ఫోన్ ట్యాపింగ్ : బీఆర్ఎస్ పార్టీ కోసమే స్పెషల్ SOT ఏర్పాటు : భుజంగరావు

ఫోన్ ట్యాపింగ్ : బీఆర్ఎస్ పార్టీ కోసమే స్పెషల్ SOT ఏర్పాటు : భుజంగరావు

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్  కేసులో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలోని కీలక అంశాలను పోలీసులు బయటపెట్టారు. 

ప్రణీత్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలకు సహకరించడానికి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ప్రత్యేకంగా ఎస్వోటీ ( Special Operation Team)ని ఏర్పాటు చేశారని భుజంగరావు కస్టడీ విచారణలో భాగంగా దర్యాప్తు బృందానికి వెల్లడించారు.  ఆరునూరైనా రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలన కొనసాగాలన్నదే ప్రభాకర్ రావు ఆలోచనగా ఉండేదని..  అందుకు తగ్గట్లుగానే కీలకమైన విపక్ష నేతలు, బీఆర్ఎస్ అసమ్మతులపై తమ నిఘా ఉండేదని చెప్పారు.  ఈ నేతల పబ్లిక్ యాక్టివిటీతో పాటు వ్యక్తిగత వ్యవహారాల పైనా నిఘా పెట్టి, బీఆర్ఎస్ పెద్దలు సమాచారం తెలుసుకునేవారని వెల్లడించారు.  

విపక్ష నేతల ఫోన్లు, సోషల్ మీడియాపై నిఘా పెట్టడం, టార్గెట్ చేసిన వారికి సంబంధించిన డబ్బును సీజ్ చేయడం ద్వారా 2018 అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో ఎస్వోటీ కీలకంగా పనిచేసిందని భుజంగరావు తెలిపారు.ఆ తర్వాత పలు బైపోల్స్ టైమ్ లోనూ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలోనూ బీఆర్ఎస్ కోసమే పనిచేశామని చెప్పారు.

2021 నుంచి ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావుతో కలిసి తాను కీలకంగా పనిచేశానని... మీడియా చానెల్ అధినేత శ్రవణ్ రావు, కేసీఆర్ సన్నిహితుడు దామోదర్ రావు, ఇతర బీఆర్ఎస్ ముఖ్య నేతల సూచనలతో తాము ట్యాపింగ్ నిఘా పెట్టేవాళ్లమని భుజంగరావు వెల్లడించారు. -2022 నవంబర్ లో జరిగిన మునుగోడు బైపోల్ సమయంలోనూ బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్ చేసి, వారికి అందే ఆర్థిక వనరులను టార్గెట్ గా సీజ్ చేయడం ద్వారా బీఆర్ఎస్ గెలుపులో కీలకంగా పనిచేశామని తెలిపారు.  

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం తాము  ట్యాపింగ్ నిఘాను మరింత విస్త్రతంచేశామని. విపక్ష నేతలు, వారికి సహకరించే ఫైనాన్షియర్లు, వ్యాపారవేత్తలతో పాటు జర్నలిస్టులు, బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్లపై ట్యాపింగ్ నిఘా పెట్టామన్నారు. విపక్ష నేతల ఆర్థిక వనరులను టార్గెట్ గా సీజ్ చేయడం, బీఆర్ఎస్ నేతలకు నిధులు సాఫీగా అందేలా చూడడం, బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వాయిస్ వినిపించే మీడియా, సోషల్ మీడియా వారిని అణచివేయడమే లక్ష్యంగా ప్రభాకర్ రావు ఆదేశాలతో ప్రణీత్ రావు ట్యాపింగ్ నిఘా పెట్టారని తెలిపారు. డబ్బు సీజ్ కోసం గ్రేటర్ పరిధిలోని అన్ని కమిషనరేట్ల ఎస్వోటీలను ఉపయోగించుకున్నామని భుజంగరావు తెలిపారు.  

2023 అక్టోబర్ 20న రాధాకిషన్ రావును ఎలక్షన్ కమిషన్ తప్పించడంతో హైదరాబాద్ లో మా పని కష్టంగా మారిందని చెప్పారు భుజంగరావు . కొత్తగా వచ్చిన అధికారులు తమ  సమాచారం రాజకీయ లక్ష్యంతో ఉంది కాబట్టి, దాని ఆధారంగా పనిచేయడానికి వెనుకాడారు. అయితే సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఎస్వోటీలు సహకరించడంతో తమ యాక్టివిటీ కొనసాగిందన్నారు.