- మూడేండ్ల తర్వాత మరోసారి విభృంభణ
- ఎడతెరిపి లేని వానలు, మబ్బుపట్టిన వాతావరణమే కారణమంటున్న ఆఫీసర్లు
- దిగుబడిపై ఆశ లేకపోవడంతో పత్తి చేన్లు దున్నేస్తున్న రైతులు
- యాసంగిలో మక్కలు సాగు చేసే ఆలోచన...
హైదరాబాద్, వెలుగు : పత్తి పంటపై మరోసారి గులాబీ రంగు పురుగులు విజృంభిస్తున్నాయి. వీటి కారణంగా పత్తి పంట తీవ్రంగా దెబ్బతింటోంది. రాష్ట్రంలో మూడేండ్ల తర్వాత మరోసారి గులాబీ రంగు పురుగులు పంటలపై దాడి చేస్తుండడంతో రైతులను ఆందోళన చెందుతున్నారు. మొంథా తుఫాన్‌తో పత్తి పంటకు ఇప్పటికే భారీగా నష్టం వాటిల్లగా, మిగిలిన పత్తి పంటను గులాబీ పురుగులు నాశనం చేస్తున్నాయి. ఎడతెరిపి లేని వానలు, మబ్బు పట్టిన వాతావరణం కారణంగా గులాబీ పురుగు దాడి పెరిగినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. కండ్ల ముందే పంట నాశనం అవుతుండడం, పత్తి ఏరేందుకు అనువుగా లేకపోవడంతో రైతులు పత్తి పంటను దున్నేస్తున్నారు. పత్తిని తొలగించి దాని స్థానంలో మక్కలు వేసేందుకు సిద్ధం అవుతున్నారు.
కొంపముంచిన బీజీ–3
అసలు బీజీ–2 పత్తి విత్తనానికి గులాబీ రంగు పురుగును తట్టుకునే శక్తి లేదని తెలిసినా ఆ విత్తనం విక్రయించేందుకు బహుళజాతి విత్తన కంపెనీలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. దీని కారణంగానే గులాబీ రంగు పురుగు రాష్ట్రంలో సాగైన పత్తి దిగుబడిని దెబ్బతీసి రైతులను నష్టాలపాలు చేస్తోందన్న విమర్శ ఉంది. దీంతో పాటు అనుమతి లేని బీజీ–3 పత్తి విత్తనాన్ని కొన్ని కంపెనీలు రైతులకు అంటగట్టాయి. ఇప్పుడు సాగైన పత్తిలో 15 నుంచి 20 శాతం బీజీ–3 పత్తి విత్తనమే ఉంటుందని అంచనా. నకిలీ, అనుమతిలేని పత్తి విత్తనంతో అనేకచోట్ల రైతులు నష్టపోయారు.
పత్తి స్థానంలో మక్కలు వేసే ఆలోచనలో రైతులు
పత్తి పంట దిగుబడికి మరో రెండు నెలల వరకు సమయం ఉంది. కానీ గులాబి రంగు పురుగు కారణంగా దిగుబడిపై ఆశలు వదులుకున్న రైతులు పచ్చగా ఉన్న పత్తి చేన్లను రైతులు తొలగిస్తున్నారు. పత్తిపంటను దున్నేసి దాని స్థానంలో యాసంగిలో మక్కలు వేయడానికి సిద్ధమవుతున్నారు. యాసంగిలో మక్కల సాగుకు అనుకూల పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈసారి పెద్ద ఎత్తున మక్కల సాగు జరిగే అవకాశముందని అగ్రికల్చర్ ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు.
గులాబి పురుగు బారిన ఐదు లక్షల ఎకరాలు
రాష్ట్రంలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 48.93 లక్షల ఎకరాలు కాగా ఈ సీజన్‌లో 45.85 లక్షల ఎకరాల్లో సాగైంది. మొంథా తుఫాన్ ప్రభావంతో పత్తి రైతులకు తీరని నష్టం జరిగింది. 1,51,707 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక నివేదికలో తేల్చింది. వరంగల్, హనుమకొండ, జనగామ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, నల్గొండ, నాగర్‌కర్నూల్, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లో భారీగా పంట నష్టం జరిగినట్లు గుర్తించారు. వానల నుంచి తేరుకోగానే పత్తి పంటపై గులాబీ రంగు పురుగులు దాడి పెరిగింది. వాతావరణ ప్రభావంతో పురుగు మరింతగా విజృంభించి పత్తికాయలను తొలిచేయడంతో దిగుబడులు దారుణంగా పడిపోయే ప్రమాదం ఏర్పడుతోంది. దాదాపు ఐదు లక్షల ఎకరాల్లో సాగైన పత్తి గులాబీ పురుగు బారిన పడినట్లు తెలుస్తోంది. ఫలితంగా పత్తి పంటంతా దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతోంది. గులాబీ పురుగు ఉధృతికి ఎడతెరిపి లేని వానలు, మబ్బుపట్టిన వాతావరణమే కారణమని నిపుణులు అంటున్నారు.
