మాజీ నక్సలైట్‌నని ఎస్పీ ముందు లొంగుబాటు?.. రికార్డులను జల్లెడ పడుతున్న పోలీసులు

మాజీ నక్సలైట్‌నని ఎస్పీ ముందు లొంగుబాటు?.. రికార్డులను జల్లెడ పడుతున్న పోలీసులు

సూర్యాపేట, వెలుగు: తాను మాజీ నక్సలైట్‌నని ప్రభుత్వం ప్రకటించిన రివార్డు ఇప్పించాలని కోరుతూ ఒక వ్యక్తి నేరుగా సూర్యాపేట ఎస్పీని సంప్రదించడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్  జిల్లా రాయపర్తి మండలం ఊకల్లు గ్రామానికి చెందిన పెద్దోజు జగన్ అలియాస్  దేవేంద్ర చారి(39) నాలుగేళ్లుగా సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం పాతర్లపహాడ్ లో ఉంటున్నాడు. గ్రామంలో లైన్‌మన్‌గా పని చేస్తున్న తన బావ జూలూరి సుధాకర్​ వద్ద ఉంటూ కోడూరు కొమ్మాలలో కార్పెంటర్ గా పని చేస్తున్నాడు. 

ఇతనికి ఛత్తీస్‌గఢ్  రాష్ట్రం పామెడు మండలం ధర్మారం గ్రామానికి చెందిన సునీతతో వివాహం జరిగింది. ఈక్రమంలో ఛత్తీస్‌గఢ్‌లోని ధర్మారంలో భార్య తరఫు బంధువు ఒకరు చనిపోవడంతో దేవేంద్ర చారి అక్కడికి వెళ్లాడు. గ్రామస్తులు అతడిని గుర్తు పట్టి అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడి నుంచి తప్పించుకుని నేరుగా సూర్యాపేట ఎస్పీ ముందు లొంగిపోయేందుకు ప్రయత్నించాడు. 

తాను మాజీ నక్సలైట్‌నని, లొంగిపోతాను కాబట్టి ప్రభుత్వం నుంచి వచ్చే రివార్డును ఇప్పించాలని కోరినట్లు సమాచారం. ఇదిలాఉంటే సదరు వ్యక్తి నిజంగానే గతంలో నక్సలైట్ గా పని చేశాడా? ఎక్కడైనా కేసులు ఉన్నాయా? లేక కేవలం రివార్డు డబ్బుల కోసమే నాటకమాడుతున్నాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.