పోలింగ్ ప్రశాంతం.. ఖమ్మం జిల్లాలో 82.50 శాతం ఓటింగ్ నమోదు

పోలింగ్ ప్రశాంతం.. ఖమ్మం జిల్లాలో 82.50 శాతం ఓటింగ్ నమోదు
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో73.60 శాతం ​
  • రేపటి కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి 

ఖమ్మం, వెలుగు :  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక కార్పొరేషన్, రెండు మున్సిపాలిటీల్లో పోలింగ్​జరిగింది. ఈ సందర్భంగా పలుచోట్ల చిన్నచిన్న గొడవలు మినహా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు లైన్లు కట్టి ఓటింగ్ లో పాల్గొన్నారు.

బుధవారం సాయంత్రం 5 గంటల వరకు క్యూ లైన్లలో నిల్చున్న వారికి ఓటేసేందుకు పోలింగ్ సిబ్బంది అనుమతించారు. ఖమ్మం జిల్లాలో 82.50 శాతం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో73.60 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు. తర్వాత కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ బాక్స్ లను ఆయా రిసెప్షన్ సెంటర్లలోని స్ట్రాంగ్ రూమ్ లకు తరలించారు.

రేపు (శుక్రవారం) ఆయా మున్సిపాలిటీల్లో కౌంటింగ్ కు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మధిర పోలింగ్ బాక్స్ లను ఖాజీపురం పాలిటెక్నిక్ కాలేజీకి, సత్తుపల్లి పోలింగ్ బాక్స్ లను జ్యోతి నిలయం పాఠశాలకు, ఏదులాపురం పోలింగ్ బాక్స్ లను ప్రియదర్శిని ఇంజినీరింగ్ కాలేజీకి, కల్లూరు పోలింగ్ బాక్స్ లను పీఎంశ్రీ ప్రభుత్వ పాఠశాలకు, వైరా పోలింగ్ బాక్స్ లను వెటర్నరీ ఆస్పత్రి ఆవరణలోని రైతు శిక్షణ కేంద్రానికి తరలించారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో..​

జిల్లాలోని కొత్తగూడెం మున్సిపల్​ కార్పొరేషన్​తోపాటు ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగాయి.  మొత్తంగా 1,36,423 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రామవరంలో కాంగ్రెస్, సీపీఐ నేతలు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు రంగం ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఘటనాస్థలాన్ని డీఎస్పీ ఆదినారాయణ సందర్శించి బందోబస్తును పర్యవేక్షించారు.