రూపాయి తీసుకొని 30 పైసలు ఇస్తున్నరు.. తెలంగాణపై కేంద్రం వివక్ష:ఎంపీ వంశీకృష్ణ

రూపాయి తీసుకొని  30 పైసలు ఇస్తున్నరు..  తెలంగాణపై కేంద్రం వివక్ష:ఎంపీ వంశీకృష్ణ
  •     పేదల పొట్టకొట్టి.. అదానీ, అంబానీలకు వేల కోట్ల పన్ను మినహాయింపులా?
  •     భారీగా ఆదాయం అందిస్తున్న పెద్దపల్లికి నిధులు ఎందుకు ఇవ్వరు?
  •     లోక్​సభలో ఫైనాన్స్ బిల్లుపై చర్చలో కేంద్రం విధానాలపై పెద్దపల్లి ఎంపీ ఫైర్​ 


న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాల నుంచి వచ్చే ట్యాక్స్ వసూళ్లలో తెలంగాణ రాష్ట్రం కీలకమైందని మోదీ సర్కార్​కు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గుర్తు చేశారు. అయితే తెలంగాణ నుంచి కేంద్రానికి రూపాయి వస్తుండగా.. రాష్ట్రానికి తిరిగి వస్తున్నది కేవలం 30 పైసలేనని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు, ప్రాజెక్ట్ ల విషయంలో తెలంగాణపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. అలాగే పెద్దపల్లి నియోజకవర్గం కేంద్రానికి వేల కోట్ల రూపాయలు సమకూర్చుతుంటే... పినట్స్(పల్లిలుగా) ఈ ప్రాంతానికి టోకెన్ అమౌంట్లు విదిలిస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం లోక్ సభలో ‘బిల్ ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కన్సిడరేషన్ అండ్ పాసింగ్– ది ఫైనాన్స్ బిల్లు–2026’ పై చర్చలో పాల్గొని, మాట్లాడారు. తెలంగాణకే కాకుండా, తన నియోజకవర్గానికి తీరని అన్యాయం జరుగుతోందని చెప్పారు. పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గంలోనే కీలకమైన ఎన్టీపీసీ, ఆర్ఎఫ్ సీఎల్, సింగరేణి, ఇతర సంస్థలు ఉన్నాయని సభ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సంస్థల ద్వారా దాదాపు రూ.25 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్ల ఆదాయాన్ని కేంద్రానికి సమకూర్చుతున్నట్లు వెల్లడించారు. దేశానికి వేల కోట్ల ఆదాయం ఇస్తున్న తన ప్రాంతానికి కేవలం  రూ.100 కోట్లు, రూ.150 కోట్లు చిల్లర నిధులు ఇచ్చి చేతులు దులుపుకుంటుందన్నారు. ఇది తెలంగాణ, పెద్దపల్లి ప్రజల హక్కులను దోచుకోవడమే అవుతుందని మండిపడ్డారు.

ఏ ప్రాజెక్ట్ ఇవ్వకుండా శిక్షిస్తున్నరు..


పెద్దపల్లి ప్రజల అవసరాలు, సంక్షేమం అభివృద్ధి కోసం... అగ్రికల్చర్ యూనివర్సిటీ, మైనింగ్ యూనివర్సిటీ కి నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు వంశీకృష్ణ గుర్తు చేశారు. అలాగే సింగరేణి కార్మికుల కోసం ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని అనేక మార్లు సంబంధిత శాఖ మంత్రులు, అధికారులను కలిసి విజ్ఞప్తి చేశామన్నారు. కానీ.. తమ విజ్ఞప్తులను పట్టించుకోకుండా ఈ ప్రాంత ప్రజల్ని కేంద్రంలోని బీజేపి సర్కార్ శిక్షిస్తోందని విమర్శించారు. సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ ను రూ.10 వేలకు పెంచాలని అనేక మార్లు కోరామన్నారు. దీనికి నిధులు ఇవ్వని కేంద్రం.. ట్యాక్స్ హాలిడేలు, డేటా సెంటర్ల పేరిట విదేశాల్లో ఉన్న వాళ్ల కోసం లక్షలాది కోట్ల ట్యాక్స్ మినహాయింపు ఇస్తున్నారని మండిపడ్డారు.

సెమీ కండక్టర్ సంస్థను ఏపీకి తరలించారు

పెద్దపల్లిలో వెయ్యి కోట్ల రూపాయలతో సెమీకండక్టర్ సంస్థ పెట్టాలని కోరినట్లు ఎంపీ చెప్పారు. ఈ ప్రాజెక్ట్ వస్తే.. వేలాది ఉద్యోగాలు కల్పించవచ్చని కేంద్రానికి ప్రతిపాదించామన్నారు. కానీ ఈ ప్రాజెక్టును కేంద్రం చివరి నిమిషంలో ఏపీకి తరలించిందని విమర్శించారు. అలాగే పర్యాటక, సాంస్కృతిక రంగ అభివృద్ధిలో భాగంగా పెద్దపల్లికి ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్లు గుర్తు చేశారు. ఇందులో భాగంగా ధర్మపురి, కోటిలింగాల, రామగిరి కోట వంటి చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలను అభివృద్ధి చేస్తే పర్యాటక రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని వివరించారు. కానీ కేంద్రం ఈ ప్రాంతాలకు ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.

ఉపాధి హామీ స్కీంలో పెద్ద స్కామ్‌‌..

కేంద్రంలోని బీజేపి సర్కార్ దేశ ప్రజలు, పేదలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోంటుందని వంశీకృష్ణ విమర్శించారు. కాంగ్రెస్ తెచ్చిన ఉపాధి హామీ పథకంతో పేదవాడికి 100 రోజుల పని దినాలు హక్కుగా ఉండేదన్నారు. ఈ స్కీంపై పదేండ్లుగా బీజేపీ సర్కార్ రూ.7 లక్షల కోట్లు ఖర్చు చేసినా.. కూలీలకు అందింది రూ.200 మాత్రమే అన్నారు. ఇందులో పెద్ద స్కాం జరిగిందని ఆరోపించారు. స్కీంను మార్చివేసి పేదవాడి పొట్టగొట్టిన సర్కార్ బీజేపీ మాత్రమే అని విమర్శించారు. మరోవైపు బడా పారిశ్రామిక వేత్తలు ఆదానీ, అంబానీలకు పన్ను మినహాయింపు ఇచ్చారన్నారు. ధనికులకు దొచిపెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం దగ్గర డబ్బు ఉందికానీ.. పేద వాడి కోసం లేవన్నారు. రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, పరిశ్రమల్లో మిస్​మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కారణంగా ఉత్పత్తి తగ్గుతోందని చెప్పారు. రామగుండంలోని ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీని ఢిల్లీ నుంచి నడుపుతున్నారని సభ దృష్టికి తెచ్చారు. అలాంటప్పుడు ఎలా ఫ్యాక్టరీ సమర్థవంతంగా నడుస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ నుంచి దాదాపు 12 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి కావాల్సి ఉండగా, కేవలం 9 లక్షల టన్నులు మాత్రమే రావడం బాధాకరం అని వివరించారు. ఈ విషయంలో ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసిన కేంద్ర పట్టించుకోలేదన్నారు.

మోదీ సర్కార్ దళిత వ్యతిరేకి.. 

కేంద్రంలోని మోదీ సర్కార్ దళిత వ్యతిరేకి అని ఎంపీ విమర్శించారు. ‘నేను దళితుడిని, విద్యావంతుడిని, చైతన్యం కలిగిన వాడిని. సమాజంలోని దళితులైన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లకు జరుగుతున్న అన్యాయాన్ని నేను గుర్తించగలను. దళిత ఎంట్రాపెన్యూర్స్ కు కేంద్రం మద్దతు దక్కడం లేదనేది గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలో దాదాపు లక్ష స్టార్టప్ లు ఉంటే, ఇందులో ఎంతమంది దళితులు ఉన్నారు. దళిత స్టార్టప్ ఫౌండర్లకు, పారిశ్రామికవేత్తలకు పన్ను మినహాయింపు ఇవ్వండి. దళిత ఉద్యోగులకు ఇన్సెంటివ్స్ కల్పించండి. దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలి’ అని డిమాండ్ ​చేశారు.

కరువు ప్రభావిత జోన్​లో మంచిర్యాల
    పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం

భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) చేపట్టిన జిల్లా స్థాయి అంచనాల ప్రకారం మంచిర్యాల జిల్లా అధిక దుర్బలత్వం, అత్యంత ప్రభావితమయ్యే జోన్​లో ఉందని కేంద్రం వెల్లడించింది. జగిత్యాల జిల్లా మధ్యస్థ దుర్బలత్వం కలిగిన జోన్ లో ఉన్నట్లు పేర్కొంది. అందువల్ల మంచిర్యాల జిల్లాలో కరువును తట్టుకునే వంగడాలను ప్రవేశపెట్టినట్లు తెలిపింది. 

మంగళవారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాథ్ ఠాకూర్ సమాధానం చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నివేదించిన ప్రకారం పంట కోత ప్రయోగాలు (సీసీఈ), క్షేత్ర పర్యవేక్షణ, సాయిల్ హెల్త్ కార్డు పథకం ద్వారా జిల్లా, మండల స్థాయిలో పంట ఉత్పాదకత, వర్షపాతం, సాయిల్ హెల్త్ పై క్రమం తప్పకుండా అంచనాలు రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి – సెంట్రల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ డ్రైలాండ్ అగ్రికల్చర్ (క్రిడా) తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక కార్యక్రమం కింద చర్యలు తీసుకున్నట్లు వివరించారు. 2021–26 మధ్య పంటల ఉత్పాదకత, స్థితిస్థాపకతను పెంచడానికి మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో 27 కస్టమ్ హైరింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశామన్నారు.