సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయం : మంత్రి పొన్నం

సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయం :  మంత్రి పొన్నం
  • బిహార్​లో ఓట్లర్ల తొలగింపుపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ 

హైదరాబాద్, వెలుగు: బిహార్​లో ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల జాబితాపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం ప్రజాస్వామ్యానికి గొప్ప విజయం అని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. బిహార్​లో తొలగించిన 65 లక్షల ఓటర్ల పేర్లను 48 గంటల్లో వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో ప్రకటించాలని సుప్రీం కోర్టు ఆదేశించడాన్ని వారు స్వాగతించారు. రాహుల్ గాంధీ లేవనెత్తిన ఓట్ల చోరీ ఆరోపణలకు సుప్రీం కోర్టు తీర్పుతో రుజువులు లభించినట్లైందని పేర్కొన్నారు.

 ఆధార్ లింక్ తో ‘‘ఒక ఓటు.. ఒక మనిషి’’ విధానం అమలు చేయాలన్న రాహుల్ గాంధీ డిమాండ్ పై ఎన్నికల సంఘం స్పందించాలని కోరారు. పార్లమెంట్ లో ఓట్ల చోరీపై చర్చకు రాహుల్ పట్టుపట్టినా కేంద్రం అడ్డుతగలడం విచారకరమని అన్నారు. సుప్రీం తీర్పుతోనైనా కేంద్ర ఎన్నికల సంఘం తమ తప్పులను సరిదిద్దుకొని స్వతంత్రంగా వ్యవహరించాలని వారు కోరారు.