అధికారంలోకి వస్తే పేదలకు ఇండ్లు కట్టిస్తం

అధికారంలోకి వస్తే పేదలకు ఇండ్లు కట్టిస్తం

కేసీఆర్‌‌‌‌ చర్లపల్లి జైలుకెళ్లడం ఖాయం: రేవంత్‌‌ రెడ్డి

  •     ఎర్రవల్లి ఫామ్‌‌హౌస్‌‌ రోడ్డు కోసం లక్ష్మాపూర్‌‌‌‌లో వృద్ధురాలి ఇంటిని కూల్చేశారు
  •     కాంగ్రెస్‌‌ పార్టీ ఆధ్వర్యంలో ఆమెకు ఇల్లు కట్టించి ఇచ్చాం
  •     ఈ ఇల్లు మాదిరిగానే రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని హామీ

పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

శామీర్​పేట/మల్కాజిగిరి, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని పీసీసీ చీఫ్‌‌ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎర్రవల్లిలో ఉన్న సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌‌కు వెళ్లే దారిలో రోడ్డు వెడల్పులో భాగంగా మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామంలో కుమ్మరి ఎల్లవ్వ ఇంటిని అధికారులు కూల్చేశారు. గతంలో లక్ష్మాపూర్‌‌‌‌లో పర్యటించిన రేవంత్ రెడ్డి.. ఆమె ఇంటిని పరిశీలించారు. ఈ క్రమంలో ఎల్లవ్వకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొత్త ఇంటిని నిర్మించి ఇస్తామని ఆయన మాట ఇచ్చారు. ఆ ఇంటి నిర్మాణం పూర్తవడంతో శుక్రవారం గృహ ప్రవేశానికి హాజరయ్యారు. అనంతరం రేవంత్‌‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌‌కు వెళ్లడానికి నిరుపేద వృద్ధ మహిళ ఇల్లు కూల్చివేయడం దారుణమన్నారు. ఎల్లవ్వ ఇల్లు కంటే రోడ్డును 6 ఫీట్లు ఎత్తు కట్టి ఆమె ఇల్లును ముంచారన్నారు. బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్‌‌‌‌, ప్రజా ప్రతినిధులు, స్థానిక మంత్రి మల్లారెడ్డి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. లక్ష్మాపూర్‌‌‌‌లో ఎల్లవ్వకు కట్టించిన ఇల్లు మాదిరిగానే రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలకు ఇండ్లు కట్టించి ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్లు కట్టిన చోట కాంగ్రెస్‌‌ పార్టీకి ఓట్లు వేయాలని ప్రజలను అడుగుతామని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లు కట్టినచోట బీఆర్ఎస్‌‌కు డిపాజిట్ దక్కితే కాంగ్రెస్ అభ్యర్థులు గుండు కొట్టించుకుంటారని సవాల్‌‌ చేశారు. రాష్ట్రంలో పేదవారికి ఇండ్లు కట్టించలేని కేసీఆర్‌‌‌‌ త్వరలో చర్లపల్లి జైలుకెళ్లడం ఖాయమన్నారు. అక్కడే కేసీఆర్‌‌‌‌, ఆయన అల్లుడు, బిడ్డ, కొడుకుకు డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తామన్నారు. 

కాంగ్రెస్‌‌లోకి బీజేపీ, బీఆర్ఎస్ నేతలు..

తూంకుంట మున్సిపాలిటీలోని బీజేపీ, బీఆర్‌‌‌‌ఎస్‌‌కు చెందిన పలువురు నేతలతో పాటు ఉద్యమకారుడు చిర్రబోయిన రాంచందర్‌‌‌‌ యాదవ్‌‌.. రేవంత్‌‌ సమక్షంలో కాంగ్రెస్‌‌లో చేరారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో రేవంత్‌‌ మాట్లాడారు. ‘‘కేసీఆర్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ ఉద్యమకారులు రోడ్డున పడ్డారు. ఉద్యమకారులను ఉరికించి కొట్టించిన దొంగలను కేసీఆర్ అందలం ఎక్కించారు. ఇప్పటికైనా విద్యావంతులు, మేధావులు, ప్రజలు ఆలోచించి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి. తెలంగాణ ఇచ్చిన పార్టీకి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం లెక్క కాదు”అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు మల్లు రవి, నందికంటి శ్రీధర్, సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, భీమిడి జైపాల్ రెడ్డి, జంగయ్య యాదవ్‌‌ పాల్గొన్నారు.

సఫిల్ గూడ వద్ద ఆర్‌‌‌‌యూబీ నిర్మిస్తం..

మల్కాజిగిరిలోని సఫిల్‌‌గూడ, ఇందిరా, నెహ్రూనగర్ బస్తీల్లో శుక్రవారం రేవంత్ రెడ్డి పర్యటించారు. రైల్వే ట్రాక్, మిలిటరీ ఏరియా వైపు దారులను మూసివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బస్తీ వాసులు రేవంత్‌‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో డిఫెన్స్, రైల్వే అధికారులతో చర్చించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. అలాగే, సఫిల్ గూడ వద్ద రైల్వే గేట్ వద్ద ఆర్‌‌‌‌యూబీ (రైల్వే అండర్ బ్రిడ్జి) నిర్మాణానికి కృషి చేస్తాననని చెప్పారు.