- ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి
- కూకట్పల్లిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కొత్త భవనం ప్రారంభం
- అదనపు స్థలం కేటాయింపుపై సీఎంతో మాట్లాడుతానని హామీ
కూకట్పల్లి, వెలుగు: ప్రభుత్వ రంగ విద్యాభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. ప్రైవేటు విద్యా సంస్థలతో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలను తీర్చిదిద్దేందుకు అధిక నిధులు కేటాయిస్తున్నట్లు వివరించారు. కూకట్పల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన భవనాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివి సమాజంలో ఉన్నత స్థానాలకు ఎదిగిన వారు ఎంతో మంది ఉన్నారని, విద్యార్థులు వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
కూకట్పల్లి ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీలకు అవసరమైన అదనపు స్థలం విషయంపై సీఎంతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కలెక్టర్ మనుచౌదరి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
