కరోనా డౌట్​తో గాంధీకి పోయిన వ్యక్తి.. 20 రోజుల తర్వాత మార్చురీలో డెడ్​బాడీ

కరోనా డౌట్​తో గాంధీకి పోయిన వ్యక్తి.. 20 రోజుల తర్వాత మార్చురీలో డెడ్​బాడీ

పద్మారావునగర్, వెలుగు: కరోనా సోకిందనే అనుమానంతో గాంధీ హాస్పిటల్​కు వెళ్లి మిస్సయిన ఓ వ్యక్తి.. 20 రోజుల తర్వాత అదే హాస్పిటల్​ మార్చురీలో డెడ్​బాడీగా దొరకడం కలకలం రేపుతోంది. అసలు తను ఎలా చనిపోయాడు, గాంధీ హాస్పిటల్​ మార్చురీలో ఎలా చేర్చారు, ఫ్యామిలీకి సమాచారం ఎందుకు ఇవ్వలేకపోయారు, ఏం జరిగిందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తన సోదరుడు గాంధీ హాస్పిటల్​కు వెళ్లి మిస్సయ్యాడంటూ ముఖేష్​సింగ్​ పోలీసులకు కంప్లైంట్​ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

కరోనా లక్షణాలున్నాయని తీసుకెళ్లి..

హైదరాబాద్​లోని ధూల్​పేటకు చెందిన నరేందర్​సింగ్ (35) అనారోగ్యంతో గత నెల 30న కింగ్​కోఠి హాస్పిటల్​కు వెళ్లాడు. డాక్టర్లు నరేందర్​కు కరోనా లక్షణాలు ఉన్నట్టు గుర్తించి గాంధీ హాస్పిటల్​కు పంపించారు. ఆ రోజున, మరుసటి రోజున నరేందర్​సింగ్​ తన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడాడు. తర్వాతి నుంచి అతని ఫోన్​ స్విచాఫ్​ వచ్చింది. దీంతో నరేందర్​ సోదరుడు ముఖేశ్​​సింగ్​ మంగళ్​హాట్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్​ కేసు నమోదు చేశారు. ఎటూ తేలకపోయే సరికి ముఖేశ్​​సింగ్​ మూడు రోజుల కింద సోషల్​ మీడియాలో ఓ వీడియో విడుదల చేశాడు. తన సోదరుడు గాంధీకి వెళ్లి మిస్సయ్యాడంటూ వివరాలు చెప్పాడు. ఆచూకీ చెప్పకపోతే హైకోర్టుకు వెళ్తానన్నాడు. అయితే మంగళ్ హాట్ పోలీసులు శనివారం గాంధీ హాస్పిటల్​కు వచ్చి మార్చురీలను పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తిగా జనరల్ మార్చురీలో ఉంచిన నరేందర్​సింగ్​ డెడ్​బాడీని గుర్తించి, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. నరేందర్​ చనిపోయాడని తెలియడంతో కుటుంబ సభ్యులు ఆవేదనకు లోనయ్యారు. గాంధీ డాక్టర్లు, స్టాఫ్​ నిర్లక్ష్యంతోనే నరేందర్​ చనిపోయాడని.. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్​చేశారు.

మృతి వెనుక సందేహాలెన్నో?

నరేందర్​ కరోనా పేషెంటా, కాదా.. గాంధీ జనరల్​ మార్చురీలోకి ఆ డెడ్​బాడీ ఎలా వచ్చింది, గుర్తుతెలియని వ్యక్తిగా ఎలా నిర్ధారించా్చారనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా గుర్తు తెలియని శవాలను ఉస్మానియా హాస్పిటల్​కు తరలిస్తారు. అలాకాకుండా గాంధీకి ఎలా తరలించారనేది తేలాల్సి ఉంది. ఇటీవల గాంధీలో కరోనా పేషెంట్ల డెడ్​బాడీలు తారుమారవడం వివాదంగా మారింది. ఇప్పుడు కరోనా లక్షణాలతో మిస్సయిన వ్యక్తి బాడీ జనరల్​ మార్చురీలో కనిపించడం కలకలం రేపుతోంది.

హాస్పిటల్​ స్టాఫ్​ నిర్లక్ష్యమేం లేదు

‘నరేందర్​సింగ్​ కరోనా పేషెంట్ కాదు. అతను గత నెల 30న ఒకసారి ఔట్​పేషెంట్​ వార్డుకు వచ్చి వెళ్లినట్టు రికార్డులో ఉంది. అతడి వివరాలు కరోనా వార్డులో లేవు. ఈ డెత్​కు సంబంధించి మెడికో లీగల్​ కేసుగా వివరాలు నమోదు చేశాం. పోలీసులే గుర్తు తెలియని బాడీగా మార్చురీలో చేర్చారు. ఇందులో గాంధీ హాస్పిటల్​ స్టాఫ్​ నిర్లక్ష్యమేమీ లేదు. – ఎం.రాజారావు, గాంధీ సూపరింటెండెంట్

మ‌రిన్ని వార్త‌ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి