సోషల్‌ మీడియానే సాయానికి వేదిక

సోషల్‌ మీడియానే సాయానికి వేదిక
  • పిల్లలు, మహిళల సేవలో పీహెచ్‌ సీ సంస్థ
  • ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచి ఆర్థిక సాయం
  • ఐటీ ఉద్యోగులు, సివిల్స్‌ కాంపీటేటర్స్‌నే మెంబర్స్‌
  • సమాజసేవలో పీపుల్స్​ హెల్ప్​ చిల్డ్రన్ సంస్థ

అధైర్యంతో ఉన్న పిల్లల గుండెల్లో మనోధైర్యాన్ని నింపుతూ రేపటి సమాజానికి వారి అవసరాన్ని చాటి చెబుతున్నారు. బాల్యం మొగ్గలోనే చిదిమిపోకుండా బంగారు భవిష్యత్‌ కు బాటలు వేసేందుకు దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నారు . ప్రాణాపాయ స్థితిలో ఉన్న పిల్లలను కాపాడి పునర్జన్మను ప్రసాదిస్తున్నారు పీపుల్స్ హెల్ప్ చిల్డ్రన్ (పీహెచ్ సీ) సంస్థ సభ్యులు.

హైదరాబాద్,వెలుగు:  చిన్నపిల్లలకు సేవ చేయాలనే ఆలోచనతో  పీపుల్స్​హెల్ప్​చిల్డ్రన్​ (పీహెచ్​సీ) సంస్థ  ఏర్పడింది.  ఒక్కడితో ఆరంభమవగా ప్రస్తుతం 37 మంది యాక్టివ్​ మెంబర్లు, వేల మంది వలంటీర్లతో  పలు సేవలను  నిర్వహిస్తుంది. యాక్టివ్​ మెంబర్లుగా చాలామంది సివిల్స్​కు ప్రిపేర్​ అవుతున్న వారే ఉన్నారు.

కదిలించిన నాప్కిన్‌‌ కథనం

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని హనుమాన్​నగర్​కు చెందిన సంతోష్ చదువు పూర్తి కాగానే జాబ్​ కోసం సిటీకి వచ్చాడు. ముందుగా చిన్న ఉద్యోగంలో చేరిన అతడు అనంతరం ఐటీ  జాబ్‌‌లో సెటిల్‌‌ అయ్యాడు. సోషల్​ అవేర్​నెస్​ ఉన్న అతడు బిజీ గా ఉండడంతో ఎక్కువ టైం కేటాయించలేకపోయేవాడు. అయితే హర్యానాలో ఒక మహిళ నెలసరి అప్పుడు నాప్కిన్​కు బదులు జాకెట్​గుడ్డ ముక్కలు వాడడంతో ఇన్‌‌ఫెక్షన్‌‌ అయి ప్రాణాలు కోల్పోయినది పేపర్లో చదివాడు. ఇది అతడిని కదిలించింది. దీంతో తన వంతుగా సేవ చేయాలని పీపుల్స్​హెల్ప్​ చిల్డ్రన్​ (పీహెచ్​సీ) సంస్థను 2016లో ప్రారంభించాడు. సంస్థ లక్ష్యాలు, ఉద్ధేశాలను తోటి ఉద్యోగులకు వివరించి సాయం కోరాడు. దీంతో మరో 6 మంది ముందుకొచ్చి నెలకు రూ. 300 సాయం అందించారు. సంస్థలో యాక్టివ్​ మెంబర్​గా ఉంటామని చెప్పారు. అలా ప్రస్తుతం150 మంది ఇస్తున్నారు. ఈ మొత్తాన్ని అనాథ ఆశ్రమాల్లోని చిన్నారులకు ఖర్చు చేస్తున్నారు. రెండు అనాథ ఆశ్రమాలను దత్తత తీసుకున్నారు. సంస్థలో తెలంగాణ, ఏపీతో పాటు చత్తీస్​ఘడ్​, రాజస్థాన్​, కర్నాటకలకు చెందిన వారు సభ్యులుగా ఉన్నారు. వీరిలో సివిల్స్​కు  ప్రిపేర్​ అవుతున్నవారు, సాఫ్ట్​వేర్ ​ఉద్యోగులు, విద్యార్థులు యాక్టివ్​గా పని చేస్తున్నారు.

ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని

ఆపదలో ఉన్న పిల్లలను ఆదుకోవాలని సోషల్​ మీడియా వేదికగా పీహెచ్​సీకి అనేక వినతులు వస్తుండడంతో ఏడుగురు పిల్లలను ప్రాణాపాయ స్థితి నుంచి పీహెచ్​సీ వలంటీర్లు కాపాడారు. కేన్సర్​బాధితురాలు  అయేషా వైద్యం కోసం రూ.1లక్షా 6 వేల విరాళాలను సేకరించి కీమోథెరపీ చేయించారు. ఫిట్స్​తో బాధపడుతున్న నెల్లూరు చెందిన సమీరకు వైద్య ఖర్చులు భరించారు.  బ్లడ్​ కేన్సర్​తో బాధపడుతున్న దివాకర్​కు రూ.లక్షా 37వేలు సాయమందించారు.  ఊపిరితిత్తుల సమస్యతో అనారోగ్యంపాలైన  కౌసర్​, బోన్​మ్యారో సమస్యతో బాధపడుతున్న శ్రీయాన్​, యాక్సిండెంట్‌‌ లో చెయ్యి కోల్పోయిన రెహ్మాన్​కు  వైద్యం చేయించారు.

4 , 225 మందికి అండగా..

ఇప్పటి వరకు పీహెచ్​సీ 4 ,225 మంది చిన్నారులకు అండగా నిలిచింది. తెలంగాణ, ఏపీ జిల్లాలోని అనేక గ్రామాల్లోని పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు, దుస్తులు, స్టేషనరీ పంపిణీ చేశారు.  ట్రైబల్​,  గ్రామీణ ప్రాంతాలు, సిటీలోని అనాథ ఆశ్రమాల్లో ఉంటున్న  విద్యార్థినులకు  నాప్కిన్స్​ అందజేశారు.  పీహెచ్​సీ సభ్యులు పండుగలను పిల్లలతోనే ఎక్కువగా జరుపుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.

లభించిన అవార్డులు

నవంబర్​14 న బాలల దినోత్సవం రోజు చిల్డ్రన్​ హెల్పింగ్​ విభాగంలో  రాష్ట్ర ప్రభుత్వం సేవా పురస్కారం అందజేసింది. రవీంద్రభారతిలో పీహెచ్​సీ టీమ్​కు అందజేసి సన్మానించింది. రెయినోబో ఆధ్వర్యంలో బెస్ట్​ సపోర్‌‌ టీమ్​అవార్డు కూడా దక్కింది.

స్పందించి కేటీఆర్ సాయం

ఇటీవల బాలుడు అభిరామ్ కు డెంగీతోపాటు ఫిట్స్ రావడంతో కోమాలోకి  వెళ్లాడు.డాక్టర్లు లక్షలు ఖర్చవుతాయనడంతో తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు .ఇది తెలుసుకున్న పీహెచ్ సీ అభిరామ్ ను కలిసిం ది. అతని స్థితిని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసింది. అనేకమంది నెటిజన్లు స్పందించి అండగా నిలిచారు.ట్విట్టర్ ద్వారా  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు . స్పందించి అభిరామ్ కు ట్రీట్‌‌మెంట్‌‌  కోసం రూ.2లక్షలు అందించేందుకు కృషి చేశారు. పీహెచ్సీ తరపున మరో రూ.4 లక్షల 60 వేలను అభిరామ్ కుటుంబానికి అందించారు.

చిన్నారుల అభివృద్ధే ముందున్న లక్ష్యం

సివిల్స్‌ కు ప్రిపేర్ అవుతున్నా.శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ కు వచ్చా. సోషల్ మీడియా ద్వారా పీహెచ్ సీ గురించి తెలుసుకున్నా.పిల్లల కోసం పని చేయడం చాలా నచ్చింది. వారి ఎదుగుదల ఎంతోఅవసరం. చిన్నారుల అభివృద్ధికికృషి చేయడమే ముందున్న లక్ష్యం.– దీపిక శ్రీ

పిల్లలకు సేవ చేయడం అనుభూతినిచ్చింది

సివిల్స్ కు సిద్ధమవుతున్నాను. కానీ పేదలకు సేవచేయాలన్నది కోరిక ఉంది. పీహెచ్ సీ గురించి తెలిసి సంస్థలో పనిచేసేందుకు నిర్ణయించుకున్నాను. చాలా సంస్థలు ఉన్నా వీటికి భిన్నంగా పీహెచ్ సీ పిల్లల కోసం పనిచేస్తున్నది. సంస్థ లక్ష్యం నచ్చడంతో వెంటనే చేరాను.స్వయంగా వారితో కలిసి వెళ్లి చిన్నారులకు సాయం చేయడం తెలియని అనుభూతిని ఇస్తుంది. ఐఏఎస్ అవుతానో లేదో.. కానీ పీహెచ్ సీతో కలిసి సమాజ సేవ చేయడం చాలా బాగుంది.– కిరణ్మయి రావు