- వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి రాయితీలు ఇవ్వలే
- మన రైతుల ప్రయోజనాలకు పూర్తి రక్షణ కల్పించినం
- ఎంఎస్‌ఎంఈ రంగానికి పెరుగనున్న ఎగుమతి అవకాశాలు
- అమెరికాకు ఎక్స్‌పోర్ట్ అయ్యే వ్యవసాయ
- ఉత్పత్తులపై 50% నుంచి జీరోకు తగ్గనున్న టారిఫ్స్
- పొరుగు దేశాల కంటే మనకే తక్కువ సుంకాలు
- పూర్తిస్థాయి ఒప్పందంపై మార్చిలో భారత్, అమెరికా సంతకాలు
- ఈ ఒప్పందం దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని వెల్లడి
న్యూఢిల్లీ: భారత్–అమెరికా మధ్య కుదిరిన ట్రేడ్ డీల్‌పై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ క్లారిటీ ఇచ్చారు. రైతులకు వ్యతిరేకమని, వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తుందని ఈ ఒప్పందంపై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. శనివారం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడారు. అమెరికా ఉత్పత్తులకు భారత మార్కెట్లను అందుబాటులోకి తెస్తున్న తరుణంలో, మన దేశ రైతుల ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగదని భరోసా ఇచ్చారు.
ఈ ట్రేడ్ డీల్ ‘న్యాయబద్ధంగా, సమతుల్యంగా’ ఉన్నదని పేర్కొన్నారు. ఈ ఒప్పందంలో వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ఎలాంటి రాయితీలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. అదే సమయంలో దేశ ఇండస్ట్రీలు.. ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈ రంగానికి ఎగుమతి అవకాశాలను విస్తృతం చేసేలా నిబంధనలు రూపొందించినట్లు వెల్లడించారు. సుమారు 44 బిలియన్ డాలర్ల విలువైన భారతీయ ఎగుమతులు అమెరికాకు సున్నా సుంకంతో వెళ్తాయని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో రైతులకు నష్టం కలిగించే ఏ నిర్ణయం తీసుకోబోమని, ఈ ఒప్పందం దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుందని వెల్లడించారు.
సున్నితమైన అంశాల్లో ఎక్కడా వెనక్కి తగ్గలే
వ్యవసాయ రంగంలో విదేశీ దిగుమతులకు పూర్తిగా అనుమతించలేదని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ఎర్రజొన్నలు, వైన్స్, స్పిరిట్స్ లాంటి కొన్ని ఎంపిక చేసిన అమెరికా ప్రొడక్ట్స్‌ను మాత్రమే భారత్‌లోకి అనుమతించినట్టు తెలిపారు.‘‘మన రైతులు, ఆర్టిజన్స్, చేనేత రంగానికి ఈ ఒప్పందం వల్ల ఎలాంటి నష్టం జరగదు” అని పేర్కొన్నారు. భారత్ ఏ రంగాల్లోనైతే స్వయం సమృద్ధి సాధించిందో, ఆ రంగాలను ఈ ఒప్పందం పరిధిలోకి తీసుకురాలేదని వివరించారు. ముఖ్యంగా సున్నితమైన అంశాల విషయంలో భారత్ ఎక్కడా వెనక్కి తగ్గలేదని వెల్లడించారు.
పొరుగు దేశాల కంటే తక్కువ సుంకాలు
అమెరికా మార్కెట్‌లో భారతీయ ఎగుమతిదారులకు గొప్ప అవకాశం దక్కిందని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ‘‘గతంలో ఉన్న 50% సుంకాన్ని అమెరికా 18 శాతానికి తగ్గించింది. భారత్ పై విధిస్తున్న అదనపు 25 శాతం డ్యూటీని కూడా ఉపసంహరించుకున్నది. చైనా (35%), వియత్నాం (20%), బంగ్లాదేశ్ (20%), ఇండోనేసియా (19%) లాంటి మన పొరుగు దేశాల కంటే ఇది తక్కువ. ఇది మన ఎగుమతిదారులకు అంతర్జాతీయ మార్కెట్‌లో పెద్ద ఊతం ఇవ్వనున్నది” అని పేర్కొన్నారు.
అమెరికాకు చేసే ఎగుమతుల్లో చాలా ఉత్పత్తులపై ఇప్పుడు ఎలాంటి సుంకాలు ఉండబోవని చెప్పారు. స్మార్ట్‌ఫోన్లు, రత్నాలు, వజ్రాలు, ఫార్మా ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు, టీ, కాఫీ, కొబ్బరి, కొబ్బరి నూనె, జీడిపప్పు, కొన్ని రకాల పండ్లు, కూరగాయలను సుంకాల బెడద లేకుండా అమెరికాకు ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చని వెల్లడించారు.
ఎగుమతిదారులకు స్వర్ణయుగం
పూర్తిస్థాయి ఒప్పందంపై మార్చిలో భారత్, అమెరికా సంతకాలు చేస్తాయని పీయూష్ గోయల్ తెలిపారు. ఆ తర్వాత 30 ట్రిలియన్ డాలర్ల అమెరికా మార్కెట్‌లోకి భారత ఎగుమతిదారులకు అవకాశం లభిస్తుందని వివరించారు. ‘‘ఈ ఒప్పందం ద్వారా డేటా సెంటర్లు, ఏఐ, క్వాంటం కంప్యూటింగ్‌లాంటి రంగాల్లో భారత్‌కు భారీ అవకాశాలు లభిస్తాయి. ఐసీటీ వస్తువులు, హై-క్వాలిటీ చిప్స్, మెడికల్ డివైసెస్, ఫార్మాస్యూటికల్స్ లాంటి వాటిని పొందడం భారత్‌కు సులభం అవుతుంది. ఇది నిజంగా రైతులకు, మత్స్యకారులకు, భారతీయ పరిశ్రమలకు భారీ ప్రయోజనాలను చేకూర్చే ఒప్పందం” అని వివరించారు.
ఇది భారత్‌కు ‘మోస్ట్ ఫేవరెడ్ నేషన్’ హోదాను ఇస్తుందని, భవిష్యత్తులో మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతు ప్రయోజనాలపై ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. ‘‘దేశంలో కొంతమంది వ్యక్తులు రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నారు. వారు దేశ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. భారత్– అమెరికా వాణిజ్య ఒప్పందంలో దేశ రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చూసి వారు ఆశ్చర్యపోతున్నారు’’ అని ప్రతిపక్షాలపై గోయల్ విరుచుకుపడ్డారు.
మేకిన్ ఇండియా బలోపేతం: మోదీ
న్యూఢిల్లీ: అమెరికాతో కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ‘మేక్ ఇన్ ఇండియా’ను మరింత బలోపేతం చేయడమే కాకుండా, భారతీయ రైతులు, పారిశ్రామికవేత్తలకు అంతర్జాతీయ మార్కెట్లో కొత్త అవకాశాలను కల్పిస్తుందని పేర్కొన్నారు. అమెరికాతో ట్రేడ్ డీల్‌పై శనివారం ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ ఒప్పందం వల్ల దేశం లోని మహిళలకు, యువతకు భారీ స్థాయి లో ఉపాధి అవకాశాలు లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, స్టార్టప్ ఆవిష్కర్త లు, మత్స్యకారులకు ఇది ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. ‘‘ఇది భారత్ – అమెరికా రెండు దేశాలకు గొప్ప శుభవార్త” అని పేర్కొన్నారు. ఈ కొత్త ఫ్రేమ్‌వర్క్ ఇరు దేశాల మధ్య పరస్పర విశ్వాసం, పార్ట్‌నర్‌షిప్ డెవలప్‌మెంట్‌కు నిదర్శనమని అన్నారు. భారత్ ‘వికసిత భారత్’ లక్ష్యంతో ముందుకు సాగుతున్న సమయంలో ఇలాంటి భవిష్యత్తు ఆధారిత ప్రపంచ భాగస్వామ్యాలు ప్రజలను శక్తివంతం చేస్తాయని అన్నారు.
ఎవరికి ఎంత లాభం?
ఇండియాకు..
టెక్స్‌టైల్స్ పుంజుకుంటుంది. టారిఫ్ 18 శాతానికి తగ్గడంతో అతిపెద్ద దుస్తుల మార్కెట్ అయిన యూఎస్‌కు ఇండియా నుంచి ఎగుమతులు పెరుగుతాయి.
లెదర్, ఫుట్‌వేర్ ఇండస్ట్రీకి పెద్ద రిలీఫ్. ఎగుమతులపై టారిఫ్‌ను 50 నుంచి18 శాతానికి తగ్గించడంతో మన ప్రొడక్టులను తక్కువ ధరకే యూఎస్‌లో అమ్ముకోవచ్చు.
రత్నాలు, వజ్రాలపై సుంకాలు సున్నాకు తగ్గించారు. ఇది ఈ రంగానికి భారీ ప్రయోజనం. పాలిష్ చేసిన వజ్రాలు, నగల కొనుగోళ్లలో యూఎస్ టాప్. జీరో టారిఫ్‌తో అమ్మకాలు, లాభాలు రెండూ పెంచుకోవచ్చు.
యూస్‌లో మన జెనరిక్ మందులకు మార్కెట్ఉంది. జీరో టారిఫ్‌లతో మరింత చౌకగా ఇస్తూ అక్కడి మార్కెట్‌ను భారత ఫార్మా కంపెనీలు విస్తరిస్తాయి.
విమాన విడిభాగాలను భారత్‌లో తయారు చేయడం సులభం. ఇక్కడి యువతకు ఉపాధి పెరుగుతుంది.
అమెరికాకు..
పండ్లు, కూరగాయలు, వాల్నట్స్, బాదం లాంటి నట్స్, వైన్, స్పిరిట్స్, సోయాబీన్ ఆయిల్, ఎర్ర జొన్నలపై టారిఫ్‌లను భారత్ రద్దు చేస్తున్నది. దీంతో అక్కడి రైతులకు ప్రయోజనం.
మెడికల్ డివైజస్, ఐటీ ఉత్పత్తుల దిగుమతుల్లో ఉన్న రూల్స్‌ను ఈజీ చేశారు. దీంతో అమెరికా కంపెనీలకు ఇక్కడ యాక్సెస్ పెరుగుతుంది.
అమెరికా నుంచి రాబోయే ఐదేళ్లలో రూ.500 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించింది.
జన్యుమార్పిడి ప్రొడక్ట్స్‌కు నో!
ఎలాంటి జన్యుమార్పిడి ఉత్పత్తుల దిగుమతులను అనుమతించబోమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. జీన్ మోడిఫైడ్ పంటలు, మాంసం, పౌల్ట్రీ, పాడి ఉత్పత్తులు, సోయాబీన్, మొక్కజొన్న, వరి, గోధుమలు, చక్కెర, తృణధాన్యాలు (జొన్నలు, సజ్జలు, రాగులులాంటివి) తక్కువ టారిఫ్‌లతో భారత్‌లోకి వచ్చే అవకాశంలేదని చెప్పారు.
అమెరికా నుంచి రాబోయే అరటి, స్ట్రాబెర్రీ, చెర్రీ, సిట్రస్‌లాంటి భారత్‌లో పండే పండ్లకు ఎలాంటి రాయితీలు ఇవ్వలేదని చెప్పారు. గ్రీన్ టీ, కాబూలీ శనగలు, పెసర్లు, నూనె గింజలు, వేరుశనగ, పొగాకు, ఇథనాల్ లాంటి వాటికి కూడా టారిఫ్ రిలీఫ్ ఇవ్వలేదని స్పష్టం చేశారు.
