పోడు రైతులకు అండగా ఉంటాం

పోడు రైతులకు అండగా ఉంటాం

సీఎం కేసీఆర్ పాలనలో కవులు, కళాకారులు గడిలో బందీలుగా మారారని, మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కవులు, కళాకారులకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని, మళ్లీ గజ్జె కట్టి మరో ఉద్యమానికి సిద్ధం కావాలంటూ పిలుపునిచ్చారు. పోడు భూముల విషయంలో రాహుల్ గాంధీ స్పందించారని, బాధిత రైతులకు అండగా ఉండాలని తమకు చెప్పారని తెలిపారు. పోడు భూముల విషయంలో కేసీఆర్ రాక్షసుడిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ప్రొఫెసర్, టీజేఎసీ చైర్మన్ ఇటికాల పురుషోత్తం రచించిన దాలి, చేదు నిజం పుస్తకాల ఆవిష్కరణ సభకు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దాలి పుస్తకాన్ని రేవంత్ రెడ్డి, చేదు నిజం పుస్తకాన్ని మధు యాష్కీ ఆవిష్కరించారు. ‘ఇంత మంచి పుస్తకాలు రాసిన ప్రొఫెసర్ పురుషోత్తానికి ప్రత్యేక ధన్యవాదాలు, ఆయనకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం’ అని రేవంత్ రెడ్డి చెప్పారు. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చి రాష్ట్ర ప్రజల కల నెరవేర్చారని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. 

తెలంగాణ ఉద్యమంలో జరిగిన నిజాలను ప్రొఫెసర్ పురుషోత్తం ‘చేదు నిజం’ పుస్తకం ద్వారా చాలా గొప్పగా బయటకు తీసుకువచ్చారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. సినిమాలో కథ లేకున్నా డైరక్టర్ గొప్పవాడు అని చెప్పుకునే వ్యక్తి రామ్ గోపాల్ వర్మ అని, సినిమాను గుండెలోకి హత్తుకునేలా తీసే డైరక్టర్ రాజమౌళి అని కామెంట్స్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్ రామ్ గోపాల్ వర్మ లాంటి వాడన్నారు. తెలంగాణ ఉద్యమం, భావ స్వేచ్చా ఎలా ఉండాలి..? అని పురుషోత్తం వంటి రచయితలు ఉద్యమ సమయంలో రచనలు చేస్తే.. కేసీఆర్ మాత్రం మందు (మద్యం) లోపల పోస్తూ కూర్చున్నాడని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర కూడా నిజం లాంటి అబద్దమన్నారు. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన వారికి, వారి కుటుంబ సభ్యులకు ఒక్క అరగుంట భూమి అయినా వచ్చిందా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఉద్యమకారుడైతే వందల కోట్ల ఆస్తి ఆయనకు ఎక్కడ నుండి వచ్చిందని ప్రశ్నించారు. కేసీఆర్ దిగజారుడు రాజకీయాలు చేసి, నమ్మించి అందర్నీ మోసం చేశాడన్నారు. 

రాష్ట్రంలో కొందరు పోలీసు అధికారులు గన్ పెట్టి అత్యాచారాలు చేసే పరిస్థితి నగరంలో ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ లోని ఓ పబ్ కేసులో రైడ్ చేసింది సీఐ నాగేశ్వరరావు అని (అప్పట్లో నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న నాగేశ్వరరావు), అక్కడి డ్రగ్స్ కేసులో యువరాజు పేరు బయటపెడతానని చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ కేసును నీరుగారుస్తోందని ఆరోపించారు. మేకలు, గొర్రెలు ప్రజలకు ఇచ్చి పదవులన్నీ తన కుటుంబ సభ్యులకు ఇచ్చిన ఘనత కేసీఆర్ దే అన్నారు. తెలంగాణ ఉద్యమం ముందు, ఉద్యమం తరువాత కల్వకుంట్ల ఆస్తులు ఎన్ని ఉన్నాయో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేవలం రాజకీయ, ఆర్థిక లాభం కోసం కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఇప్పుడు విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నారని చెప్పారు. 1200 మంది ఆత్మ బలిదానం చేసుకుంటే కనీసం 12 మంది బాధిత కుటుంబ సభ్యులకు కడుపు నిండా భోజనం పెట్టావా...? అని ప్రశ్నించారు.