వానలతో జనం ఇబ్బందిపడుతున్నా పట్టించుకుంటలే

వానలతో జనం ఇబ్బందిపడుతున్నా పట్టించుకుంటలే
  •  వర్షాల వల్ల జరిగే నష్టానికి ఆయనదే బాధ్యత 
  •     కంట్రోల్ రూమ్స్, హెల్ప్ లైన్లు, స్పెషల్ టీమ్స్​ ఏర్పాటు చేయాలె
  •     సీఎంకు పీసీసీ చీఫ్ బహిరంగ లేఖ
  •     వానలతో జనం ఇబ్బందులు పడుతున్నా పట్టించుకుంటలే: రేవంత్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భారీ వర్షాలతో జనం ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఉత్తర తెలంగాణలో పరిస్థితి మరీ దారుణంగా ఉందని, మరో రెండ్రోజులు వానలు పడ్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ప్రమాదకర పరిస్థితులు ఉంటే, కేసీఆర్ మాత్రం ఎక్కడున్నారో తెలియడం లేదని విమర్శించారు. సీఎం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ మేరకు బుధవారం ఆయన సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. ‘‘ప్రజలు చస్తున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదు. ఆయన రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలతో బిజీగా ఉన్నారు. సర్వే నివేదికలతో మల్లగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు, ఇలా బాధ్యత లేకుండా ఉండడం సరికాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. వర్షాల వల్ల ఏ నష్టం జరిగినా కేసీఆరే బాధ్యత వహించాలి” అని అందులో పేర్కొన్నారు.  

సహాయక చర్యలు చేపట్టాలె... 

వరదలపై సమీక్షకు ఉన్నత స్థాయిలో టీమ్ ఏర్పాటు చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో పాటు అన్ని విభాగాల ఉన్నతాధికారులు అందులో ఉండాలని, సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షించాలని కోరారు. అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో కంట్రోల్​రూమ్​లు, హెల్ప్ లైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు ఆహారం, తాగు నీరు, సరుకులు అందజేయాలన్నారు. నీటి ప్రవాహాన్ని అంచనా వేస్తూ అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలని.. ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు.

సగం జిల్లాల్లో ఇంకా జీతాలు రాలె

సగం నెల గడుస్తున్నా, సగానికి పైగా జిల్లాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు రాలేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. సమయానికి జీతాలు రాక ‘‘జీతమో రామచంద్రా..’’అంటూ ఎంప్లాయీస్‌ ఆవేదన చెందుతున్నారని బుధవారం ట్వీట్ చేశారు. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ దివాలా తీయించారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని పేర్కొన్నారు. కాగా, పేద పిల్లల చదవులకు ‘చంద్ర’గ్రహణం పట్టిందని, టీచర్లు, పుస్తకాలు లేక స్కూళ్లు వెలవెలబోతున్నాయని మరో ట్వీట్‌ చేశారు.