సంబురంగా కాకా క్రికెట్ టోర్నీ.. రామగుండంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందజేసిన ఎంపీ వంశీకృష్ణ

సంబురంగా కాకా క్రికెట్ టోర్నీ.. రామగుండంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందజేసిన ఎంపీ వంశీకృష్ణ
  •  కరీంనగర్​లో ముగిసిన మ్యాచ్​లు

గోదావరిఖని/తిమ్మాపూర్, వెలుగు: హైదరాబాద్  క్రికెట్  అసోసియేషన్, కరీంనగర్  జిల్లా క్రికెట్  అసోసియేషన్  ఆధ్వర్యంలో కాకా వెంకటస్వామి మెమోరియల్  తెలంగాణ అంతర్  జిల్లాల సెకండ్  ఫేజ్​ క్రికెట్  టోర్నీ పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. రామగుండం ఎన్టీపీసీలోని మహాత్మాగాంధీ స్టేడియంలో రెండు రోజుల పాటు జరగనున్న పోటీలను ఎన్టీపీసీ తెలంగాణ, రామగుండం ప్లాంట్ల హెడ్, ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ చందన్​ కుమార్​ సమంత, ఐఎన్టీయూసీ నేషనల్​ సీనియర్​ సెక్రెటరీ బాబర్​ సలీం పాషా  ప్రారంభించారు.

 ఉదయం నల్గొండ, ఆదిలాబాద్​ జట్ల మధ్య పోటీ జరగగా, ముందుగా బ్యాటింగ్​ చేసిన నల్గొండ జట్టు 19.2 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌట్​ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్​కు దిగిన ఆదిలాబాద్​ 20 ఓవర్లు ఆడి 9 వికెట్లు కోల్పోయి 126 పరుగులు మాత్రమే చేసింది. ఆదిలాబాద్​పై నల్గొండ జట్టు 15 రన్స్​ తేడాతో గెలిచింది. 16 రన్స్​ చేసి, 2 వికెట్లు తీసిన శివుడుకు మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​ అవార్డు దక్కింది. 

మధ్యాహ్నం ఖమ్మం, కరీంనగర్​ జట్ల మధ్య పోటీ జరగగా, ముందుగా బ్యాటింగ్​ చేసిన ఖమ్మం జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్​ చేసిన కరీంనగర్​ జట్టు 10.5 ఓవర్లలో 68 పరుగులకు ఆలౌట్​ అయింది. ఖమ్మం బౌలర్​ షేక్​ అజర్​ 2.5 ఓవర్లు వేసి 13 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయగా, అతనికి మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​ అవార్డు దక్కింది. 

ముగిసిన పోటీలు..

కరీంనగర్​ కార్పొరేషన్​ పరిధిలోని అలుగునూర్​లోని వెలిచాల జగపతిరావు మెమోరియల్​ క్రికెట్​ గ్రౌండ్​లో జరుగుతున్న క్రికెట్​ పోటీలు ఆదివారం ముగిసాయి. ఉదయం నిజామాబాద్,​- రంగారెడ్డి జట్ల మధ్య మ్యాచ్​ జరగగా, ముందుగా బ్యాటింగ్​ చేసిన నిజామాబాద్​ 20 ఓవర్లలో 6 వికెట్లకు 162 పరుగులు చేసింది. విక్రమ్​ జాదవ్​ 62 బంతుల్లో 84 పరుగులు చేయగా, రిత్విక్​ రాజ్​ 41 బంతుల్లో 54 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు అందించారు. 

రంగారెడ్డి బౌలర్లలో ఈశ్వర్​ 4 ఓవర్లు వేసి 33పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. రంగారెడ్డి జట్టు 20 ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 160 పరుగులు మాత్రమే చేసింది. విక్రమ్​ నాయక్​కు మ్యాన్  ఆఫ్​ ది మ్యాచ్  దక్కింది. మధ్యాహ్నం హైదరాబాద్,​ మెదక్​ జట్ల మధ్య జరిగిన మ్యాచ్​లో ముందుగా బ్యాటింగ్​ చేసిన హైదరాబాద్​ 13.4 ఓవర్లలో 68 పరుగులు మాత్రమే చేసి ఆల్​ అవుట్​ అయింది. అనంతరం మెదక్​ 2 వికెట్లు కోల్పోయి 6.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 

మెదక్​ బౌలర్​ వరుణ్​ తేజ్​ 3.4 ఓవర్లు వేసి 13 పరుగులిచ్చి 5 వికెట్లు తీయగా, మ్యాన్​ ఆఫ్​ది మ్యాచ్​ దక్కింది. కేడీసీఏ అధ్యక్షుడు వి ఆగంరావు, కార్యదర్శి మురళీధర్ రావు, ఉపాధ్యక్షుడు మహేందర్ గౌడ్, మనోహర్ రావు, ట్రెజరర్​ బండి శ్రవణ్ కుమార్, కార్యవర్గసభ్యులు హరికృష్ణ గౌడ్, సాగర్ రావు, అజిత్  మ్యాచ్​ను పర్యవేక్షించారు.

గ్రామీణ యువతలో ప్రతిభను వెలికితీసేందుకే..

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మంత్రి వివేక్​ వెంకటస్వామి ‘కాకా’ మెమోరియల్​ క్రికెట్ టీ20 టోర్నమెంట్​కు శ్రీకారం చుట్టారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. రామగుండంలో జరిగిన పోటీలకు ఎంపీ హాజరై మాట్లాడారు.

 గ్రామీణ, పట్టణ ప్రాంతాల యువ క్రీడాకారులకు సమాన అవకాశాలు కల్పించడమే ఈ లీగ్  ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఇటువంటి టోర్నమెంట్లు క్రీడలపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎదిగేందుకు వేదికగా నిలుస్తాయని చెప్పారు. ఐపీఎల్​ మ్యాచ్​లకు తీసిపోకుండా క్రీడాకారులు తమ ప్రతిభను చాటుతున్నారని అభినందించారు. నల్గొండ టీమ్​లో ప్రతిభ చూపిన శివుడుకు మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​ అవార్డును ఎంపీ వంశీకృష్ణ అందజేశారు.