రేపు (మే 29) పీసీసీ పీఏసీ సమావేశం

రేపు (మే 29) పీసీసీ పీఏసీ సమావేశం


హైదరాబాద్, వెలుగు: పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు గాంధీభవన్‌లో జరగనుంది. పీసీసీ చీఫ్ మహేశ్​కుమార్​గౌడ్​ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి సీఎం రేవంత్​రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్​తో పాటు ఇతర సీనియర్ నేతలు హాజరుకానున్నారు. చాలా కాలం తర్వాత పీఏసీ సమావేశం జరగనుండడంతో కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర చర్చ సాగుతోంది.

ఇటీవల పార్టీలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కీలకమైన ఈ సమావేశం జరగనుండడం, ముఖ్య నేతలు ఒకే వేదికపై ఉండనుండడంతో పార్టీ నేతలంతా ఈ సమావేశంపైనే దృష్టి పెట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో పీఏసీ సమావేశం హాట్‌హాట్‌గా సాగనుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీ బలోపేతానికి బూత్ స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలు, రాష్ట్రంలో ప్రభుత్వం-, పార్టీ మధ్య సమన్వయం, ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో జరుగుతున్న చర్చ, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరుపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.