అబిడ్స్, వెలుగు: విద్యాసంస్థలకు వంద మీటర్ల పరిధిలో పాన్ షాపులు నిర్వహిస్తే భవిష్యత్తులో యజమానులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శనివారం ‘ఆపరేషన్ సేఫ్ స్కూల్’ పేరిట పోలీసులు ఏకకాలంలో 558 పాన్ షాపులపై దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో పోలీస్, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ విభాగాలకు చెందిన సుమారు 5 వేల మంది సిబ్బంది పాల్గొన్నారు. రైడ్స్ అనంతరం గోషామహల్‌లో నిర్వహించిన సమావేశంలో సీపీ మాట్లాడారు.
విద్యాసంస్థల సమీపంలో పాన్ షాపులు ఉండటం వల్ల విద్యార్థులు టొబాకో ఉత్పత్తులు, పాన్ మసాలా, గుట్కాలకు అలవాటు పడుతున్నారని తెలిపారు. గత వారం రోజులుగా పాన్ షాపుల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయగా, విద్యార్థులు పొగాకు పదార్థాలు కొంటున్నట్లు గుర్తించామని చెప్పారు. విద్యాసంస్థలకు 100 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తుల విక్రయం నిషేధం ఉన్నప్పటికీ కొంతమంది నిర్వాహకులు పట్టించుకోవడం లేదన్నారు.
అదుపులోకి తీసుకున్న పాన్ షాపుల నిర్వాహకులపై సీఓటీపీఏ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నామని, మళ్లీ ఉల్లంఘనలు చేస్తే పీడీ యాక్ట్ అమలు చేయడానికీ వెనుకాడబోమని హెచ్చరించారు. వచ్చే విద్యా సంవత్సరానికి ముందే విద్యాసంస్థల పరిసరాలను పూర్తిగా ‘నో టొబాకో జోన్’గా మార్చే లక్ష్యంతో చర్యలు చేపడుతున్నామని సీపీ సజ్జనార్ తెలిపారు.

