
ఆసియా కప్ 2025లో భాగంగా మరికొన్ని గంటల్లో భారత్, పాక్ మధ్య హై వోల్టేజీ మ్యాచ్ జరగనుంది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సెప్టెంబర్ 14న రాత్రి 8 గంటలకు చిరకాల ప్రత్యర్థుల పో రు ప్రారంభం కానుంది. అయితే.. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉదృతమయ్యాయి. మరోవైపు సోషల్ మీడియాలో బాయ్ కాట్ ఇండియా వర్సెస్ పాక్ హ్యాష్ ట్యాగ్ హోరెత్తుతుంది. టెర్రరిస్టులతో క్రికెట్ వద్దు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
పహల్గాం టెర్రరిస్ట్ ఎటాక్, ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇండియా, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఇండియా, పాక్ ముఖాముఖీ తలపడనుండటంతో ఈ మ్యాచ్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో దుబాయ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. మ్యాచ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా స్టేడియం దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలోనే మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వచ్చే ప్రేక్షకులకు దుబాయ్ పోలీసులు కీలక సూచనలు చేశారు.
అభిమానులు స్టేడియంలోకి నిషేధిత వస్తువులను తీసుకొస్తే రూ.12 లక్షల వరకు భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించారు. స్టేడియంలో హింసాత్మక చర్యలకు పాల్పడటం, జాత్యహంకార భాషను ఉపయోగించే ప్రేక్షకులపై కేసు నమోదు చేసి జైలుకు తరలిస్తామని వార్నింగ్ ఇచ్చారు. స్టేడియం గేట్లు మ్యాచ్ ప్రారంభానికి మూడు గంటల ముందు తెరుచుకుంటాయని లోపలికి ప్రవేశించడానికి చెల్లుబాటు అయ్యే టికెట్ తప్పనిసరి వెంట తీసుకురావాలని ఫ్యాన్స్‌కు సూచించారు పోలీసులు.
స్టేడియంలోకి నిషేధించబడిన వస్తువుల జాబితా:
పెంపుడు జంతువులు, రిమోట్ కంట్రోల్ పరికరాలు, చట్టవిరుద్ధమైన లేదా విషపూరిత పదార్థాలు, పవర్ బ్యాంకులు, బాణసంచా, మండే స్వభావం గల పదార్ధాలు, లేజర్ పాయింటర్లు, గాజు వస్తువులు, సెల్ఫీ స్టిక్స్, గొడుగులు, ధూమపానం, జెండాలు, బ్యానర్లు