ఎడ్టెక్ రంగంలో సరికొత్త ‘స్టూడెంట్ వార్’ మొదలైంది. ఈ బిజినెస్ లో ఉన్న ఫిజిక్స్ వాలా సంస్థ తమ ఆఫ్‌లైన్ క్లాస్రూమ్ ప్రోగ్రామ్‌లలోకి టాపర్లను ఆకర్షించేందుకు ఒక సంచలన వ్యూహాన్ని అమలు చేస్తోంది. ప్రత్యర్థి కోచింగ్ ఇన్స్టిట్యూట్ల నుంచి అత్యుత్తమ ప్రతిభ కనబరిచే బెస్ట్ విద్యార్థులను తమ సంస్థకు తీసుకువచ్చే కొత్తగా చేరిన ఫ్యాకల్టీ సభ్యులకు ఏకంగా రూ.15 లక్షల వరకు భారీ డబ్బు బహుమతులను ఆఫర్ చేస్తోంది. కంపెనీకి చెందిన డాక్యుమెంట్స్ ద్వారా ఈ షాకింగ్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. 2027 క్లాస్రూమ్ బ్యాచ్‌లలో చేరే విద్యార్థుల అకడమిక్ ర్యాంకుల ఆధారంగా ఉపాధ్యాయులకు ఈ భారీ ప్యాకేజీలను అందించనున్నారు.
ఈ వినూత్న పాలసీ ప్రకారం.. ప్రత్యర్థి సంస్థల నుండి ఉపాధ్యాయులు తమతో పాటు తీసుకువచ్చే విద్యార్థులు జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్ లేదా నీట్ పరీక్షల్లో సాధించే ఫలితాలను బట్టి రూ.2 లక్షల నుండి రూ.15 లక్షల వరకు రివార్డులు అందిస్తారు. ఒకవేళ సదరు విద్యార్థి ఆల్ ఇండియా 1వ ర్యాంక్ సాధిస్తే ఆ టీచర్‌కు అత్యధికంగా రూ.15 లక్షలు అందుతాయి. అలాగే 2, 3 ర్యాంకులకు రూ.12 లక్షలు, 4 నుండి 10 ర్యాంకులకు రూ.9 లక్షలు, 11 నుండి 100 లోపు ర్యాంకులకు రూ.7.5 లక్షలు, 101 నుండి 500 లోపు ర్యాంకులకు రూ.4 లక్షలు, 501 నుండి 1000 లోపు ర్యాంకులు వస్తే రూ.2 లక్షల చొప్పున టీచర్లకు క్యాష్ ప్రైజ్ ఇవ్వాలని ఫిజిక్స్‌వాలా ప్లాన్ చేసింది.
కోచింగ్ ఇండస్ట్రీలో సాధారణంగా ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించడానికి 'టాలెంట్ నర్చర్ టీమ్స్' ప్రత్యేకంగా పనిచేస్తాయి. కానీ ఫిజిక్స్ వాలా ఒక అడుగు ముందుకు వేసి.. కొత్తగా తమ సంస్థలో ఉద్యోగాల్లో చేరే ఫ్యాకల్టీని కూడా ఇందులో భాగస్వామ్యం చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పాత ఇన్స్టిట్యూట్లను వీడే ఉపాధ్యాయులు, అక్కడి టాపర్లను కూడా తమతో పాటు ఫిజిక్స్ వాలాకు తీసుకువచ్చేలా ప్రోత్సహించడమే ఈ క్యాష్ రివార్డ్స్ ముఖ్య ఉద్దేశం. అయితే దీనిపై కంపెనీ స్పందిస్తూ.. ఇది కేవలం ఉద్యోగుల రెఫరల్ పాలసీ మాత్రమేనని, విద్యార్థుల కేవలం నమోదు మాత్రమే కాకుండా దీర్ఘకాలిక విద్యా ఫలితాల ఆధారంగానే ఈ వాలంటరీ రివార్డులను అందిస్తామని సమర్థించుకుంది.
►ALSO READ | ఇది కదా ట్విస్ట్ అంటే.. రిటైర్మెంట్ రోజే ఐఏఎస్ ఆఫీసర్ అరెస్ట్.. ఇంతకీ కేసు ఏంటంటే..
ఫిజిక్స్ వాలా ఈ స్థాయిలో దూకుడుగా వ్యవహరించడానికి కారణం వారి ఆఫ్‌లైన్ బిజినెస్ సామ్రాజ్యం భారీగా విస్తరించడమే. ఆర్థిక సంవత్సరం 2026లో కంపెనీ ఆఫ్‌లైన్ ఆదాయం 31 శాతం వృద్ధితో దాదాపు రూ.1,774 కోట్లకు చేరింది. ఇది కంపెనీ మొత్తం ఆదాయంలో దాదాపు సగభాగం కావడం విశేషం. అంతేకాకుండా ఇండియా, యూఏఈ వ్యాప్తంగా తమ క్లాస్రూమ్ కేంద్రాలను 198 నుండి ఏకంగా 353 కి పెంచింది. ఆఫ్‌లైన్ విద్యార్థుల సంఖ్య కూడా 4.6 లక్షలకు పైగా దాటింది. ఆన్లైన్ రంగం నుండి ఆఫ్‌లైన్ కోచింగ్‌లోకి వేగంగా విస్తరిస్తున్న తరుణంలో అలెన్, ఆకాష్, నారాయణ, చైతన్య, రెజోనెన్స్ వంటి పాత దిగ్గజాలకు గట్టి పోటీ ఇవ్వడానికి ఫిజిక్స్ వాలా ఈ టాపర్ల వేట అనే కొత్త గేమ్ మొదలుపెట్టింది.
ఆఫ్‌లైన్ కోచింగ్ రంగంలో సక్సెస్ అనేది కేవలం బ్రాంచ్‌లు తెరవడంపై కాకుండా.. టాప్ ర్యాంకులు సాధించే బ్యాచ్‌లను నిర్మించడంపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే ఐపీఓ ద్వారా సేకరించే నిధులలో రూ.460 కోట్లను క్లాస్రూమ్ నెట్వర్క్ విస్తరణకే ఫిజిక్స్ వాలా కేటాయించింది. అయితే ఉపాధ్యాయులకు ఇలాంటి భారీ ఆర్థిక ప్రలోభాలు కల్పించడం వల్ల ఇండస్ట్రీలో అనారోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని, విద్యార్థులు చదువుకుంటున్న మధ్యలోనే సంస్థలను మారేలా ఒత్తిడికి గురవుతారని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా, కార్పొరేట్ కోచింగ్ రంగంలో విద్యార్థులను లాగేందుకు జరుగుతున్న ఈ క్రేజీ ప్యాకేజీల వార్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పేరెంట్స్ కూడా పిల్లల భవిష్యత్తుతో ఇలాంటి ఆటలేంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
