు, హోటల్.. ప్రతిఒక్కటీ బుక్ చేసుకున్నాం. ఈ పరిస్థితిలో ఫ్లైట్లు రద్దుచేశారు. ఇది మాకు చాలా నష్టం కలిగించింది” అని తెలిపారు. లండన్​కు చెందిన జంట ఢిల్లీలో తమ బంధవు వివాహం కోసం వచ్చి ఇరుక్కుపోయింది. విమానాల రద్దుతో చెన్నై, ముంబై, చండీగఢ్, బెంగళూరుతో పాటు పలు నగరాల్లో ప్రయాణికులు చిక్కుకుపోయారు. 

ఎయిరిండియా, ఆకాశ ఎయిర్, స్పైస్ జెట్​తో పాటు పలు విమానయాన సంస్థలు పశ్చిమాసియాకు సర్వీసులను రద్దు చేశాయి. ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్, యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఒమన్, ఇరాక్, జోర్దాన్, కువైట్, ఖతార్  దేశాల గగనతలం మీదుగా ఈనెల 2 వరకు ప్రయాణించరాదని డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది.