ప్రజలకు మార్పు  కనబడాలే -సీఎం కేసీఆర్

ప్రజలకు మార్పు  కనబడాలే -సీఎం కేసీఆర్

కొత్త రెవెన్యూ చట్టం పక్కాగా అమలయ్యేలా చూడండి

వ్యవస్థపై ప్రజలకు  నమ్మకం కలిగించండి

త్వరలో అన్ని స్థాయిల్లో ప్రమోషన్లు

తహశీల్దార్ ఆఫీసుల్లో  వసతులకు రూ.60 కోట్లు

ట్రెసా ప్రతినిధులతో సీఎం కేసీఆర్​

హైదరాబాద్, వెలుగుకొత్త రెవెన్యూ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని, వ్యవస్థలో స్పష్టమైన మార్పు కనిపించాలని రెవెన్యూ అధికారులు, సిబ్బందికి సీఎం కేసీఆర్ సూచించారు. ప్రగతి భవన్ లో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ప్రతినిధులు సీఎంతో  శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రెవెన్యూ యంత్రాంగం పాజిటివ్​గా ఆలోచించాలని, వ్యవస్థపైన ప్రజల్లో నమ్మకం కల్పించాలన్నారు. ప్రజల్లో చైతన్యం పెరిగిందని, అందుకు అనుగుణంగా పోలీసుశాఖలో మార్పొచ్చిందని, అదే మాదిరి రెవెన్యూలోనూ మార్పు రావాలన్నారు. ఇతర శాఖల్లో చేరేందుకు వీఆర్వోలకు ఆప్షన్లు ఇస్తామని సీఎం చెప్పారు. ఏజ్ ఎక్కువున్న వీఆర్ఏలు కోరుకుంటే వారి పిల్లలకు అదే జాబ్​ ఇస్తామన్నారు. రెవెన్యూశాఖలో అన్నిస్థాయిల్లో ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని, తహసీల్దార్లకు కారు, అలవెన్సు రెగ్యులర్ గా ఇవ్వాలని సీఎస్ సోమేశ్‌ కుమార్​ను సీఎం ఆదేశించారు. తహసీల్దార్ ఆఫీసుల్లో వసతులకు రూ.60 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

ప్రజలకు మర్యాద ఇవ్వండి

వివిధ పనులపై రెవెన్యూ ఆఫీసులకు వచ్చే  ప్రజలతో హుందాగా వ్యవహరించాలని, వారి సమస్యల్ని  ఓపిగ్గా విని పరిష్కరించాలన్నారు. ఎలక్షన్లు, ప్రకృతి వైపరీత్యాలు సహా 54 రకాల బాధ్యతలను రెవెన్యూ డిపార్ట్​మెంట్​సమర్థవంతంగా నిర్వహిస్తోందన్నారు. వీఆర్ ఏలకు స్కేల్ ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై రూ.260 కోట్ల అదనపు భారం పడుతున్నదని, అయినా ఇచ్చేందుకే నిర్ణయించుకున్నట్టు చెప్పారు. సమావేశంలో సీఎస్​ సోమేశ్ కుమార్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్,  ట్రెసా స్టేట్​ప్రెసిడెంట్ వంగ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. మీటింగ్​కు 60 మంది ట్రెసా ప్రతినిధులు హాజరయ్యారు.

కొత్త  చట్టానికి మద్దతు: ట్రెసా

అనేక మార్పులతో ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టానికి మద్దతిస్తున్నట్టు ట్రెసా ప్రతినిధులు చెప్పారు.  ఈ మేరకు సీఎంను కలిసి తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పగించడంపై థ్యాంక్స్​ చెప్పారు. అదేవిధంగా భూ పరిపాలన కమిషనర్ (సీసీఎల్ఏ) పోస్టును భర్తీ చేయాలని, అర్హులైన వీఆర్వోలను రెవెన్యూశాఖలోనే కొనసాగించాలని కోరారు. వెంటనే ప్రమోషన్లు ఇచ్చి ఖాళీలను భర్తీ చేయాలన్నారు. రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పగించే ముందు తహసీల్దార్లతో మీటింగ్​ ఏర్పాటు చేయాలని కోరగా సీఎం సానుకూలంగా స్పందించారు.

నేడు యాదాద్రికి కేసీఆర్

సీఎం కేసీఆర్ ఆదివారం యాదాద్రిలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం టూర్‌ వివరాలను సీఎంవో ప్రకటించింది. ఉదయం 10 గంటలకు ప్రగతిభవన్ నుంచి రోడ్డు మార్గాన బయల్దేరి.. 11 గంటలకు యాదాద్రికి చేరుకుంటారు. లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని ఆలయ డెవలప్​మెంట్​ పనులను పరిశీలిస్తారు. తర్వాత వైటీడీఏ, ఆర్ & బీ అధికారులతో ఆలయ పనులపై సమీక్షించనున్నట్టు సమాచారం. సీఎం కేసీఆర్​ చివరిసారిగా పోయినేడాది డిసెంబర్‌లో యాదాద్రిలో పర్యటించారు. మళ్లీ తొమ్మిది నెలల తర్వాత యాదాద్రికి వెళ్తున్నారు.