కేసీఆర్ చేతగానితనం వల్లే గిరిజనులు, ఫారెస్ట్ అధికారుల మధ్య ఘర్షణ : రేవంత్ రెడ్డి

కేసీఆర్ చేతగానితనం వల్లే గిరిజనులు, ఫారెస్ట్ అధికారుల మధ్య ఘర్షణ : రేవంత్ రెడ్డి

పోడు సమస్యల పరిష్కారంలో టీఆర్ఎస్ సర్కార్ ఫెయిల్ అయ్యిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేతగాని తనం వల్లే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు (ఎఫ్​ఆర్వో) ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. FRO శ్రీనివాసరావు హత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.

ఎనిమిదేళ్లగా పోడు సమస్యలు పరిష్కరించకుండా కేసీఆర్ తాత్సారం చేస్తున్నారని రేవంత్ రెడ్డి లేఖలో తెలిపారు. ఓ వైపు భూములకు పట్టాలు ఇస్తామంటూనే.. ఫారెస్ట్ అధికారులను గిరిజనులపైకి సర్కార్ ఉసిగొల్పుతోందని ధ్వజమెత్తారు. తెలంగాణలోని పచ్చని భూముల్లో కేసీఆర్ నెత్తురు పారిస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ చేతగాని తనం వల్లే అటవీశాఖ అధికారులు, పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనుల మధ్య నిత్యం చిచ్చు రేగుతోందన్నారు.

పోడు పట్టాలపై మార్గదర్శకాలు విడుదల చేయాలి..

పోడు భూములకు పట్టాలిచ్చే కార్యాచరణను వెంటనే ప్రకటించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ లోపు పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజనులు, ఆదివాసీల జోలికి వెళ్లకుండా అధికారులకు అదేశాలు ఇవ్వాలన్నారు. విధులు నిర్వహిస్తున్న అధికారులకు భద్రత కల్పించాలన్నారు. అటవీశాఖ అధికారుల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలన్నారు. వెంటనే పోడు భూములకు పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి మార్గదర్శకాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరపున ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.