పెండింగ్ లో పోస్టులను వెంటనే భర్తీ చేయాలె : ఉపాధ్యాయులు

పెండింగ్ లో పోస్టులను వెంటనే భర్తీ చేయాలె : ఉపాధ్యాయులు

విద్యాశాఖలోని సమగ్ర శిక్షా నియామకాల సాధనకై... స్పెషల్ ఎడ్యుకేషన్ వెల్పేర్ అసోసియేషన్ హైదరాబాద్ లో మహా ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న 704 సమగ్ర శిక్ష అభియాన్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. జిల్లాల నుంచి ర్యాలీలుగా వచ్చిన ఉపాధ్యాయులు లక్డీకపూల్  లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. 

రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా 2019లో ఎంఐఎస్ కోఆర్డినేటర్స్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్, డేటా ఎంట్రీ  ఆపరేటర్స్, సిస్టం ఎనాలసిస్ట్, అసిస్టెంట్ ప్రోగ్రామర్స్.. ఇలా మొత్తం ఐదు విభాగాలకు సంబంధించి 704 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిందని ఉపాధ్యాయులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీనికి 23వేల మంది పరీక్ష రాశారని అసోసియేషన్ అధ్యక్షుడు శివ కుమార్ తెలిపారు. 2019 డిసెంబర్ లో రాత పరీక్ష నిర్వహించి, 2020లో జిల్లాల వారిగా అభ్యర్థులకు ర్యాంకులు కార్డులు ఇచ్చారన్నారు. 704 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినా... మూడేళ్లుగా పోస్టులు భర్తీ చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు.