అక్కడ సోనియా, ఇక్కడ కేసీఆర్ తో పీకే భేటీ

అక్కడ సోనియా, ఇక్కడ కేసీఆర్ తో పీకే భేటీ
  • ఢిల్లీలో సోనియాతో, ప్రగతిభవన్​లో కేసీఆర్​తో ​పీకే భేటీ
  • సందేహాస్పదంగా మారిన వరుస సమావేశాలు
  • కొత్త పొత్తులపై ప్రచారం.. గందరగోళంలో లీడర్లు
  • పీకే కంపెనీ తమకే పని చేస్తుందంటున్న కేటీఆర్
  • టీఆర్​ఎస్​తో తెగదెంపుల కోసమే కేసీఆర్​తో పీకే భేటీ: రేవంత్​ 

హైదరాబాద్, వెలుగు: స్ట్రాటజిస్టులు పొద్దున ఒక పార్టీ​తో, రాత్రికి మరో పార్టీ​తో మంతనాలు జరుపుతుండటం రాష్ట్ర రాజకీయాల్లో హాట్​ టాపిక్​గా మారింది. ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది.. రాబోయే ఎన్నికల్లో ఎవరు ఎవరితో కలిసి సీట్లు పంచుకుంటారనే చర్చ నడుస్తోంది. తాజా పరిణామాలతో ఎన్నికలకు ఏడాది ముందే కొత్త సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. 

పీకేపై రెండు పార్టీల్లో పోటీ

తాము పీకేను తెచ్చుకున్నది నిజమేనని, యంగ్​ జనరేషన్​ ఓటర్లను ఆకట్టుకునేందుకేనని టీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ క్లారిటీ ఇచ్చారు. జనరేషన్‌‌‌‌ మారుతున్న కొద్దీ, కాలానుగుణంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా రాజకీయాల్లో మార్పులు తీసుకురావాలని.. అందుకే పీకేను తీసుకువచ్చామని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మరోవైపు టీఆర్​ఎస్​తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకునేందుకే ప్రశాంత్​ కిశోర్​ రాష్ట్రానికి వచ్చారని పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి కామెంట్​ చేశారు. పీకేను కాంగ్రెస్​లో చేర్చుకోవాలా, వద్దా.. అనే విషయంలో సోనియాగాంధీ ఎనిమిది మందితో ఒక కమిటీని వేశారని ఆయన చెప్పారు. టీఆర్​ఎస్​తో పొత్తు ప్రసక్తే లేదని,  అదే విషయాన్ని  రాహుల్​ తమకు స్పష్టంగా చెప్పినట్లు వివరణ ఇచ్చుకున్నారు. ప్రశాంత్​ కిశోర్​ రాష్ట్ర కాంగ్రెస్​ గెలుపు కోసం పని చేస్తారని, కేసీఆర్​తో భేటీని అడ్డం పెట్టుకొని టీఆర్​ఎస్​ తమ శ్రేణుల్లో అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తున్నదని పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ 
మహేశ్​ గౌడ్​ అన్నారు. మరోవైపు కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ మణిక్కం ఠాకూర్​ ఒక్కరే భిన్నంగా స్పందించారు. శత్రువుతో స్నేహం చేసిన వ్యక్తిని ఎప్పటికీ నమ్మొద్దంటూ.. పీకే,  కేసీఆర్​ భేటీని ఉద్దేశించి ట్వీట్​ చేశారు. 

సునీల్​ ఉన్నట్టా.. లేనట్టా..?

ఇప్పటికే ఎలక్షన్​ స్ట్రాటజిస్టు సునీల్​ కనుగోలు కాంగ్రెస్​ పార్టీ తరఫున రాష్ట్రంలో పని చేస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో  ఒక విడత సర్వే చేసి రాహుల్​కు నివేదికను అందజేశారు. ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్​ లీడర్ల భేటీలోనూ ఆయన రాహుల్​ వెంట ఉన్నారు. సునీల్​ గతంలో పీకే టీమ్​ ఐప్యాక్​లో మెంబర్​. పీకేతో విడిపోయాక మైండ్​షేర్​ అనలిటిక్స్​ పేరుతో కొత్త కంపెనీ స్టార్ట్ చేశారు.  ఇప్పుడు పీకే ఎంట్రీ ఇస్తే.. సునీల్​ కొనసాగే చాన్స్ లేదని పార్టీ లీడర్లు బాహాటంగానే చెప్తున్నారు. పీకే తమ వాడని బయటకు  చెప్పుకునేందుకు అటు టీఆర్​ఎస్​, ఇటు కాంగ్రెస్​ పోటీ పడుతున్నాయి. లోలోపల మాత్రం ‘‘ఇదేంటి ఈ పీకే వ్యవహారం? రెండిండ్ల సంసారం లెక్కుంది. ఇంతకీ ఎవరికి ఎసరు పెడతారో?”అని ఉభయపక్షాల వాళ్లు గొనుక్కుంటున్నారు. ఇదంతా చూస్తుంటే.. రాబోయే ఎన్నికలకు స్ట్రాటజీలు, స్ట్రాటజిస్టులు తప్ప ప్రజల కష్టనష్టాలపై పార్టీలకు పట్టింపులేనట్లుగా ఉందని విమర్శలు వస్తున్నాయి. 


ఢిల్లీలో అట్లా.. ఇక్కడ ఇట్లా..

జాతీయ స్థాయిలో పేరొందిన ఎలక్షన్​ స్ట్రాటజిస్టు ప్రశాంత్​ కిశోర్​ ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్​ చీఫ్​ సోనియాతో.. హైదరాబాద్​లో కేసీఆర్​తో రెండు రోజులు వరుసగా భేటీ కావటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పీకే తమ పార్టీలో చేరే అవకాశముందని ఢిల్లీలో కాంగ్రెస్​ నేతలు బహిరంగంగా ప్రకటించారు. అదే టైమ్​లో రాష్ట్రానికి వచ్చిన  పీకే.. ఏకంగా  ప్రగతి భవన్​లో బస చేయటం రెండు పార్టీలకు షాకిచ్చింది. పీకే​ కాంగ్రెస్​తో ఉంటారా.. టీఆర్​ఎస్​తోనే ఉన్నారా.. అనేది సందేహాస్పదంగా మారింది. రెండు పార్టీల పొత్తు కోసం రాయబారం మొదలైందనే ప్రచారానికి తావిచ్చింది. మరోవైపు  రెండు పార్టీల లీడర్లు.. పీకే తమవాడంటే తమవాడని చెప్పుకునేందుకు పోటీ పడుతుండటం ప్రజల్లో ఆసక్తి రేపుతున్నది. వరుసగా రెండుసార్లు సీఎంగా ఉన్న కేసీఆర్​కు.. ఇప్పుడు బీహార్​కు చెందిన స్ట్రాటజిస్ట్ అవసరం ఏమొచ్చిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.