టౌన్‌‌షిప్‌‌ పాలసీకి సూచనలివ్వండి : కేటీఆర్‌‌

టౌన్‌‌షిప్‌‌ పాలసీకి సూచనలివ్వండి : కేటీఆర్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టౌన్‌‌షిప్‌‌  పాలసీకి తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని మంత్రి కేటీఆర్‌‌ రియల్‌‌ ఎస్టేట్‌‌ వ్యాపారులను కోరారు. గురువారం ఎంఏయూడీలో క్రెడాయ్‌‌ ప్రతినిధులు ఆయనను కలిశారు. బిల్డింగ్‌‌ పర్మిషన్ల జారీని పారదర్శకంగా పూర్తి చేసేందుకు ఆన్‌‌లైన్‌‌ విధానాన్ని తీసుకువచ్చామని మంత్రి చెప్పారు. కొత్త టౌన్‌‌షిప్‌‌ పాలసీపై ప్రజల స్పందనను అడిగి తెలుసుకున్నారు. ఈ పాలసీని ఇంకా సులభతరం చేసేందుకు సీనియర్‌‌ అధికారులు స్టడీ చేస్తున్నారని, బిల్డర్స్‌‌ అసోసియేషన్‌‌ నుంచి కొందరు వారితో కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను స్టడీ చేసి అత్యుత్తమ విధానంగా తీర్చిదిద్దాలని కోరారు.

నిర్మాణ వ్యర్థాలను చెరువుల్లో వేయొద్దు

హైదరాబాద్‌‌లో రియల్‌‌ ఎస్టేట్‌‌ వృద్ధి దశలో కొనసాగుతోందని మంత్రి కేటీఆర్​ చెప్పారు. ఎవరైనా నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నగరాల్లో భవన నిర్మాణాల వ్యర్థాలను మళ్లీ ఉపయోగించుకునేలా రీ సైక్లింగ్‌‌ ప్లాంట్లను ఏర్పాటు చేశామని  తెలిపారు. ఇకపై ఎవరైనా నిర్మాణ వ్యర్థాలను చెరువుల్లో, ఖాళీ స్థలాల్లో వేస్తే చర్యలు తప్పవన్నారు. హైదరాబాద్‌‌ వెస్ట్‌‌ సిటీ ఇప్పటికే కంపెనీలతో నిండిపోయిందని, జన సాంద్రత పెరగడంతో ఇతర ప్రాంతాలకు కంపెనీలు, పెట్టుబడులు వచ్చేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. రియల్‌‌ ఎస్టేట్​ వ్యాపారులు కార్పొరేట్‌‌ సోషల్‌‌ రెస్పాన్సిబిలిటీలో భాగంగా జీహెచ్‌‌ఎంసీతో కలిసి పనిచేయాలని సూచించారు.