సన్నాలకు రేటియ్యరు..ధర్నాలకు వచ్చిండ్రా?

సన్నాలకు రేటియ్యరు..ధర్నాలకు వచ్చిండ్రా?

టీఆర్ఎస్​ లీడర్లను అడ్డుకున్న జనం, ప్రతిపక్షాలు
కరీంనగర్​లో ‘గో బ్యాక్.. టీఆర్ఎస్’ అంటూ నిరసన
చొప్పదండిలో మంత్రి కొప్పులను నిలదీసిన ఆందోళనకారులు
హుజూర్​నగర్​లో కాంగ్రెస్, టీఆర్ఎస్​ నేతల గొడవ
కామారెడ్డిలో టీఆర్ఎస్​ ధర్నా చేసిన చోట ఫినాయిల్​తో క్లీనింగ్
బలవంతంగా షాపులను మూసేయించడంపై వ్యాపారుల ఫైర్
ఎవరూ కలుపుకోకపోవడంతో సెపరేట్​గా టీఆర్‌‌ఎస్‌‌ ఆందోళన

(వెలుగు నెట్వర్క్)అగ్రిచట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్​తో మంగళవారం జరిగిన భారత్‌‌ బంద్‌‌ లో పాల్గొన్న టీఆర్ఎస్ లీడర్లకు చుక్కెదురైంది. టీఆర్ఎస్​ సర్కారు రాష్ట్రంలో సన్నవడ్లకు రేటు ఇవ్వకుండా, రుణమాఫీ చేయకుండా రైతులను బాధపెడుతోందని.. ఆ పార్టీ నేతలకు బంద్​లో పాల్గొనే హక్కు లేదని ప్రతిపక్షాల నేతలు మండిపడ్డారు. కలిసి ఆందోళనలో పాల్గొంటామని వచ్చిన గులాబీ లీడర్లను అడ్డుకున్నారు.

సన్నవడ్లకు రేటు పెంచాకే రైతుల తరఫున మాట్లాడాలని స్పష్టం చేశారు. దీంతో చాలాచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరికి చేసేది లేక టీఆర్ఎస్ నేతలు​సెపరేట్​గానే ఆందోళనలు చేశారు. పలుచోట్ల మంత్రులు, టీఆర్ఎస్​ ఎమ్మెల్యేలను కూడా ప్రతిపక్షాల నేతలు అడ్డుకొని నిరసన తెలిపారు. పలుచోట్ల టీఆర్ఎస్​శ్రేణులకు, ప్రతిపక్షాలకు మధ్య గొడవలు జరిగాయి. కొన్నిచోట్ల బలవంతంగా షాపులు మూయించేసిన టీఆర్ఎస్​ నేతలపై వ్యాపారులు, జనం మండిపడ్డారు. రైతులు ఆందోళన చేస్తే అరెస్టులు చేస్తారు, టీఆర్ఎస్​వాళ్లు ధర్నా చేస్తే అరెస్టు చేయరా అంటూ జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్​లో రైతులు ధర్నా చేశారు.

రైతులను మోసం చేశారు.. గో బ్యాక్​ టీఆర్ఎస్..

బంద్​కు మద్దతుగా కరీంనగర్  బస్టాండ్  ఎదుట ప్రతిపక్షాలు నిరసన కార్యక్రమం చేపట్టాయి. అందులో కలవడానికి టీఆర్ఎస్ లీడర్లు రాగా.. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అడ్డుకున్నారు. రాష్ట్ర సర్కారు సన్నరకాలకు రూ. 2,500 రేటు ఇవ్వకుండా మోసం చేసిందని, కేంద్రం తెచ్చిన అగ్రిచట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయలేదని మండిపడ్డారు. అలాంటి టీఆర్ఎస్​ నేతలకు భారత్ బంద్​లో పాల్గొనే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. దీంతో ప్రతిపక్షాల నేతలు, కార్యకర్తలంతా ‘గో బ్యాక్ టీఆర్ఎస్..’ అంటూ నినాదాలు చేయడంతో.. అక్కడి నుంచి టీఆర్ఎస్​ నేతలు వెళ్లిపోయారు. పలుచోట్ల టీఆర్ఎస్​ లీడర్ల ఓవరాక్షన్​పై జనం మండిపడ్డారు. చొప్పదండి, జమ్మికుంటలో బలవంతంగా దుకాణాలు మూయించడాన్ని నిలదీశారు. కరీంనగర్ లో అల్గునూరు వద్ద చేపట్టిన ధర్నాలో మంత్రి గంగుల, ఎమ్మెల్యే రసమయి పాల్గొన్నారు. ఓ వైపు ధర్నా జరుగుతుండగా.. పక్క నుంచి వెళ్తున్న వాహనాలను టీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడంతో జనం ఆందోళన వ్యక్తం చేశారు. ఇక జగిత్యాల జిల్లా కోరుట్లలో భారత్ బంద్ కు వ్యతిరేకంగా బీజేపీ నిరసన చేపట్టింది. టీఆర్ఎస్ నేతలు అక్కడికి రావడంతో ఘర్షణ వాతావరణం నెలకొన్నది. అయితే పర్మిషన్ లేకుండా ఆందోళన చేపట్టారంటూ పోలీసులు బీజేపీ లీడర్లను అరెస్ట్​ చేశారు.

మంత్రి కొప్పులకు నిరసన సెగ

కరీంనగర్​ జిల్లా చొప్పదండిలో కాంగ్రెస్​ లీడర్లు మంత్రి కొప్పుల ఈశ్వర్​ను అడ్డుకొని రైతు సమస్యలపై నిలదీశారు. పీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో చొప్పదండిలో ధర్నా చేస్తుండగా.. మంత్రి కొప్పుల కాన్వాయ్​ అక్కడికి చేరుకుంది. కాంగ్రెస్​ నేతలు ఆ కాన్వాయ్​ను అడ్డుకున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడుస్తున్నా రైతులకు రుణమాఫీ ఎందుకు చేయలేదని మంత్రిని నిలదీశారు. సన్న వడ్లను సాగు చేయించి.. మద్దతు ధర ఇవ్వకుండా, కొనకుండా రైతులకు నష్టం చేసిన టీఆర్ఎస్​ సర్కారుకు రైతుల పక్షాన పోరాడే హక్కు లేదని మండిపడ్డారు. హత్య చేసినవాడే సంతాప సభ పెట్టినట్టుగా మంత్రులు, ఎమ్మెల్యేలు భారత్ బంద్ లో పాల్గొనడం సిగ్గుమాలినతనమని మేడిపల్లి సత్యం విమర్శించారు. జగిత్యాల మండలం వెల్గటూర్​లోనూ ఆందోళనకారుల నుంచి మంత్రి కొప్పులకు నిరసన సెగ తగిలింది.

బైంసాలో టీఆర్ఎస్​ నేతలపై వ్యాపారుల ఫైర్

నిర్మల్​ జిల్లా భైంసా టౌన్​లో టీఆర్‍ఎస్​ లీడర్లు షాపులను బలవంతంగా మూసే ప్రయత్నం చేశారు. కొందరు వ్యాపారులు ఇందుకు ఒప్పుకోకపోవడంతో గొడవకు దిగారు. దీంతో టీఆర్‍ఎస్​ లీడర్ల తీరుపై వ్యాపారులు మండిపడ్డారు. బెదిరించి బంద్‍ చేయించడం సరికాదని ఆందోళనకు దిగారు. స్థానిక ఎమ్మెల్యే విఠల్‍రెడ్డి సోదరుడు, పోలీసులు కలిసి వ్యాపారులు, లీడర్లను సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది.

టీఆర్ఎస్​ గ్రూపులు.. రోడ్డుకు చెరోపక్కన ధర్నా

కల్వకుర్తి నియోజకవర్గం పరిధిలోని ఆమనగల్లులో టీఆర్ఎస్​ చేపట్టిన ఆందోళన రసాభాసగా మారింది. ఎమ్మెల్యే జైపాల్​యాదవ్ మంగళవారం ఉదయం కల్వకుర్తిలో బంద్​ను పర్యవేక్షించిన తర్వాత ఆమనగల్లు వెళ్లారు. అప్పటికే అక్కడ రాస్తారోకో మొదలుపెట్టిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి వర్గీయులు, జైపాల్​యాదవ్ రోడ్డుకు చెరోవైపు కూర్చున్నారు.  నారాయణరెడ్డి మాట్లాడుతుండగా వాగ్వాదం మొదలైంది. జైపాల్​ వర్గీయులు తమకు అడ్డుతగులుతున్నారంటూ ఎమ్మెల్సీ అనుచరులు నినాదాలు చేశారు. ఇరువర్గాలు పోటాపోటీ నినాదాలు చేసుకుంటూ తోపులాట దాకా వెళ్లారు. పోలీసులు కల్పించుకుని ఇరువర్గాలను వెనక్కి జరిపారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ముందే మండల స్థాయి నేతలు, కార్యకర్తలు తిట్టుకున్నారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేను రోడ్డుపై నిలదీసిన్రు

టీఆర్ఎస్​ తీరును నిరసిస్తూ.. ఖమ్మం జిల్లా ము దిగొండలో ఎమ్మెల్యే కందాల ఉపేందర్​ రెడ్డిని కాంగ్రెస్, సీపీఎం నేతలు ఘెరావ్​ చేశారు. ఉపేంద ర్​రెడ్డి మంగళవారం నేలకొండపల్లి బంద్​లో పాల్గొని ఖమ్మం వెళ్తుండగా ముదిగొండ బస్టాండ్​ సెంటర్​లో ధర్నా చేస్తున్న కాంగ్రెస్​, సీపీఎం లీడర్లు ఆయన వెహికల్స్​ను అడ్డుకొని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు ఆందోళనకారులను పక్కకు తప్పించి ఎమ్మెల్యేను పంపేశారు.

గర్భిణీకి ఎంత కష్టం

భారత్​ బంద్​తో ఏర్పడిన ట్రాఫిక్​ జామ్​తో ఓ గర్భిణీ ఇబ్బందులు పడింది. ట్రాఫిక్​ కదలకపోవడంతో దాదాపు కిలోమీటర్​ వరకు ఆమె ఇలా నడుచుకుంటూ వెళ్లింది. కరీంనగర్​ అల్గునూర్​ వద్ద జరిగిందీ ఘటన. – కరీంనగర్​ సిటీ, వెలుగు

యాదాద్రిలో షాపు ధ్వంసం

బంద్ సందర్భంగా యాదగిరిగుట్టలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బస్టాండ్​ పక్కన తెరిచి ఉంచిన ఓ షాపు యజమానితో టీఆర్ఎస్, కాంగ్రెస్, లెఫ్ట్​ పార్టీల లీడర్లు వాగ్వాదానికి దిగారు. బంద్​ మొదలవడానికి ఉదయం11 గంటల దాకా​ టైం ఉంది కదా? అని షాపు యజమాని శివ నిలదీయడంతో.. పార్టీల కార్యకర్తలు రెచ్చిపోయారు. షాపులోని వస్తువులను ధ్వంసం చేశారు. 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య బంద్ ఉంటుందని షాపు తెరిచానని.. కానీ పది గంటలలోపే వచ్చిన లీడర్లు ఇష్టమొచ్చినట్టు తిడుతూ దాడి చేశారని శివ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల కళ్లెదుటే ఇదంతా జరిగినా ఏమీ పట్టించుకోలేదని ఆరోపించారు. తన షాపుపై దాడికి పాల్పడిన వారిపై పోలీస్​ కంప్లైంట్​ ఇచ్చారు.

టీఆర్ఎస్​ ధర్నా చేసిన చోట ఫినాయిల్​తో క్లీనింగ్

బంద్​కు మద్దతుగా కామారెడ్డి సమీపంలో హైవేపై టీఆర్ఎస్​ నేతలు ధర్నా చేశారు. అయితే అక్టోబర్​లో రైతులు ఇక్కడే ఆందోళనకు దిగారు. సర్కారు మక్కలు కొనాలని, సన్నవడ్ల కు మద్దతు ధర ఇవ్వాలని ధర్నా చేశా రు. ఆ రోజు రైతులకు మద్దతు తెలపని టీఆర్ఎస్​ నేతలు ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారని.. రైతులు ఆందోళన చేసినచోటిని ఆ పార్టీ​ నేతలు అపవి త్రం చేశారని బీజేపీ నేతలు మండిప డ్డారు. టీఆర్ఎస్​ ధర్నా పూర్తికాగానే హైవేను ఫినాయిల్​తో క్లీన్​ చేశారు.

రైతుల్ని అరెస్టు చేసి.. టీఆర్ఎస్​ వాళ్లను వదిలేస్తరా?

రైతుల సమస్యలను ప్రభుత్వానికి తెలి పేందుకు తాము నిరసన చేస్తే పోలీసు లు అరెస్టులు చేశారని.. మరి టీఆర్‌ ఎస్‌ లీడర్లను ఎందుకు వదిలేస్తున్నారని రైతు ఐక్యవేదిక నేతలు జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్‌లో ఆందోళనకు దిగారు. సన్నవడ్లకు మద్దతు ధర ఇవ్వాలని, మొక్కజొన్నను కొనాలని ఆందోళన చేపడితే.. పోలీసులు అర్ధరాత్రి ఇండ్ల లోకి చొరబడి అరెస్ట్ చేశారన్నారు.

కేసీఆర్​ పాటలు పెట్టి తన్నుకున్నరు

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ టౌన్​లో కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ, లెఫ్ట్​ పార్టీలు బంద్​లో కలిసే పాల్గొన్నాయి. నేతలంతా కలిసి ఇందిరా చౌక్ వద్ద రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్  నాయకులు మైకుల ద్వారా సీఎం కేసీఆర్ సాంగ్స్ పెట్టారు. దీనిని ఇతర పార్టీల నేతలు వ్యతిరేకించడం తో వాగ్వాదం మొదలైంది. ఒకదశలో కాంగ్రెస్, టీఆర్ఎస్​ లీడర్లు, కార్యకర్తలు  తోసేసుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని గొడవను ఆపారు.