పారాసెట్మాల్‌తో క‌రోనా పోతుంద‌న్న వాళ్ల‌ను ఏమ‌నాలి?

పారాసెట్మాల్‌తో క‌రోనా పోతుంద‌న్న వాళ్ల‌ను ఏమ‌నాలి?

తెలంగాణ సీఎం కేసీఆర్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగ‌ళ‌వారం జ‌రిగిన ప్రెస్ మీట్ లో కేసీఆర్ మాట్లాడిన తీరు కాంగ్రెస్ పార్టీని అవమానించినట్లు ఉంద‌ని అన్నారు.

“నా 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి వ్యక్తిని చూడలేదు. భారత్ దేశ ప్రజాస్వామ్యంలో ఏ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడటం చూడలేదు. కెసిఆర్ కంటే బెటర్ రికార్డ్ నాకుంది. నేను భారత్- చైనా బార్డర్ లో పని చేశాను.. నేను ఎన్నడూ కేసీఆర్ మాదిరిగా బ్రోకర్ పని చేయలేదు. నేను పాస్ పోర్ట్ ల కేసుల్లో లో కూడా లేను.కేసీఆర్ తిట్టిన తిట్లు నన్ను వ్యక్తిగతంగా అన్నట్లు భావిస్తున్నాను. దేశం కోసం ఆర్మీలో పని చేసింది నీ లాంటి వాళ్ళతో మాటలు పడేందుకు కాదు” అని ఉత్త‌మ్ అన్నారు

రైతు బంధు గురించి మాట్లాడుతున్న కేసీఆర్ ఏ పంట ముందు రైతు బంధు ఇచ్చారో చెప్పాల‌న్నారు. కేసీఆర్ త‌న జీవితకాలంలో ఒక్క మాట నిలబెట్టుకోలేద‌న్నారు. ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులైనా ఒక లక్ష రూపాయ‌ల రుణమాఫీ కూడా చేయలేదన్నారు. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో లోన్స్ అన్ని మాఫీ అవుతున్నాయ‌ని, కేసీఆర్ కి దమ్ముంటే త‌న‌తో ఛత్తీస్ ఘడ్-రాజస్థాన్ ల‌కు రావాల‌న్నారు ఉత్త‌మ్ . రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకొని కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు.

అసెంబ్లీ సాక్షిగా పారాసెట్మాల్ టాబ్లెట్ తో కరోనా వైరస్ పోతుందన్న వాళ్ళను దద్దమ్మ అనాలా? బఫున్ అనాలా? అని ప్ర‌శ్నించారు ఉత్త‌మ్. వైర‌స్ కార‌ణంగా సంభ‌వించిన‌ మరణాల సంఖ్య ఎక్కువగా లేవని చెప్పడానికి కేసీఆర్ కి సిగ్గు, షెరం ఉండాలన్నారు. క‌రొనా వైరస్ దేశం అంతా ఒక తీరుగా- తెలంగాణలో ఒక తీరుగా ఉంటుందా? అని అడిగారు. కేసులు-డెత్ రేట్స్ గురించి మాట్లాడిన కేసీఆర్… టెస్టుల సంఖ్య గురించి ఇతర రాష్ట్రాలతో-కేంద్రంతో ఎందుకు మాట్లాడలేదన్నారు

ధాన్యం కొనుగోళ్లు చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యం చెందింద‌ని, రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న టార్గెట్ లో రీచ్ కాలేదని ఉత్త‌మ్ అన్నారు. రైతుల స‌మ‌స్య‌ల‌పై కాంగ్రెస్ నాయ‌కులు కోర్టుకు-గవర్నర్ ని కలిస్తే కేసీఆర్ ఎందుకు ఇబ్బంది పడుతున్నారని ప్ర‌శ్నించారు. గవర్నర్ హక్కులను సైతం కేసీఆర్ అవమానిస్తున్నారన్నారు. కాంగ్రెస్ నేతలు గవర్నర్ కి ఇచ్చిన లేఖలు కేసీఆర్ చదివి మాట్లాడాలన్నారు. వొళ్ళంతా అహంకారం తో మాట్లాడుతున్నాడని అన్నారు.

వైన్ షాప్ ల విషయంలో ఇతర రాష్ట్రాలతో పోల్చిన కేసీఆర్ మిగతా విషయాల్లో ఎందుకు పోల్చరు? అని ఉత్త‌మ్ అడిగారు. రెడ్ జోన్ లలో వైన్ షాప్స్ కాకుండా ఏ దుకాణాలు తెరవద్దన్న‌.. కేసీఆర్ కి వైన్ షాప్స్ పై ఎందుకంత ప్రేమ? అన్నారు.

ప్ర‌తి ఇంటికి మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వకుండా ఓట్లు అడిగిన వాళ్ళని సన్నాసులు-దద్దమ్మలు అనాలా? అని అడిగారు ఉత్త‌మ్ .
ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన తెలంగాణ కేసీఆర్ జాగిరీ అవుతుందా? అని ప్ర‌శ్నించారు. త‌మ‌ ఫ్యామిలీ దోచుకోవడానికే తెలంగాణ వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. లక్జరి లైఫ్ కి అలవాటు పడి కేసీఆర్ నియంతలాగా వ్యవహరిస్తున్నారన్నారు. కేసీఆర్ అండ్ ఫ్యామిలీ అధికారిక విమానాల్లో కాకుండా ప్రైవేట్ విమానాల్లో ఎందుకు ప్రయాణాలు చేస్తున్నారు? అని ప్ర‌శ్నించారు. వేల కోట్లు అక్రమంగా సంపాదించి అహంకారంతో మాట్లాడుతున్నార‌ని అన్నారు.

తాము వ్యక్తిగతంగా, పార్టీ పరంగా.. దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన వాళ్ళమని, సీఎం కేసీఆర్ మాట్లాడిన మాట‌ల‌ను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నద‌ని ఉత్త‌మ్ అన్నారు.

pcc chief uttam kumar reddy fires on cm kcr