కరోనా ట్రీట్‌మెంట్‌కు ఫైజర్​ గోలీ

కరోనా ట్రీట్‌మెంట్‌కు ఫైజర్​ గోలీ
  • కొత్త టాబ్లెట్‌ను తయారు చేసిన అమెరికా కంపెనీ
  • వైరస్​ సోకకుండా.. సోకినంక చికిత్సకూ ఉపయోగం

న్యూయార్క్: కరోనా ట్రీట్​మెంట్​కు త్వరలో టాబ్లెట్​ను అందుబాటులోకి తీసుకొస్తామని అమెరికా కంపెనీ ఫైజర్​ ప్రకటించింది. తయారీ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని, దాని పనితీరుపై ప్రయోగాలు జరుగుతున్నాయని చెప్పింది. ఇప్పటికే జరిపిన పరీక్షల్లో టాబ్లెట్​ వాడకం సేఫ్​ అని తేలిందన్నారు. దీంతో కరోనా బారిన పడకుండా ఈ యాంటీ వైరల్​ డ్రగ్  రక్షణ కల్పిస్తుందా లేదా తెలుసుకోడానికి 2,660 మందిపై ప్రయోగం చేస్తున్నట్లు తెలిపింది. హెచ్​ఐవీ ట్రీట్​మెంట్​లో ఉపయోగించే యాంటీవైరల్​ డ్రగ్  రిటోనావిర్​తో కలిపి  ఈ టాబ్లెట్​ను టెస్ట్​ చేస్తున్నట్లు పేర్కొంది. 

వ్యాక్సిన్లు వచ్చినయ్.. మందులకే కొరత

కరోనా బారిన పడకుండా అడ్డుకోవడానికి పలు వ్యాక్సిన్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. వైరస్​ బారినపడినోళ్లకు ట్రీట్​మెంట్​ ఇచ్చేందుకే సరైన మందులు లేవు. ఇప్పుడు ఇస్తున్న మందులు రోగి శరీరంలోని ఇమ్యూనిటీని, వ్యాధిపై పోరాడే శక్తిని పెంచేవే తప్ప నేరుగా వైరస్​ను టార్గెట్​ చేసే మందులు చాలా తక్కువని ఫైజర్​ ప్రతినిధులు చెప్పారు. వాటి ఖరీదు కూడా చాలా ఎక్కువని, ప్రొడక్షన్​ తక్కువగా ఉండడం వల్ల మార్కెట్​లో వాటికి కొరత ఉందని వివరించారు. పైగా వాటిని ఆస్పత్రులలో మాత్రమే ఉపయోగించాలి తప్ప సాధారణ మాత్రల్లా వాడలేమని పేర్కొన్నారు. ఈ క్రమంలో కరోనా ట్రీట్​మెంట్​లోని అవరోధాలను తప్పించి, ఆస్పత్రిలో చేరే పరిస్థితి రాకుండా చేయాలని ఓరల్​ థెరపీ దిశగా ప్రయోగాలు చేశామన్నారు. ఫైజర్​ టాబ్లెట్​కరోనాను ఎర్లీ స్టేజ్​లోనే అడ్డుకుంటుందని, బాధితుల నుంచి సోకకుండా చక్కగా ఆపుతుందని కంపెనీ చీఫ్​ సైంటిఫిక్​ ఆఫీసర్​ డాక్టర్​ మైకేల్​ దోల్స్​తెన్ వివరించారు.