కేటీఆర్ 420 లీడర్ ఆయనది ఓ దొంగల బ్యాచ్: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

కేటీఆర్ 420 లీడర్ ఆయనది ఓ దొంగల బ్యాచ్: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  • కేటీఆర్ నీ స్థాయి ఎంత, నీ బతుకెంత.. నువ్వా రాహుల్, రేవంత్​ను విమర్శించేది
  • డ్రగ్స్ ప్రభావంతోనే ఇలా మాట్లాడుతుండని అనుమానంగా ఉంది
  • ఆయనకు మానసిక వైద్యులతో చికిత్స అందించాల్సిన అవసరముంది
  • బండి సంజయ్ కేంద్ర మంత్రిలా కాకుండా..
  • పిట్టల దొరలా ప్రవర్తిస్తుండని మహేశ్ గౌడ్ ఫైర్

హైదరాబాద్, వెలుగు: కేటీఆర్ 420  లీడర్​ అని, ఆయన కుటుంబం అంతా 420 అని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయనది ఓ దొంగల బ్యాచ్ అని, కోన్ కిస్కా కేటీఆర్ నువ్వో బచ్చా అంటూ ఫైర్ ​అయ్యారు. కేటీఆర్.. నీ స్థాయి ఎంత, నీ బతుకెంత.. నువ్వా రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని విమర్శించేది అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీపై విమర్శలు చేయడానికి కేటీఆర్ కు సిగ్గుండాలని, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబంపై మాట్లాడతావా? అని విమర్శించారు. 


వరంగల్ లో కాంగ్రెస్ ప్రభుత్వంపై, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై, సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీంతో పీసీసీ చీఫ్ అదే స్థాయిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బుధవారం గాంధీ భవన్ లో మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీపై మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది. డబ్బే పరమావధిగా పదేండ్లు దోచుకున్నరు. అధికారం రాగానే మీ జాగీర్ అన్నట్లు పదవులు పంచుకున్నరు. నేరెళ్లలో మీ ఇసుక దందాకు బలైన ఆత్మలు ఇంకా ఘోషిస్తున్నాయి. మీ హయాంలో జరిగిన రైతుల ఆత్మహత్యలు మరిచిపోయారా’’ అని నిలదీశారు.

మీ నియంత పాలనను ప్రజలు మరిచిపోలేదు

పాస్ పోర్టు కుంభకోణం నుంచి మొదలుకుంటే భూ కుంభకోణం వరకు  అన్నింటిలో కేటీఆర్ కుటుంబమే ఉందని మహేశ్​గౌడ్ ఆరోపించారు. పదేండ్ల పాటు ఈ రాష్ట్రంలో కేసీఆర్ సాగించిన అవినీతి, అరాచక, నియంత, కుటుంబ పాలనను తెలంగాణ ప్రజలు ఇంకా మరిచిపోలేదని, ఇప్పుడు ఏదేదో మాట్లాడితే జనం నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో దొంగచాటుగా వచ్చి సిరిసిల్లలో ఉద్యమకారుడైన కేకే మహేందర్ రెడ్డిని రాజకీయంగా గొంతుకోసిన చరిత్ర కేటీఆర్​ది అని ఆరోపించారు. కేటీఆర్ మాట్లాడిన తీరుచూస్తే.. గతంలో రేవంత్ రెడ్డి కేటీఆర్ కు విసిరిన వైట్ చాలెంజ్ అంశం గుర్తుకు వస్తుందన్నారు. డ్రగ్స్ ప్రభావంతోనే కేటీఆర్ ఇలా మాట్లాడుతున్నాడనే అనుమానం కలుగుతున్నదని, ఆయనకు ప్రభుత్వ ఖర్చులతో మానసిక వైద్యుల చేత ట్రీట్​మెంట్ ఇప్పించాల్సిన అవసరం ఉందన్నారు. మీ గులాబీ రంగు ఎలిసిపోయిందని, రాష్ట్ర ప్రజల హృదయాల్లో కేసీఆర్ మాసిపోయిండని, కేసీఆర్, కేటీఆర్, హరీశ్ కు ఇక గతం తప్ప భవిష్యత్తు లేదని విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్.. బీజేపీ క్విడ్ ప్రో వలే కలిసిపోయాయని ఆరోపించారు. బండి సంజయ్ కేంద్రమంత్రిలా కాకుండా ఓ పిట్టల దొరలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసును సీబీఐకి అప్పగిస్తే.. 48 గంటల్లో విచారణ జరిపిస్తామని చెప్పిన బీజేపీ నేతలు, ఎనిమిది నెలలు గడుస్తున్నా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.