నేడు (మే 29) పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ మీటింగ్

నేడు (మే 29) పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ మీటింగ్
  • పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్ లో సమావేశం 
  • హాజరుకానున్న  సీఎం రేవంత్, పార్టీ ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్, ఇతర సీనియర్ నేతలు
  • ‘సర్’పై పార్టీ నేతలను అప్రమత్తం చేయడంపైనే ప్రధాన చర్చ

హైదరాబాద్, వెలుగు: పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం శుక్రవారం సాయంత్రం 4 గంటలకు గాంధీ భవన్ లో జరగనుంది. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్​చార్జీ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి, ఇతర సీనియర్ నేతలు పాల్గొననున్నారు. ఓటర్ల సవరణ జాబితా (సర్) పైనే ఈ మీటింగ్​లో ప్రధానంగా చర్చించనున్నారు. సర్ పేరుతో అర్హుల ఓట్లు తొలగించకుండా పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండడంపై పలు సూచనలు చేయనున్నారు.

బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌‌‌‌ఏ)లను పార్టీ నేతలు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ కాంగ్రెస్ అనుకూల, లౌకికవాద ఓట్లు జాబితా నుంచి తొలగించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇందులో చర్చించనున్నారు. సర్ విషయంలో ఏ ఒక్క నేత కూడా ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా, ఎక్కడ, ఏ అనుమానం వచ్చినా వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసేలా నేతలు వెంటనే రంగంలోకి దిగేందుకు తీసుకోవాల్సిన కార్యాచరణపై ఇందులో చర్చించనున్నారు. కాంగ్రెస్ మండల కమిటీల నియామకం, బూత్ స్థాయిలో పార్టీ బలోపేతం కోసం తీసుకుంటున్న కార్యక్రమాలపై  చర్చ  జరగనుంది.