ప్రజలు ఆల్టర్నేట్ కోసం చూస్తున్నరు.. ప్రతిపక్షాలుగా బీఆర్ఎస్, బీజేపీ ఫెయిల్: కవిత

ప్రజలు ఆల్టర్నేట్ కోసం చూస్తున్నరు.. ప్రతిపక్షాలుగా బీఆర్ఎస్, బీజేపీ ఫెయిల్: కవిత
  • బీఆర్ఎస్​ విస్మరించిన వర్గాల అజెండానే మేం ముందుకు తీసుకెళ్తం
  • దేవుడి ఆశీస్సులతో  లిక్కర్​ స్కామ్​ కేసును 
  • కోర్టు కొట్టేసిందని వ్యాఖ్య
  • అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు కవిత ఫ్యామిలీ 

హైదరాబాద్, వెలుగు: చేయని తప్పుకు నాలుగేండ్లు తనపై అవాకులు చవాకులు పేలుతూ తనను, తన కుటుంబాన్ని తీవ్రమైన మానసిక క్షోభకు గురి చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. నిజాయతీగా ఉండడంతోనే తమకు ఆ దేవుడి ఆశీస్సులు ఉన్నాయని, ఆ లిక్కర్​ కేసును కోర్టు కొట్టేసిందని చెప్పారు. దీంతో మొక్కు తీర్చుకునేందుకు తిరుమలకు వచ్చామన్నారు. ఎప్పుడు తిరుమలకు వచ్చినా తమకు మంచి జరుగుతుందని,  మూడు నెలల క్రితమే స్వామి వారి ఆశీస్సుల కోసం వచ్చానని, దీంతో కోర్టు కేసును కొట్టేసిందని చెప్పారు.

 త్వరలోనే పార్టీ పెట్టబోతున్నామని, పార్టీకి స్వామి వారి ఆశీస్సులు తీసుకుంటామని చెప్పారు. ప్రతిపక్షాలుగా బీఆర్ఎస్, బీజేపీ ఫెయిలయ్యాయని కవిత అన్నారు. ఆ పార్టీ వైఫల్యంతోనే ఒక్క హామీ నెరవేర్చకపోయినా మున్సిపల్​ ఎన్నికల్లో కాంగ్రెస్​ ఎక్కువ సీట్లు గెలుచుకున్నదన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారన్నారు. గురువారం తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం వచ్చిన ఆమె.. అలిపిరి మెట్ల మార్గం దగ్గర మీడియాతో మాట్లాడారు. 

తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా, భేదభావాలు లేకుండా మంచి చేసే పార్టీ పెడుతున్నామన్నారు. ‘‘పార్టీ పెట్టిన తర్వాత కూడా కొత్త కార్యక్రమాలు చేపడతాం. మళ్లీ స్వామి వారి ఆశీస్సుల కోసం వస్తాం. ఆంధ్రా ప్రాంతంలోని ఆదినారాయణ, ప్రతాప్, కిషోర్ యాదవ్ తదితరులు జాగృతికి మద్దతు ఇస్తున్నారు. తెలంగాణ ప్రజలకు సేవ చేసే పార్టీని మేము పెట్టబోతున్నాం’’ అని చెప్పారు. తాను సిరిసిల్ల నుంచి పోటీ చేస్తానని తన కుమారుడు అనలేదని, అనని మాటలను ప్రసారం చేయొద్దని కోరారు. 

 బీఆర్​ఎస్​, బీజేపీని జనం నమ్మరు

బీఆర్ఎస్, బీజేపీ ఇప్పుడు ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని కవిత అన్నారు. ‘‘రాజకీయ పార్టీ అంటే ఆ ప్రాంత ప్రయోజనాలు, ప్రజల మనోభావాలు, అస్తిత్వం, హక్కుల కోసం పనిచేయాలి. ఎన్నికలు ధ్యేయంగా కాకుండా తెలంగాణ హక్కుల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తాం. అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు, మహిళలు, యూత్ ను బీఆర్ఎస్ పూర్తిగా విస్మరించింది. 

బీఆర్ఎస్ విస్మరించిన వర్గాల అజెండానే మేము ముందుకు తీసుకొని వెళ్తాం. కొత్తదనంతో ముందుకు వెళ్తేనే కొత్త పార్టీలకు మనుగడ ఉంటుంది. నిరంతరం ప్రజల్లో ఉంటూ మైక్రో లెవల్ లో ప్రజల సమస్యలపై పోరాడుతాం. తెలంగాణ ఫస్ట్, తెలంగాణ హక్కుల పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తాం. తెలంగాణ ప్రజలు అన్ని ప్రాంతాలు బాగుండాలని కోరుకునే మానవతావాదులు. ఆంధ్ర ఆధిపత్యం, ఆంధ్రా రాజకీయ నాయకుల ఆధిపత్యాన్ని మాత్రమే మేము వ్యతిరేకించాం. 

ఆంధ్రా ప్రజలంటే మాకు ఎప్పుడూ ద్వేషం లేదు. రాజకీయ నాయకుల ఆధిపత్యంపై ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉంటాం. ఆంధ్రా, తెలంగాణలో ఎవరు కూడా ప్రజలపై ఆధిపత్యం చెలాయించ వద్దు. రెండు రాష్ట్రాలు విడిపోయాయి. ఎవరి బాటన వారు అభివృద్ధి చేసుకోవాలి. తిరుమలలో కల్తీ లడ్డూ విషయంలో తెలంగాణ ప్రజల మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. టీటీడీ విషయంలో ప్రజలకు విశ్వసనీయత కలిగించేలా ఇక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’’ అని కవిత కోరారు.