హైకోర్టుకు సెస్‌‌ పంచాయితీ.. ఎన్పీడీసీఎల్లో విలీనం చేయాలంటూ పిటిషన్‌‌.. ఏప్రిల్ 6న విచారణ

హైకోర్టుకు సెస్‌‌ పంచాయితీ.. ఎన్పీడీసీఎల్లో విలీనం చేయాలంటూ పిటిషన్‌‌.. ఏప్రిల్ 6న విచారణ

రాజన్నసిరిసిల్ల, వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లా సహకార విద్యుత్‌‌ సరఫరా సంఘం (సెస్) వివాదం కోర్టుకు చేరింది. సెస్‌‌ లైసెన్స్‌‌ రెన్యూవల్‌‌ కాకపోవడంతో ఆ సంస్థ కార్యకలాపాలను టీజీఎన్పీడీసీఎల్‌‌ స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో సెస్‌‌ను పూర్తిగా ఎన్పీడీసీఎల్‌‌లో విలీనం చేయాలంటూ సిరిసిల్లకు చెందిన పౌర సంక్షేమ సమితి అధ్యక్షుడు బియ్యంకార్‌‌ శ్రీనివాస్‌‌ హైకోర్టులో పిటిషన్‌‌ వేశారు. పిటిషన్‌‌ను ఈ నెల 6న విచారించనున్నట్లు తెలుస్తోంది. మరో వైపు సెస్‌‌ పాలకమండలి ఉండగానే.. సంస్థ నిర్వహణ బాధ్యతలను ఎన్‌‌పీడీసీఎల్‌‌కు అప్పగించడాన్ని సవాల్‌‌ చేస్తూ పాలకమండలి సైతం రెండు రోజుల్లో హైకోర్టు ఆశ్రయించేందుకు సమాయత్తం అవుతోంది.

  • ఎనిమిదేండ్లలో రూ. 94 కోట్లకు పైగా నష్టం

సిరిసిల్ల సెస్‌‌ను పూర్తిగా మూసివేసి టీజీఎన్పీడీసీఎల్‌‌లో విలీనం చేయాలంటూ సిరిసిల్ల పట్టణానికి చెందిన శ్రీనివాస్‌‌ గత నెల 31న హైకోర్టులో పిటిషన్‌‌ వేశారు. సెస్‌‌ సంస్థలో ఇన్నాళ్లూ జరిగిన అవినీతి, అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ ఎలక్ట్రికల్‌‌ రెగ్యులేటరీ కమీషన్ పంపిన ఆడిటర్స్ తేల్చిన లెక్కల ప్రకారం 2014 -– 22 కాలానికి సంబంధించి సెస్‌‌లో 94.99 కోట్ల నష్టం వాటిల్లిందని పిటిషన్‌‌లో పేర్కొన్నారు. ఇందులో కేటగిరి 3 కింద వసూలు చేయాల్సిన బిల్లులను కేటగిరి 2 కింద వసూలు చేయడం వల్ల రూ.3.41 కోట్ల నష్టం రాగా, కనెక్షన్లు సక్రమంగా ఇవ్వకపోవడం వల్ల రూ.22.16 కోట్లు, ఎల్‌‌టీ టారిఫ్​కింద మూడేండ్లకు పైగా తప్పుగా బిల్లింగ్ చేసిన 62హెచ్‌‌టీ కనెక్షన్ల కారణంగా రూ.23.77 కోట్ల నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. 

సున్నా రీడింగ్ చూపిస్తున్న కేటగిరీ 6 కనెక్షన్ల వల్ల రూ. 3.12 కోట్లు, స్ట్రక్‌‌ ఆఫ్‌‌ స్థితిలో ఉన్న మీటర్ల కారణంగా రూ.18.83 కోట్లు, పవర్‌‌లూం కోర్టు కేసుకు సంబంధించి 18.84 కోట్లు, ఇతర ఖర్చులు రూ.4.99 కోట్లు కలిపి మొత్తం రూ. 94 కోట్లపై నష్టం వాటిల్లినట్లు పిటిషన్‌‌లో తెలిపారు. ఆడిట్‌‌ జరుగుతున్న కాలంలో సెస్‌‌కు సంబంధించిన రూ. 59.54 కోట్ల విలువైన ఆస్తులను సెస్‌‌ బుక్స్‌‌లో నమోదు చేయలేదన్నారు. విద్యుత్ కొనుగోలుకు సంబంధించి 2022 నాటికి టీజీఎన్పీడీసీఎల్‌‌కు 558.44 కోట్ల బకాయిల చెల్లించాల్సి ఉండగా.. 2026 నాటికి రూ. 900 కోట్లకు చేరుకున్నాయన్నారు. ఆఫీస్‌‌ సిబ్బంది ప్రయాణ ఖర్చుల కింద నెలకు రూ.8 లక్షల చొప్పున, మూడేండ్లలో రూ. 2.90 కోట్లు చెల్లించారని పేర్కొన్నారు. 

  • ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీపైనే ఆధారం

సెస్‌‌ రెవెన్యూ రిపోర్ట్‌‌ (ఏఆర్ఆర్) ప్రకారం 2025 నాటికి ఆ సంస్థ ఆర్థిక పరిస్థితి పూర్తిగా కుప్పకూలిందని, 2026 – 27 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని పిటిషనర్ పేర్కొన్నాడు. 2024– 26 సంవత్సరాల మధ్య ఆర్థిక లోటు 44 శాతం పెరుగగా.. సిరిసిల్ల జిల్లాలో మొత్తం విద్యుత్‌‌ సరఫరా ఖర్చులో సుమారు 67 శాతం ప్రభుత్వ ఖజానా నుంచే భరించాల్సి వస్తోందన్నారు. టీజీఎన్పీడీసీఎల్, టీజీఎస్పీడీసీఎల్‌‌ సుమారు 40, 45 శాతం సబ్సిడీపైనే ఆధారపడి ఉండగా.. సిరిసిల్ల సెస్‌‌ మాత్రం 67 శాతం సబ్సీడీపై ఆధారపడాల్సి వస్తోందని శ్రీనివాస్‌‌ తన పిటిషన్‌‌లో పేర్కొన్నారు. 

  • 56 ఏండ్లలో తొలిసారి ఎన్పీడీసీఎల్ నిర్వహణ

56 ఏండ్ల చరిత్రలో తొలిసారి సెస్‌‌ కార్యకలాపాలు ఎన్పీడీసీఎల్‌‌ పరిధిలో జరుగుతున్నాయి. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌‌రెడ్డి మూడు రోజులుగా సిరిసిల్ల సెస్‌‌లోనే ఉండి అన్ని విభాగాల ఆఫీసర్లతో రివ్యూలు నిర్వహించారు. సెస్‌‌ నిర్వాహణ ఇక నుంచి ఎలా ఉండబోతోందన్న విషయాలపై దిశానిర్దేశం చేశారు. విద్యుత్‌‌ సరఫరా, బకాయిలు, ఇతర సమస్యలపై ఆఫీసర్లతో చర్చించారు. వినియోగదారులకు ఎలాంటి నష్టం జరుగకుండా సెస్ నిర్వహణ ఉండాలని సూచనలు చేశారు.

  • కోర్టును ఆశ్రయించనున్న పాలకమండలి

సెస్‌‌ను స్వతంత్ర సంస్థగా కొనసాగించాలని, పాలక మండలి ఆధ్వర్యంలోనే కార్యకలాపాలు కొనసాగేలా చూడాలని, లైసెన్స్‌‌ను రెన్యూవల్‌‌ చేయాలంటూ సెస్‌‌ పాలక మండలి సైతం రెండు రోజుల్లో హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. 56 ఏండ్లుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సెస్‌‌ నడుస్తోందని పాలకమండలి సభ్యులు చెబుతున్నారు. వియోగదారులతో, కో ఆపరేటివ్‌‌ బైలా ప్రకారం ఎన్నుకున్న పాలకవర్గానికి సెస్‌‌ను నడిపించే అధికారం ఇవ్వాలని కోర్టును అభ్యర్థించే అవకాశముంది. కాగా, ఈ నెల 4న సెస్‌‌ సర్వసభ్య సమావేశం జరగాల్సి ఉండగా దానిని 
వాయిదా వేశారు.