- భయం ఆధారంగా బీజేపీ ప్రభుత్వాన్ని నడుపుతోంది: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ
- ఎల్పీజీ కొరతపై దేశ ప్రజలకు భరోసా ఇవ్వాలని డిమాండ్
- పార్లమెంట్ వద్ద సస్పెండ్ అయిన ఎంపీల నిరసనకు సంఘీభావం
న్యూఢిల్లీ, వెలుగు: దేశ ప్రజలను భయాందోళనకు గురి చేయడంలో ప్రధాని మోదీ మాస్టర్ డిగ్రీ చేశారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విమ ర్శించారు. ప్రస్తుతం ఎల్పీజీ కొరతపై దేశం ఆందోళన చెందుతుంటే.. కనీసం ప్రధాని స్పందించకపోవడం సరికాదన్నారు. మోదీ నేతృ త్వంలోని బీజేపీ సర్కార్ గత పన్నెండేండ్లుగా అసంబద్ధ, అనవసర నిర్ణయాలతో ప్రజలను రోడ్లపైకి తెస్తున్నదని ఫైర్ అయ్యారు.
శుక్రవారం పార్లమెంట్ మకర ద్వారం ఎదురుగా ఉన్న మెట్లపై కూర్చొని సస్పెండ్ అయిన ఎంపీలకు గడ్డం వంశీకృష్ణ సంఘీభావం తెలిపారు. అలాగే, దేశంలో వంట గ్యాస్ (ఎల్పీజీ) కొరత, ఎప్ స్టీన్ ఫైల్స్ లో ఉన్న వ్యక్తితో కేంద్ర మంత్రి హర్ధీప్ సింగ్ పురి సంబంధాన్ని తెలిపేలా ‘గ్లోబల్ ఫ్రెండ్స్’అంటూ పోస్టర్ ను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నల్లధనాన్ని వెలికితీస్తామంటూ పెద్ద ఎత్తున ప్రచారంతో 2016 లో నోట్ల రద్దును తెచ్చి.. పేద ప్రజలను మోదీ సర్కార్ రోడ్లపై నిలబెట్టిందని విమర్శించారు.
వృద్ధులు, అణగారిన వర్గాలు రోజంతా రోడ్లపై నిలబడి తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని గుర్తు చేశారు. అలాగే, కరోనా టైంలో లాక్ డౌన్ పేరుతో పేదలకు అన్నం దొరకకుండా నిర్బంధం చేశారన్నారు. ఇలా దేశ ప్రజల్లో ఆందోళనలు సృష్టించి భయం ఆధారంగా బీజేపీ ప్రభుత్వాన్ని నడుపుతోందని తీవ్రవిమర్శలు చేశారు.
ప్రస్తుతం కూడా పశ్చిమాసియా ఉద్రిక్తతతో దేశంలో ఏర్పడ్డ ఎల్పీజీ కొరత సమస్యపై వాస్తవాలను చెప్పకుండా ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నదన్నారు. ఈ అంశంపై కేంద్ర మంత్రులు స్వతహాగా ముందుకు వచ్చి అంతా బాగానే ఉందనే భరోసాను దేశ ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉందని సూచించారు. ‘దేశంలో ఎల్పీజీ కొరత ఉంది.. కానీ, మేం ఈ విధంగా సమస్యను పరిష్కరిస్తాం’అని చెప్పాలన్నారు.
మంత్రి ఒకటి చెప్తే.. ప్రధాని మరోటి పోస్ట్ చేస్తరు..
ఎల్పీజీ కొరతపై ఆ శాఖ మంత్రి, ప్రధాని స్టేట్మెంట్లు విరుద్ధంగా ఉన్నాయని ఎంపీ వంశీకృష్ణ మండిపడ్డారు. గురువారం పార్లమెంట్ వేదికగా పెట్రోలియం శాఖ మంత్రి దేశంలో ఎల్పీజీ కొరత లేదని ప్రకటించారన్నారు. ఇది జరిగిన రెండు, మూడు గంటలకే దేశంలో గ్యాస్ కొరత ఉందని.. త్వరలోనే అన్ని సర్దుకుంటాయని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
మొదట దేశంలో ఎల్పీజీ కొరత ఉందో? లేదో? కేంద్ర ప్రభుత్వం సమీక్షించుకోవాలని, ఆ తర్వాత ప్రకటనలు చేయాలని సూచించారు. కానీ, ఎల్పీజీ కొరతపై ప్రధాన ప్రతిపక్షంగా దేశ ప్రజల తరఫున పోరాడుతున్నట్టు చెప్పారు. ఈ సమస్య పరిష్కారానికి కేంద్రం ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలని ఎంపీ వంశీకృష్ణ డిమాండ్ చేశారు.
