పాఠ్యాంశాల్లో వ్యాయామ విద్యను చేర్చాలి.. ప్రభుత్వానికి పీడీ, పీఈటీ అసోసియేషన్ విజ్ఞప్తి

పాఠ్యాంశాల్లో వ్యాయామ విద్యను చేర్చాలి.. ప్రభుత్వానికి పీడీ, పీఈటీ అసోసియేషన్ విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు:  వచ్చే విద్యా సంవత్సరం నుంచే వ్యాయామ విద్యను కూడా పాఠ్యాంశంగా చేర్చాలని ప్రభుత్వాన్ని పీడీ, పీఈటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దూమర్ల నిరంజన్ కోరారు. ఆదివారం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన అసోసియేషన్ రాష్ట్ర అత్యవసర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. బడుల్లో క్రీడలకు ప్రత్యేక బడ్జెట్​ కేటాయించాలని, దాన్ని హెచ్ఎం, పీఈటీల జాయింట్ ఖాతాలో వేయాలని కోరారు. విద్యార్థులకు రెండు జతల స్పోర్ట్స్ డ్రెస్, షూ పంపిణీ చేయాలన్నారు.

 జిల్లా స్థాయిలో జరిగే  స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కోసం అడ్వాన్సుగా రూ.2 లక్షలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.  మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణించే క్రీడాకారులకు నగదు బహుమతులు, విద్యా అర్హతను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాబేర్, సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ నిరంజన్ యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు అరుంధతి, కోశాధికారి భాస్కర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.